ప్రపంచ కప్ తెచ్చిన శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ఏం ఇస్తుందో?
టీమ్ ఇండియా మహిళలు తొలిసారి ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారు. ఇందులో తెలుగమ్మాయి ఒక్కరే.
By: Tupaki Entertainment Desk | 5 Nov 2025 4:57 PM ISTటీమ్ ఇండియా మహిళలు తొలిసారి ప్రపంచ కప్ విజేతలుగా నిలిచారు. ఇందులో తెలుగమ్మాయి ఒక్కరే. మరో అమ్మాయి కూడా జట్టుతో పాటే ఉన్నా తుది జట్టులో ఆడే చాన్స్ రాలేదు. మైదానంలో దిగే అవకాశం దక్కిన ఆ తెలుగమ్మాయి కడప జిల్లా వీరపునాయునిపల్లెకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి. తనదైన శైలి స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ తో శ్రీ చరణి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించింది. మరీ ముఖ్యంగా ఫైనల్లో దక్షిణాఫ్రికాను కట్టడి చేసింది. మెగా టోర్నీలో ప్రత్యర్థి బ్యాటర్లు చెలరేగుతున్న ప్రతిసారి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్... తన ఆయుధంగా శ్రీచరణినే ఎంచుకునేది. ఫైనల్లోనూ ఇలానే ఈ తెలుగమ్మాయిని నమ్మింది. అందుకు శ్రీచరణి మంచి ఫలితమే ఇచ్చింది. ఇక ప్రస్తుతం టీమ్ ఇండియా మహిళల జట్టు ఢిల్లీలో ఉంది. ఆదివారం రాత్రి ప్రపంచ కప్ గెలిచాక క్రికెటర్లు తెల్లవారుజాము దాక సంబరాల్లో మునిగిపోయారు. సోమవారం విశ్రాంతి తీసుకుని మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు.
చరణి ఏపీకి వచ్చేది ఎప్పుడంటే..?
ఢిల్లీ నుంచి బయల్దేరి శ్రీ చరణి గురువారం సొంత రాష్ట్రం ఏపీకి రానుంది. గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీచరణికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ప్రకటించే చాన్సుందని భావిస్తున్నారు. కాగా, ఆమె వయసు 21 ఏళ్లే అయినందున అప్పుడే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారా? అని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, ప్రపంచ కప్ సాధించడం వంటి గొప్ప క్రీడా రికార్డులో భాగమైనందున ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, ఇంటిస్థలం, నగదు నజరానా కూడా ప్రకటిస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ఫైనల్లో శ్రీచరణి బౌలింగ్ కు వచ్చాకనే దక్షిణాఫ్రికా కాస్త వెనక్కుతగ్గింది. ఆమె పొదుపుగా బౌలింగ్ చేసింది.
తుది సమరంలోనే కాదు..
ఫైనల్లోనే కాదు టోర్నీ మొత్తం శ్రీచరణి ప్రదర్శన అద్భుతం అనేచెప్పాలి. ఆల్ రౌండర్ దీప్తిశర్మ (22) తర్వాత అత్యధిక వికెట్లు (14) తీసింది శ్రీచరణినే కావడం విశేషం. ఎకానమీ కూడా 4.96 మాత్రమే. 27.64 పరుగులకు ఒక వికెట్ చొప్పున పడగొట్టింది. అందుకని శ్రీచరణి ప్రతిభకు తగ్గట్లుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సన్మానిస్తుందని భావిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో ఆమెను ఆహ్వానం పలుకుతుందని.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు శ్రీచరణిని కలుస్తారు. ఆ సందర్భంగానే రివార్డుల ప్రకటన ఉండనుంది.
