Begin typing your search above and press return to search.

ఐఎండీబీ రేటింగ్స్ : ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఇవే!

ఐదో స్థానంలో నిలిచిన 2023 ఫైనల్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ అర్థరాత్రి దాటిన తర్వాత రిజర్వ్ డే రోజున జరిగింది.

By:  A.N.Kumar   |   9 April 2026 8:02 PM IST
ఐఎండీబీ రేటింగ్స్ :  ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఇవే!
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే కేవలం క్రికెట్ కాదు.. అదొక భావోద్వేగాల ప్రవాహం. మైదానంలో ఆటగాళ్ల మధ్య పోరు, గ్యాలరీలో అభిమానుల అరుపులు.. చివరి బంతి వరకు కొనసాగే ఉత్కంఠ.. ఇవన్నీ ఐపీఎల్‌ను ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌గా మార్చాయి. తాజాగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్ ఐఎండీబీ... ఐపీఎల్ చరిత్రలో ప్రేక్షకులను అత్యధికంగా అలరించిన ఊపిరి బిగబట్టేలా చేసిన టాప్-5 ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా మరోసారి పాత జ్ఞాపకాలను క్రికెట్ ప్రేమికుల కళ్లముందు కదలాడేలా చేస్తోంది.

1. 2019 ఫైనల్: ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్

ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది 2019 ఐపీఎల్ ఫైనల్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్లాసిక్ థ్రిల్లర్. ముంబై నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై చివరి వరకు పోరాడింది. లసిత్ మలింగ వేసిన ఆఖరి ఓవర్లో చివరి బంతికి కేవలం ఒక పరుగు తేడాతో ముంబై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. షేన్ వాట్సన్ రక్తమోడుతున్న గాయంతో ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది.

2. 2023: రింకూ సింగ్ 'మిరాకిల్' (కోల్ కతా vs గుజరాత్ టైటాన్స్)

రెండో స్థానంలో నిలిచిన మ్యాచ్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అసాధ్యం అనిపించిన లక్ష్యాన్ని రింకూ సింగ్ సుసాధ్యం చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు కావాల్సి ఉండగా యశ్ దయాళ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ సింగ్, కేకేఆర్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషింగ్‌గా గుర్తింపు పొందింది.

3. 2014: ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్

మూడో స్థానంలో నిలిచిన ఈ మ్యాచ్ ఒక వ్యూహాత్మక అద్భుతం. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే రాజస్థాన్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై కేవలం 14.4 ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంది. కోరీ ఆండర్సన్ విధ్వంసం.. ఆఖరి బంతికి ఆదిత్య తారే కొట్టిన సిక్సర్ ముంబైని ప్లేఆఫ్స్‌కు చేర్చాయి. రన్ రేట్ లెక్కలతో సాగిన ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తించింది.

4. 2017 ఫైనల్: ముంబై ఇండియన్స్ వర్సెస్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్

నాలుగో స్థానంలో 2017 ఫైనల్ నిలిచింది. ముంబై ఇండియన్స్ కేవలం 129 పరుగులు మాత్రమే చేసినప్పటికీ అద్భుతమైన బౌలింగ్‌తో పుణె జట్టును కట్టడి చేసింది. ఆఖరి ఓవర్లో మిచెల్ జాన్సన్ అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై మళ్ళీ ఒకే ఒక్క పరుగు తేడాతో విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఐపీఎల్‌లో బౌలర్లు కూడా మ్యాచ్‌లను గెలిపించగలరని నిరూపించింది.

5. 2023 ఫైనల్: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్

ఐదో స్థానంలో నిలిచిన 2023 ఫైనల్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. వర్షం కారణంగా నిలిచిపోయిన ఈ మ్యాచ్ అర్థరాత్రి దాటిన తర్వాత రిజర్వ్ డే రోజున జరిగింది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు కావాల్సిన తరుణంలో రవీంద్ర జడేజా ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి చెన్నైకి ఐదో టైటిల్‌ను అందించాడు. ధోనీ భావోద్వేగానికి లోనై జడేజాను ఎత్తుకున్న దృశ్యం ఐపీఎల్ చరిత్రలో మరుపురాని ఘట్టం.

ఐఎండీబీ విడుదల చేసిన ఈ టాప్-5 జాబితా చూస్తే ఐపీఎల్ ఎందుకు ప్రపంచంలోనే బెస్ట్ లీగ్ అనేది అర్థమవుతుంది. కేవలం బ్యాట్, బాల్ మధ్య పోరు మాత్రమే కాకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే పట్టుదల, చివరి క్షణం వరకు వదలని పోరాటం ఐపీఎల్ సొంతం. ఈ ఐదు మ్యాచ్‌లు క్రికెట్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి.