పాక్ కెప్టెన్‌కు హగ్ ఇచ్చిన జెమీమా.. వైరల్ వీడియో.. సోషల్ మీడియాలో చర్చ..
పోనీ ఈ డ్రామా పక్కనపెట్టి అసలు మ్యాచ్ కథ చూద్దామంటే.. అక్కడ మాత్రం సౌతర్న్ బ్రేవ్ జట్టు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌ను 24 పరుగుల తేడాతో చితక్కొట్టేసింది.
By: A.N.Kumar | 1 Aug 2026 7:41 PM ISTఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్‌లో క్రికెట్ కంటే ఎక్కువగా ఇప్పుడు నెటిజన్ల ‘రక్తం మరిగిపోతున్న’ వార్త ఒకటే.. సౌతర్న్ బ్రేవ్, బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మధ్య మ్యాచ్ ముగిశాక భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనాని పలకరిస్తూ ఒక్క 'ఆత్మీయ ఆలింగనం' ఇచ్చింది. అంతే.. కెమెరా కంటికి ఆ దృశ్యం చిక్కిందో లేదో సోషల్ మీడియా సైనికులు తమ కీబోర్డులకి పదును పెట్టేశారు.
పహల్గామ్ ఘటన తర్వాత కరచాలనాలు వద్దనుకున్న పరిస్థితుల్లో.. ఈ "హగ్" ఏంటి సామీ? అంటూ కొందరు దేశభక్తి డిజిటల్ మీటర్లు పెంచి విమర్శల వర్షం కురిపిస్తుంటే మరికొందరేమో "అబ్బే.. క్రీడాస్ఫూర్తికి సరిహద్దుల్లేవు భయ్యా" అంటూ శాంతి కపోతాల్లా కవితలు చదివేస్తున్నారు. మొత్తానికి మ్యాచ్‌లోని ప్రతీ బంతి కంటే ఈ ఐదు సెకన్ల ఆలింగనమే ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మైదానంలో ఏం జరిగింది?
పోనీ ఈ డ్రామా పక్కనపెట్టి అసలు మ్యాచ్ కథ చూద్దామంటే.. అక్కడ మాత్రం సౌతర్న్ బ్రేవ్ జట్టు బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌ను 24 పరుగుల తేడాతో చితక్కొట్టేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతర్న్ బ్రేవ్ 100 బంతుల్లో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఓపెనర్లు లిజెల్ లీ (43), మైయా బౌచియర్ (45) పునాది వేస్తే చివర్లో ఈ ‘హగ్ వివాద’ కథానాయకి జెమీమా రోడ్రిగ్స్ కేవలం 18 బంతుల్లోనే 28 పరుగులు పిండుకుని నాటౌట్‌గా నిలిచింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ 100 బంతుల్లో 5 వికెట్లకు 116 పరుగులకే పరిమితమైంది. డవినా పెర్రిన్ (52) అర్ధశతకం చేసినా ఆమెకు తగిన మద్దతు లభించలేదు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా బౌలింగ్‌లో 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి వికెట్లేమీ తీయలేకపోయింది. బ్యాటింగ్‌లోనూ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయింది. సౌతర్న్ బ్రేవ్ జట్టుకు ఇది ఈ సీజన్‌లో వరుసగా నాలుగో విజయం కాగా బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు.
రాజకీయాలను, సోషల్ మీడియా ట్రోల్స్‌ను పక్కనపెడితే.. ఫ్రాంచైజీ లీగ్స్ అంటేనే క్రీడాకారుల కలయిక. కానీ మనోళ్ల ఉత్సాహం చూస్తుంటే, రేపు పొద్దున్న కరచాలనం చేసినా బంధుత్వాలు వెతికేలా ఉన్నారు. ఏది ఏమైనా మైదానంలో విజయం సౌతర్న్ బ్రేవ్‌దే అయినా, సోషల్ మీడియా మైలేజ్ మాత్రం 'హగ్' కొట్టేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
