Begin typing your search above and press return to search.

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

ఐపీఎల్‌లో జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పుణే, వడోదర కేంద్రాలుగా కొత్త ఫ్రాంచైజీలు వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. 2028 నుంచి కొత్త జట్లు రంగంలోకి దిగవచ్చని, తద్వారా మ్యాచ్‌లు, మీడియా హక్కుల ఆదాయం పెరిగే అవకాశం ఉందని అంచనా.

By:  A.N.Kumar   |   10 Nov 2026 4:00 PM IST
ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
X

ఐపీఎల్ అంటేనే కాసుల వేట.. ఆటగాళ్లు, ప్రాంచైజీలు, బీసీసీఐ ఒక్కో సీజన్ కు కోట్లు సంపాదిస్తారు. అంతలా క్రేజ్ ఉన్న ఈ ఐపీఎల్ లో జట్ల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంటోంది. 8 జట్లతో మొదలైన ఈ ప్రయాణం కొత్తగా గుజరాత్, లక్నో జట్ల రాకతో 10కి చేరింది. ఇప్పుడు మరో 2 జట్లను దించేసి మరిన్ని కాసుల గలగలతో నింపాలని బీసీసీఐ పెద్దప్లానింగే చేస్తోంది.

ఐపీఎల్.. మన దేశంలో క్రికెట్ అంటే ప్రాణమిచ్చే అభిమానులను ఏటా రెండు నెలలు టీవీలకు అతుక్కుపోయేలా చేసి.. జేబులు గుల్ల చేసే అసలైన ‘ఎంటర్‌టైన్‌మెంట్ సర్కస్’. ఈ లీగ్‌ను చూస్తుంటే భవిష్యత్తులో దేశంలోని ప్రతీ గల్లీకి ఒక ఐపీఎల్ జట్టు వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లున్నాయి. అసలే పదేళ్లుగా పది జట్లతో ఆడిస్తూ ప్రేక్షకులకు కాస్తోకూస్తో నిద్రపోయే అవకాశం ఇస్తున్న బీసీసీఐకి ఆ మాత్రం విశ్రాంతి కూడా ఇష్టం లేనట్టుంది. అందుకే ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 12కు పెంచేయాలని మరో మాస్టర్ ప్లాన్‌కు తెరలేపింది.

అసలు మనోళ్లకు ఏమైంది? పది జట్లతో రోజుకో మ్యాచ్ చూసి చూసి విసిగిపోయి భార్యాపిల్లలను పట్టించుకుంటున్న సామాజిక జీవులను మళ్లీ స్టేడియాల చుట్టూ తిప్పడమే బీసీసీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. సరిపోలేదన్నట్లు మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని వడోదర నగరాలను కూడా కొత్త జట్ల కోసం దించుతున్నారట. ఈ లెక్కన చూస్తే రేపు పొద్దున మన ఊరి పంచాయతీ ఆఫీసు ముందు కూడా ఒక ఐపీఎల్ టీమ్ పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. "జనాభా పెరుగుతోంది. ఐపీఎల్ జట్లు ఎందుకు పెరగవు?" అని మనోళ్ళు లాజిక్ లాగుతున్నారు మరి.

ఈ కొత్త జట్ల ఎంట్రీ ఎప్పుడనుకుంటున్నారు? కచ్చితంగా 2028 నుంచి అట. దీని వెనుక పెద్ద ‘దేశభక్తి’ కోణం ఉందనుకుంటే పప్పులో కాలేసినట్లే. 2028-2032 మధ్య వచ్చే మీడియా రైట్స్, బ్రాడ్‌కాస్టింగ్ డీల్స్ రేట్లు ఆకాశాన్ని తాకాలి కదా.. పది జట్లతో అయితే కొంచెం తక్కువొస్తాయి.. అదే పన్నెండు జట్లైతే ఇంకా కాస్త ఎక్కువ సంపాదింవచ్చు.. ప్రేక్షకుడికి ఎంటన్ టైన్ మెంట్ పంచేసి, టీవీ కంపెనీలకు కాసుల వర్షం కురిపించే ఈ ‘మాస్టర్ మైండ్’ ప్లాన్ చూస్తుంటే ఎవరికైనా దండం పెట్టాలనిపిస్తుంది.

జట్లు పెరిగితే మ్యాచ్‌లు పెరుగుతాయి. మ్యాచ్‌లు పెరిగితే బెట్టింగులు, ఫాంటసీ లీగ్‌లు, సోషల్ మీడియా రచ్చ మరింత పెరుగుతుంది. క్రికెట్ చూసి చూసి కళ్ళు బైర్లు కమ్మిన వాడికి మరో రెండు జట్లు అదనపు భారం కాక ఇంకేమవుతాయి? "అరె బాబూ మాకు పది జట్ల తలపోటే చాలు నాయనా" అంటే.. "కాదు మీ బ్రెయిన్ ఇంకాస్త వాడటానికి మరో రెండు జట్లు ఇస్తాం" అంటున్న బోర్డు పెద్దల దయ తలుచుకుంటే కన్నీళ్లు ఆగవు.

యువ ఆటగాళ్లకు ఛాన్సులు వస్తాయనేది ఒకే మంచి పాయింట్ అనుకోండి. కానీ ఉన్న పదకొండు మందికి సరిగ్గా అవకాశాలు ఇవ్వకుండా ప్రతీ ఏటా కొత్త కుర్రాళ్ళని తెచ్చి బెంచ్‌ల మీద కూర్చోబెట్టడానికి మరో రెండు జట్లు ఎందుకో ఆ దేవుడికే తెలియాలి.

ఐపీఎల్‌ని క్రికెట్ టోర్నమెంట్‌లా కాకుండా ఒక అంతులేని వ్యాపార సామ్రాజ్యంగా మార్చేయడంలో బీసీసీఐ సక్సెస్ అవుతోంది. రేపు పొద్దున ఈ లీగ్ కాస్తా 365 రోజులూ సాగే ‘సీరియల్’లా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పుణే, వడోదర అభిమానులైతే పండగ చేసుకుంటున్నారు సరే.. కానీ ఈ 12 జట్ల పోటీలను చూడడానికి సిద్ధమవుతున్న సామాన్య క్రికెట్ ప్రేమికుడి గుండె జైత్రయాత్ర గురించే ఎవరూ ఆలోచించడం లేదు.