రేపే ఐపీఎల్-19 మినీ వేలం.. కొత్త రూల్ తో విదేశీయులకు కళ్లెం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం ముహూర్తం దగ్గరపడుతోంది. మంగళవారం అబుదాబిలో లీగ్ 19వ సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది.
By: Tupaki Political Desk | 15 Dec 2025 8:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం ముహూర్తం దగ్గరపడుతోంది. మంగళవారం అబుదాబిలో లీగ్ 19వ సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం జరగనుంది. 1,355 మంది రిజిస్టర్ చేసుకోగా.. షార్ట్ లిస్ట్ అనంతరం 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. 77 మందినే ఫ్రాంచైజీలు కొనేందుకు అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 19వ ఎడిషన్ కు జరిగేది మినీ వేలం. నిరుడు మెగా వేలం నిర్వహించినందున ఈసారి మినీ వేలం మాత్రమే ఉంటుంది. రేపటి ఆక్షన్ లో ఎవరి పంట పండుతుంది..? అనేది చూడాలి. ఈసారి మినీ వేలానికి భారత్ నుంచి స్టార్ క్రికెటర్లు ఎవరూ లేరు. ఇప్పటికే అందరూ ఆయా ఫ్రాంచైజీల్లో కుదురుకోవడమే దీనికి కారణం. కానీ, ఒక్క ప్లేయర్ పైన మాత్రం అందరి ఫోకస్ ఉంది. నిరుడు మెగా వేలంలో రూ.23.75 కోట్ల రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ కనీస స్థాయిలో ప్రదర్శన కూడా చేయలేదు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ అతడిని వేలానికి వదిలేసింది. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వస్తున్నాడు వెంకటేశ్ అయ్యర్. స్పిన్నర్ రవి బిష్ణోయ్ కూడా రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలో ఉన్నాడు. వీరిద్దరినీ ఎవరు తీసుకుంటారు..? ఎంతకు తీసుకుంటారు? అనేది చూడాలి.
విదేశీయులు ఎవరికైనా రూ.18 కోట్లే..!
మంగళవారం నాటి ఆక్షన్ లో విదేశీ ఆటగాళ్లకు భారీ ధర దక్కే చాన్సుంది. రూ.కోటితో వేలానికి వచ్చిన విధ్వంసక ప్లేయర్ క్వింటాన్ డికాక్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ వంటివారికి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా గ్రీన్ కే ఎక్కువ డబ్బులు వస్తాయని అంటున్నారు. ఈసారి విదేశీయుల్లో అతడే టాప్ పెయిడ్ ప్లేయర్ అవుతాడని అంచనా. కానీ, ఈ మొత్తం రూ.18 కోట్లకు మించదు. దీనికి కారణం ఉంది.
మెగా వేలం ఎగ్గొట్టి.. మినీ లో పాల్గొంటే..
కొందరు విదేశీ ఆటగాళ్లు మెగా వేలం ఎగ్గొట్టి.. నేరుగా మినీ వేలంలోకి వస్తున్నారు. గతంలో ఇలాంటి ఉదాహరణలు కనిపించాయి. దీంతో ఐపీఎల్ పాలక మండలి ఓ నిర్ణయం తీసుకుంది. విదేశీయుల అత్యధిక ప్రైస్ ను రూ.18 కోట్లుగా నిర్ణయించింది. తద్వారా ఆటగాళ్ల తాలూకు అతి తెలివికి కళ్లెం వేసింది.
-విదేశీ ఆటగాడు ఒకవేళ మినీ వేలంలో రూ.18 కోట్ల కంటే ఎక్కువ మొత్తం పొందినా అతడికి దక్కేది రూ.18 కోట్లే. ఆపైన మిగిలిన మొత్తం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి వెళ్తుంది. ఈ డబ్బును ఆటగాళ్ల సంక్షేమానికి ఉపయోగిస్తారు. మంగళవారం అబుదాబిలో మధ్యాహ్నం 2.30 నుంచి జరిగే మినీ వేలం జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ టెలికాస్ట్ కానుంది.
