Begin typing your search above and press return to search.

వ‌న్డేల‌కూ రిటైర్మెంట్ దిశ‌గా టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్?

2025 సంవ‌త్స‌రం ప్రారంభం అవుతూనే భార‌త క్రికెట్ లో స్టార్ల ఆట‌గాళ్ల‌ రిటైర్మెంట్ల ప‌రంప‌ర న‌డిచింది.

By:  Tupaki Political Desk   |   17 Jan 2026 1:00 AM IST
వ‌న్డేల‌కూ రిటైర్మెంట్ దిశ‌గా టీమ్ఇండియా స్టార్ క్రికెట‌ర్?
X

2025 సంవ‌త్స‌రం ప్రారంభం అవుతూనే భార‌త క్రికెట్ లో స్టార్ల ఆట‌గాళ్ల‌ రిటైర్మెంట్ల ప‌రంప‌ర న‌డిచింది. సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తో మొద‌లైన ఈ లెక్క‌.. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, చ‌తేశ్వ‌ర్ పుజారా వ‌ర‌కు వ‌చ్చింది. ఈ న‌లుగురిలో ఇప్ప‌టికే పుజారా టెస్టు జ‌ట్టులో చోటు కోల్పోయాడు. అయితే, అనూహ్యంగా కెప్టెన్ గా ఉన్న రోహిత్, స్టార్ బ్యాట‌ర్ అయిన విరాట్ కోహ్లి రిటైర్మెంటే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అదికూడా ఇంగ్లండ్ వంటి కీల‌క టూర్ ముంగిట కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ఏడాది కూడా స్టార్ క్రికెట‌ర్ రిటైర్మెంట్ తోనే మొద‌లు అవుతుందా? గ‌త టి20 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం అనంత‌రం ఆ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికిన ఈ ఆట‌గాడు.. టెస్టుల్లో కొన‌సాగుతూ వ‌న్డేల‌కు బైబై చెబుతాడా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్ అనంత‌రం త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాడా? అనే ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. న్యూజిలాండ్ పై రెండు వ‌న్డేల్లోనూ విఫ‌లం కావ‌డంతో ఈ స్టార్ క్రికెట‌ర్ నిర్ణ‌యం తీసుకుంటాడ‌ని చెబుతున్నారు.

సొంత‌గ‌డ్డ‌పైనా వైఫ‌ల్యం...

న్యూజిలాండ్ తో రెండు వ‌న్డేల్లోనూ విఫ‌ల‌మ‌య్యాడు స్టార్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా. అది కూడా త‌న సొంత‌గ‌డ్డ రాజ్ కోట్ లోనూ రాణించ‌లేక‌పోయాడు. వ‌డోద‌ర‌లో జ‌రిగిన మొద‌టి వ‌న్డేలో 5 బంతుల్లో 4 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. 9 ఓవ‌ర్ల‌లో 56 ప‌రుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. రాజ్ కోట్ లో జ‌రిగిన రెండో వ‌న్డేలో అత‌డు 44 బంతుల్లో 27 ప‌రుగులే చేయ‌గ‌లిగాడు. పిచ్ స్లోగా ఉంద‌ని స‌రిపెట్టుకున్నా.. జ‌డేజా బ్యాటింగ్ తీరు కూడా నిరాశ‌ప‌రిచింది. బౌలింగ్ లో 8 ఓవ‌ర్లు వేసి 44 ప‌రుగులు ఇచ్చాడు. ఈసారీ వికెట్ ప‌డ‌గొట్ట‌లేక‌పోయాడు.

ఫామ్ కాదు.. స్పిన్ పోయింది..

జ‌డేజా అద్భుత‌మైన ఆల్ రౌండ‌ర్. కానీ, కొంత‌కాలంగా అత‌డి బౌలింగ్ లో బంతి తిర‌గ‌డం లేదు . బ్యాట్ తో ఓకే అయినా.. కీల‌క‌మైన బౌలింగ్ లో మ‌రీ నిరాశ‌ప‌రుస్తున్నాడు. ప్ర‌త్య‌ర్థులు జ‌డేజా బంతుల‌ను తేలిగా ఆడేస్తున్నారు. అస‌లు టెస్టుల్లోనూ జ‌డేజా బౌలింగ్ పై విమ‌ర్శ‌లున్నాయి. అత‌డు స‌భ్యుడిగా ఉన్న‌ప్ప‌టికీ 2024లో న్యూజిలాండ్ చేతిలో, 2025లో ద‌క్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా క్లీన్ స్వీప్ న‌కు గురైంది. అయితే, స్పిన్ ఆల్ రౌండ‌ర్ కావ‌డం, మ‌రే ఆల్ రౌండ‌ర్ లేక‌పోవ‌డంతో జ‌డేజాను త‌ప్పించే ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు మాత్రం అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా వ‌న్డేల్లో.

మూడో వ‌న్డే త‌ర్వాత‌..?

ఇండోర్ లో ఆదివారం జ‌రిగే మూడో వ‌న్డేలో జ‌డేజా ఎలా ఆడ‌తాడో చూడాలి. ఇందులోనూ విఫ‌ల‌మైతే అత‌డికి వ‌న్డే ద్వారాలు మూసుకుపోయిన‌ట్లే. 2024 టి20 ప్ర‌పంచ క‌ప్ గెలిచాక జ‌రిగిన శ్రీలంక టూర్ లో జ‌డేజాను ప‌క్క‌న‌పెట్టారు. ఆ త‌ర్వాత చాంపియ‌న్స్ ట్రోఫీకి తీసుకున్నారు. అయితే, ఈసారి మ‌రో చాన్స్ ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు అక్ష‌ర్ ప‌టేల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అచ్చం జ‌డేజాలాగే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణిస్తున్నాడు. అత‌డిని బెంచ్ కు ప‌రిమితం చేస్తూ జ‌డేజాను ఆడిస్తున్నార‌నే విమ‌ర్శలున్నాయి. వీట‌న్నిటి రీత్యా జ‌డేజా వ‌న్డే కెరీర్ దాదాపు ముగింపున‌కు వ‌చ్చింద‌ని భావింవ‌చ్చు. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ (2027) నాటికి అత‌డి స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ ను సుస్థిరం చేసే ప్ర‌ణాళిక‌ల్లో హెడ్ కోచ్ గౌత‌మ్ గంబీర్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకే.. ఆదివారం ఇండోర్ వ‌న్డే జ‌డేజాకు కీల‌కం.