ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్
ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ట్రేడింగ్ వ్యవహారం తీవ్ర ఆసక్తికరంగా మారింది.
By: A.N.Kumar | 2 Nov 2026 11:56 PM ISTఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ట్రేడింగ్ వ్యవహారం తీవ్ర ఆసక్తికరంగా మారింది. రాబోయే కొత్త సీజన్ కోసం జట్లను బలోపేతం చేసుకునే క్రమంలో ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ వద్ద ఉన్న ఆటగాళ్ల ప్రదర్శనలపై సమగ్ర కసరత్తు చేస్తున్నాయి. ఎవరిని ఉంచుకోవాలి? ఎవరిని వేలంలోకి విడుదల చేయాలి? ట్రేడింగ్ ద్వారా ఎవరిని జట్టులోకి తెచ్చుకోవాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ (ఎంఐ), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) మధ్య హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అజింక్యా రహానే రిటైర్మెంట్ తర్వాత కేకేఆర్‌కు సుదీర్ఘకాలం నడిపించగల అనుభవజ్ఞుడైన కెప్టెన్ అవసరం ఏర్పడింది. దీంతో నాయకత్వ లక్షణాలతో పాటు ఆల్‌రౌండ్ నైపుణ్యం ఉన్న హార్దిక్ పాండ్యాపై కోల్‌కతా దృష్టి సారించింది. అయితే ఈ ట్రేడ్ కోసం ముంబై ఇండియన్స్ విపరీతమైన షరతులు విధించినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యాను పంపేందుకు బదులుగా కేకేఆర్ నుంచి యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, వికెట్ కీపర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీలను ఇవ్వాలని ముంబై డిమాండ్ చేసింది.
అయితే తమ భవిష్యత్తుకు వీరిద్దరూ అత్యంత కీలకమని భావిస్తున్న కేకేఆర్ యాజమాన్యం ముంబై ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ముంబై పెట్టిన డిమాండ్లకు కేకేఆర్ బ్రేక్ వేయడంతో ఈ ట్రేడింగ్ చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే హార్దిక్ ట్రేడ్ కోసం ముంబై యాజమాన్యం రాజస్థాన్ రాయల్స్ లోని యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్ లను ఎక్స్ చేంజ్ చేయాలని.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఆయుష్ మాత్రే లతో కూడా చర్చించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమ జట్టు ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. గత వేలంలో రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసిన యువ ఆల్‌రౌండర్ ప్రశాంత్ వీర్‌ను విడుదల చేసేందుకు ఆలోచిస్తోంది. ఐపీఎల్ 2026లో ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అతడిని పక్కన పెట్టి ఆ నిధులను మినీ వేలంలో ఉపయోగించుకోవాలని సీఎస్కే భావిస్తోంది.
అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్పై నమ్మకం ఉంచాలని నిర్ణయించింది. ఐపీఎల్ 2026లో అతడి ప్రదర్శన నిరాశాజనకంగా ఉన్నప్పటికీ ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలవడం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడంతో అతడికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది.
కాగా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను సమర్పించడానికి నవంబర్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ 2027 మినీ వేలం ఘనంగా జరగనుంది. గడువు సమీపిస్తుండటంతో రాబోయే రోజుల్లో ఐపీఎల్ ట్రేడింగ్ మార్కెట్ మరిన్ని ఆసక్తికర పరిణామాలకు వేదిక కానుంది.
