Begin typing your search above and press return to search.

రోహిత్‌ను వెనక్కి నెట్టి వన్డే ‘కింగ్’ మళ్లీ విరాట్ కోహ్లీనే!

భారత క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. రికార్డుల రారాజు, టీమ్ ఇండియా ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ మరోసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన విశ్వరూపాన్ని చాటాడు.

By:  A.N.Kumar   |   15 Jan 2026 12:57 AM IST
రోహిత్‌ను వెనక్కి నెట్టి వన్డే ‘కింగ్’ మళ్లీ విరాట్ కోహ్లీనే!
X

భారత క్రికెట్ ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. రికార్డుల రారాజు, టీమ్ ఇండియా ‘రన్ మెషీన్’ విరాట్ కోహ్లీ మరోసారి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తన విశ్వరూపాన్ని చాటాడు. గత ఐదేళ్లుగా ఊరిస్తున్న అగ్రస్థానాన్ని ఎట్టకేలకు 2026లో కోహ్లీ కైవసం చేసుకున్నాడు. తన ప్రాణ మిత్రుడు, కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి విరాట్ మళ్లీ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించాడు.

సింహాసనం మళ్లీ ‘కింగ్’ వశం

2021లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయిన తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ ఆ స్థాయికి చేరుకోవడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. మధ్యలో ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తనదైన శైలిలో పుంజుకుని 'క్లాస్ ఈజ్ పర్మనెంట్' అని నిరూపించాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ: 785 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. రోహిత్ శర్మ 775 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు.

రోహిత్ వర్సెస్ విరాట్.. స్నేహపూర్వక పోరు

గత ఏడాది కాలంగా రోహిత్ శర్మ వన్డేల్లో నిలకడగా రాణిస్తూ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చారు. అయితే ఇటీవల జరిగిన సిరీస్‌లలో కోహ్లీ కనబరిచిన అసాధారణ ప్రదర్శన అతడిని మళ్లీ నంబర్ వన్ పీఠంపై కూర్చోబెట్టింది. రోహిత్ పాయింట్లు 781 నుండి 775కి స్వల్పంగా తగ్గడం కూడా కోహ్లీకి కలిసొచ్చింది. ఏది ఏమైనా భారత జట్టులోని ఇద్దరు దిగ్గజాలు టాప్ ఫామ్‌లో ఉండటం టీమ్ ఇండియాకు కొండంత బలాన్నిస్తోంది.

భారత వన్డే క్రికెట్‌కు ‘స్వర్ణయుగం’

ప్రస్తుతం భారత జట్టు ఉన్న ఫామ్ చూస్తుంటే వన్డే క్రికెట్‌లో స్వర్ణయుగం నడుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు విరాట్ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ప్రత్యర్థి జట్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2026లో కోహ్లీ మళ్లీ నంబర్ వన్‌గా మారడం రాబోయే ఐసీసీ టోర్నమెంట్లకు శుభసూచకంగా భావిస్తున్నారు. ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం. విరాట్ కోహ్లీ మరోసారి ప్రపంచానికి తానెంటో నిరూపించాడు అని క్రికెట్ అభిమానులు సంబరపడుతున్నారు.