పెరుగుట విరుగుట కొరకే... ఐపీఎల్ విలువ 10 బిలియన్ డాలర్ల లోపునకు
ఇంతకాలం పైపైకి వెళ్లడమే తప్ప వెనక్కు తిరిగి చూడని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ పడిపోయింది.
By: Tupaki Entertainment Desk | 15 Oct 2025 2:54 PM ISTపెరుగుట విరుగుట కొరకే అన్న తెలుగు సామెత తప్పు అని నిరూపిస్తూ... ఇంతకాలం పైపైకి వెళ్లడమే తప్ప వెనక్కు తిరిగి చూడని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ పడిపోయింది. టెలికాస్టింగ్ హక్కుల ద్వారానే రూ.వేల కోట్లు కళ్లచూసే ఈ క్యాష్ రిచ్ లీగ్.. ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ గా మారింది. ఐపీఎల్ కు ఇలా జరగడం వరుసగా రెండో ఏడాది కావడం గమనార్హం.
సక్సెస్ ఫుల్ కు అసలైన మీనింగ్
ఐపీఎల్ అంటే.. సక్సెస్ కు పర్యాయపదం. దీనిని చూసి ప్రపంచంలో ఎన్నో లీగ్ లు వచ్చినా ఒక్కటీ దీని స్థాయికి చేరలేకపోయాయి. అయితే, ఈ ఏడాది లీగ్ విలువ 11 శాతం తగ్గింది. ఇప్పుడు ఐపీఎల్ విలువ 8.8 బిలియన్ డాలర్లు. ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ డీ అండ్ పీ అడ్వైజరీ వాల్యుయేషన్ రిపోర్ట్ ఈ మేరకు నివేదించింది. వాస్తవానికి 2023లోనే ఐపీఎల్ విలువ 11.2 బిలియన్ డాలర్లు. గత ఏడాది 9.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇప్పుడు మళ్లీ అంతకంటే కిందకు పడిపోయింది. వరుసగా రెండో ఏడాది 10 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
లక్ష కోట్ల నుంచి...
భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న ఐపీఎల్ విలువ ప్రస్తుత 8.8 బిలియన్ డాలర్లు అంటే రూ.76,100 కోట్లు. రెండేళ్ల కిందట 11.2 బిలియన్ డాలర్లు అంటే 11,200,000,00. కాగా, విలువ పతనానికి మూల కారణం.. మీడియా హక్కుల కోసం పోటీ తగ్గడం, ఆన్ లైన్ మనీ గేమింగ్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధమే. కాగా, గత ఏడాది ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్ఊ రూ.82,700 కోట్లు (9.9 బిలియన్ డాలర్లు). అంటే.. రెండేళ్లలో ఐపీఎల్ విలువ 2.4 బిలియన్ డాలర్లు తగ్గిందన్నమాట.
మహిళల ప్రీమియర్ లీగ్ కూడా...
-ఈ ఏడాది జరిగిన 18వ సీజన్ లో ఐపీఎల్ స్ట్రీమింగ్ ప్రసార హక్కులు కలిగిన జియో హాట్ స్టార్ ఏకంగా రూ.4,500 కోట్లు ఆర్జించింది. ఇదంతా అడ్వర్టయిజ్ మెంట్ సొమ్ము. ఇక లీగ్ బ్రాండ్ వ్యాల్యూ అత్యధికంగా ఉన్న ఫ్రాంచైజీ తొలిసారి ఈ ఏడాది చాంపియన్ గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)లది తర్వాతి స్థానం. ఐపీఎల్ తో పాటే మహిళలకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)ను నిర్వహిస్తోంది బీసీసీఐ. దీని విలువ 2024లో రూ.1,350 కోట్లు. ఈ ఏడాది రూ.1,275 కోట్లకు తగ్గింది.
