Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌లో విచిత్ర పరిస్థితి : ఆర్సీబీ గెలవాలని సీఎస్కే ఫ్యాన్స్ పూజలు

ఎప్పుడూ ఉప్పు-నిప్పులా ఉండే చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల మధ్య ఇప్పుడు సరికొత్త ‘తాత్కాలిక సెంటిమెంట్’ నడుస్తోంది.

By:  A.N.Kumar   |   17 May 2026 11:33 AM IST
ఐపీఎల్‌లో  విచిత్ర పరిస్థితి : ఆర్సీబీ గెలవాలని సీఎస్కే ఫ్యాన్స్ పూజలు
X

ఐపీఎల్ అంటేనే అన్‌ప్రెడిక్టబిలిటీ. ఇక్కడ ప్రతి మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. నిన్నటి వరకు పాయింట్ల పట్టికలో అడుగున ఉన్న జట్టు ఒక్కసారిగా పైకి లేవడమే కాదు.. ఇతర జట్ల తలరాతలను కూడా మార్చేసే సత్తా ఈ లీగ్‌కు ఉంది. అందుకే ఐపీఎల్‌ను కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్‌గా కాకుండా ఎమోషన్స్, డ్రామా, అడ్వెంచర్‌తో కూడిన ఒక ప్యాకేజీగా అభిమానులు భావిస్తారు. అయితే ఈ సీజన్‌లో పాయింట్ల పట్టిక సమీకరణాలు ఎంత విచిత్రంగా మారాయంటే... ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక వింతైన, అత్యంత క్రేజీ సీనారియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎప్పుడూ ఉప్పు-నిప్పులా ఉండే చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల మధ్య ఇప్పుడు సరికొత్త ‘తాత్కాలిక సెంటిమెంట్’ నడుస్తోంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండటం కోసం చెన్నై ఫ్యాన్స్ అంతా కలిసి ఇప్పుడు ఆర్సీబీ విజయాన్ని కాంక్షిస్తున్నారు!

ఐపీఎల్ మ్యాథ్స్ మహిమ.. ఆర్సీబీ ఓడితే సీఎస్‌కే కథ ముగిసే అవకాశం!

ఈ విచిత్ర పరిస్థితికి కారణం పాయింట్ల పట్టికలో ఏర్పడిన క్లిష్టమైన సమీకరణాలే. పంజాబ్ కింగ్స్ తో జరగబోయే అత్యంత కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గనుక ఓడిపోతే అది కేవలం ఆ జట్టుకు మాత్రమే కాదు... చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలపై కూడా కోలుకోలేని దెబ్బ తీస్తుంది.

పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ముందుకు దూసుకుపోతే, అది సీఎస్‌కే టాప్-4 రేసును మరింత క్లిష్టం చేస్తుంది. నెట్ రన్ రేట్, పాయింట్ల లెక్కల ప్రకారం సీఎస్‌కే సురక్షితంగా ఉండాలంటే పంజాబ్ ఇక్కడే ఆగాలి. పంజాబ్ ఆగాలంటే ఆర్సీబీ గెలవాలి. దీంతో ఇప్పుడు చెన్నై అభిమానులందరూ తమ చిరకాల ప్రత్యర్థి అయిన ఆర్సీబీ వైపు నిలబడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ మ్యాథ్స్ ముందు ఎంతటి శత్రుత్వమైనా మోకరిల్లాల్సిందే అనడానికి ఇదే నిదర్శనం.

ఎన్నాళ్ల ప్రత్యర్థులు... ఇప్పుడు తాత్కాలిక మిత్రులు!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న రైవల్రీస్ లో ‘సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ’ మొదటి స్థానంలో ఉంటుంది.మైదానంలో ‘థాలా’ మహేంద్ర సింగ్ ధోనీ చాణక్యం, ‘కింగ్’ విరాట్ కోహ్లీ అగ్రెషన్ మధ్య జరిగే పోరును చూడటానికి రెండు కళ్లు చాలవు. సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్రోల్స్, రికార్డుల వేటతో ఈ రెండు జట్ల అభిమానులు నిరంతరం యుద్ధం చేసుకుంటూనే ఉంటారు.

కానీ ప్రస్తుత టోర్నమెంట్ సిట్యుయేషన్ ఈ ఇరు జట్ల అభిమానులను ఒకే తాటిపైకి తెచ్చింది. నిన్నటివరకు ఆర్సీబీని ట్రోల్ చేసిన సీఎస్‌కే ఫ్యాన్స్, ఈరోజు అదే ఆర్సీబీ జెండా పట్టుకుని “ఈ ఒక్క మ్యాచ్‌కైనా మీరు గెలవాలి బాసూ!” అంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ.. “ఈరోజుకి మాత్రమే... ఈ సాలా కప్ నమ్‌దే!”

ఈ క్రేజీ సీనారియో చూసి నెటిజన్లు ఊరుకుంటారా? సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ వరదలా వచ్చి పడుతున్నాయి. విక్రమార్కుడు సినిమాలో రవితేజ డైలాగ్స్, ఎన్నాళ్లో వేచిన ఉదయం సినిమా సీన్లు వాడుకుంటూ మీమర్స్ రెచ్చిపోతున్నారు. సీఎస్‌కే జెర్సీ వేసుకున్న అభిమాని ఆర్సీబీ లోగో వైపు ఆరాధనగా చూస్తున్నట్లు ఉన్న ఎడిటింగ్ పిక్చర్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. “రైవల్రీ అనేది గుండెల్లో ఉంటుంది, కానీ పాయింట్ల పట్టిక అనేది మైండ్‌లో ఉంటుంది. కాబట్టి ఈరోజుకి మాత్రమే... ఈ సాలా కప్ నమ్‌దే!”

ఇదే కదా అసలైన ఐపీఎల్ మ్యాజిక్!

ఒక్క మ్యాచ్‌తో పాయింట్ల పట్టిక తలకిందులు కావడం, ఒక జట్టు ఓటమితో మరో జట్టు ఆశలు చిగురించడం... ఇవన్నీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే సాధ్యం. ఇక్కడ ఎవరూ శాశ్వత శత్రువులు కారు, అలాగని శాశ్వత మిత్రులూ కారు. కేవలం 'సమీకరణాలు' మాత్రమే ఇక్కడ శాశ్వతం. మరి చెన్నై ఫ్యాన్స్ నమ్మకాన్ని, ఆశలను నిలబెడుతూ పంజాబ్‌పై ఆర్సీబీ విజయం సాధిస్తుందా? లేదా పంజాబ్ రివర్స్ స్ట్రోక్ ఇచ్చి ఇరు జట్ల ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లుతుందో చూడాలి!