Begin typing your search above and press return to search.

'నాతో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు'... అడ్డంగా దొరికిన బ్రావో.. వీడియో వైరల్

గ్రౌండ్‌లో వికెట్లు తీయడం ఎంత సులువో.. మైక్ ముందు వివాదాలు కొనితెచ్చుకోవడం అంతకన్నా సులువు అని వెస్టిండీస్ ‘డిస్కో కింగ్’ డ్వేన్ బ్రావో మరోసారి నిరూపించారు.

By:  A.N.Kumar   |   22 March 2026 12:05 AM IST
నాతో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు... అడ్డంగా దొరికిన బ్రావో.. వీడియో వైరల్
X

గ్రౌండ్‌లో వికెట్లు తీయడం ఎంత సులువో.. మైక్ ముందు వివాదాలు కొనితెచ్చుకోవడం అంతకన్నా సులువు అని వెస్టిండీస్ ‘డిస్కో కింగ్’ డ్వేన్ బ్రావో మరోసారి నిరూపించారు. ఐపీఎల్ అంటేనే వ్యూహాలు, విశ్లేషణలు అని అందరూ సీరియస్‌గా బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే మన బ్రావో మాత్రం తన ‘పర్శనల్ లైఫ్’ అప్‌డేట్స్‌తో ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఒక్కసారిగా ‘డేటింగ్ యాప్’ రేంజ్‌కు తీసుకెళ్లారు.కెకెఆర్ మేనేజ్‌మెంట్ తనను సంప్రదించినప్పుడు తాను ఎంత 'బిజీ'గా ఉన్నారో అదీ ఇద్దరు అమ్మాయిలతో! అని బ్రావో గారు లైవ్ మైక్‌లో పూసగుచ్చినట్టు చెప్పేసరికి, పక్కనే ఉన్న కెప్టెన్ అజింక్య రహానేకు ఏ పిచ్‌ మీద ఫీల్డింగ్ సెట్ చేయాలో అర్థం కాక తెల్లముఖం వేశారు. "అన్నయ్య.. ఇది ప్రెస్ మీట్, మైక్ ఆన్‌లో ఉంది" అంటూ రహానే కంగారుగా వారించినా అప్పటికే జరగాల్సిన ‘డ్యామేజ్’ జరిగిపోయింది. క్రికెటర్లకు హుందాతనం ఉండాలని కొందరు నీతులు చెబుతుంటే.. "బ్రావో అంటేనే బిందాస్, ఇందులో తప్పేముంది?" అని ఆయన ఫ్యాన్స్ మీమ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం మీద, బ్రావో విసిరిన ఈ 'స్లోయర్ బాల్' సోషల్ మీడియాలో క్లీన్ బౌల్డ్‌లు, సిక్సర్లు రెండూ కొడుతోంది!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కేవలం క్రికెట్ మాత్రమే కాదు, గ్లామర్, వినోదం, అప్పుడప్పుడు వివాదాల కలయిక. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మెంటార్, వెస్టిండీస్ మాజీ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెను దుమారాన్నే రేపుతోంది. మైదానంలో తన ఆటతీరుతోనే కాకుండా బయట తన సరదా స్వభావంతో 'ఛాంపియన్' అనిపించుకునే బ్రావో, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.

అసలేం జరిగింది?

కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఏర్పాటు చేసిన అధికారిక మీడియా సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమావేశంలో కెప్టెన్ అజింక్య రహానే, హెడ్ కోచ్ అభిషేక్ నాయర్, అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్‌లతో కలిసి బ్రావో పాల్గొన్నారు. జట్టు వ్యూహాలు, రాబోయే మ్యాచ్‌ల ప్రణాళికల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో వాతావరణం కాస్త గంభీరంగా ఉంది. ఆ గంభీరతను పోగొట్టి వాతావరణాన్ని తేలికపరచాలనే ఉద్దేశంతో బ్రావో తనదైన శైలిలో జోక్ పేల్చారు. తమ జట్టు యాజమాన్యం లేదా కోచింగ్ స్టాఫ్ తనను సంప్రదించిన సమయం గురించి చెబుతూ.. "వాళ్లు నాకు కాల్ చేసినప్పుడు.. నా పక్కన ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. బ్రావో ఈ మాట అనగానే పక్కనే ఉన్న కెప్టెన్ అజింక్య రహానే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో రహానే వెంటనే జోక్యం చేసుకుని, "మైక్ ఆన్‌లో ఉంది జాగ్రత్త" అంటూ బ్రావోను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వారంతా ఆ క్షణానికి నవ్వుకున్నప్పటికీ ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి రాగానే కథ అడ్డం తిరిగింది.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చూసే ప్రెస్ మీట్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఒక వర్గం విమర్శిస్తోంది. సెలబ్రిటీలు, ముఖ్యంగా క్రీడాకారులు యువతకు ఆదర్శంగా ఉండాలని.. పబ్లిక్ ఫోరమ్‌లలో మాట్లాడేటప్పుడు హుందాతనాన్ని పాటించాలని వారు కోరుతున్నారు. మైక్ ముందు ఉన్నప్పుడు ఏది మాట్లాడాలి.. ఏది మాట్లాడకూడదనే విచక్షణ ఉండాలని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. మరోవైపు బ్రావో అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. బ్రావో ఎప్పుడూ సరదాగా ఉంటాడని, అది కేవలం ఒక 'కాజువల్' కామెంట్ మాత్రమేనని వారు వాదిస్తున్నారు. కరీబియన్ సంస్కృతిలో ఇలాంటి సరదా మాటలు సహజమని.. దీన్ని వివాదంగా మార్చాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.

డిజిటల్ యుగంలో 'జాగ్రత్త' తప్పనిసరి

ఈ ఘటన సెలబ్రిటీలకు ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో చిన్న పొరపాటు చేసినా అది క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. గతంలో కూడా హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లు టాక్ షోలలో చేసిన వ్యాఖ్యల వల్ల నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్రావో వ్యాఖ్య అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై ఇలాంటివి చర్చకు దారితీయడం సహజం.

ప్రస్తుతానికి ఈ వివాదంపై కెకెఆర్ యాజమాన్యం కానీ డ్వేన్ బ్రావో కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ 'గర్ల్ ఫ్రెండ్' కామెంట్ సెటైర్లు మీమ్స్‌తో హోరెత్తిపోతోంది. బ్రావో తన తదుపరి ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇస్తారో లేదో వేచి చూడాలి.