Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్: ఇక మార్పు తప్పదా? కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

By:  A.N.Kumar   |   31 Aug 2026 3:17 PM IST
ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్: ఇక మార్పు తప్పదా? కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత కొన్నేళ్లుగా అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఈ రూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక సమీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీల నుంచి బీసీసీఐ ప్రత్యక్ష అభిప్రాయాలను కోరింది. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపైనే కాకుండా అంపైరింగ్ ప్రమాణాలు, ప్లేయింగ్ కండిషన్స్, ప్రాక్టీస్ సెషన్స్ , ఇతర క్రికెట్ ఆపరేషన్స్‌పై కూడా ఫ్రాంచైజీల నుంచి సలహాలు సేకరిస్తోంది. అయితే వీటన్నింటిలోనూ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భవిష్యత్తుపైనే క్రికెట్ వర్గాల్లో అత్యంత ఆసక్తి నెలకొంది.

2023 సీజన్ నుండి అమల్లోకి వచ్చిన ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన, సాంప్రదాయ టీ20 క్రికెట్ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేసింది. ఈ రూల్ ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో జట్లు తమ 11 మంది సభ్యుల ప్లేయింగ్ ఎలెవన్‌తో పాటు.. పరిస్థితిని బట్టి అదనంగా ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ లేదా స్పెషలిస్ట్ బౌలర్‌ను మైదానంలోకి దించే అవకాశం లభించింది. దీనివల్ల జట్లకు అదనపు వ్యూహాత్మక స్వేచ్ఛ లభించినప్పటికీ సంప్రదాయంగా ఉండే ఆల్‌రౌండర్ల ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోయిందనే విమర్శలు తీవ్రమయ్యాయి. ఒక జట్టు బ్యాటింగ్ సమయంలో అదనపు బ్యాటర్‌ను, బౌలింగ్ సమయంలో అదనపు బౌలర్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు ఉండటంతో, బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయగల సహజసిద్ధమైన ఆల్‌రౌండర్ల అవసరం జట్లకు లేకుండా పోయింది.

ఈ నిబంధనపై రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్ వంటి పలువురు ప్రముఖ భారతీయ ఆటగాళ్లు గతంలోనే తమ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల భారత క్రికెట్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్లు తయారయ్యే అవకాశాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన చెందారు. దీనికి తోడు, ఈ రూల్ వచ్చిన తర్వాత ఐపీఎల్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం సాధారణ విషయంగా మారింది. అదనపు బ్యాటింగ్ ఆప్షన్ ఉండటంతో జట్లు మొదటి ఓవర్ నుంచే వికెట్ల గురించి ఆలోచించకుండా విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. దీనివల్ల 250 పైచిలుకు స్కోర్లు తేలికగా నమోదవుతూ బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. అంతిమంగా ఇది బ్యాట్, బాల్ మధ్య ఉండాల్సిన సహజ సమతుల్యతను దెబ్బతీస్తోందనే వాదన బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఫ్రాంచైజీల నుంచి అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ మాత్రమే జరుగుతోంది. రాబోయే రోజుల్లో జట్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్, ఆటగాళ్ల అభిప్రాయాలు, గత కొన్ని సీజన్లలో నమోదైన గణాంకాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే బోర్డు తన తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. జట్లకు వ్యూహాత్మక సౌలభ్యాన్ని ఇవ్వడానికి తీసుకొచ్చిన ఈ నిబంధనను యథాతథంగా కొనసాగిస్తారా, కొన్ని మార్పులు చేర్పులతో ఉంచుతారా, లేక పూర్తిగా స్వస్తి పలుకుతారా అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.