Begin typing your search above and press return to search.

ఐపీఎల్ 2027పై బీసీసీఐ సంచలన నిర్ణయం?

క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.

By:  A.N.Kumar   |   18 Jun 2026 4:30 PM IST
ఐపీఎల్ 2027పై బీసీసీఐ సంచలన నిర్ణయం?
X

క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. అభిమానులకు మరింత అనుకూలంగా అదే సమయంలో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేసవి తీవ్రత కారణంగా 2027 ఐపీఎల్ షెడ్యూల్‌లో ఊహించని మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వేసవి తీవ్రత.. ఆటగాళ్ల విలవిల

2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, అత్యంత ధనవంతమైన ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీగా ఎదిగింది. గతంలో కరోనా మహమ్మారి సమయంలోనూ, సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ అవసరమైతే విదేశాల్లో నిర్వహిస్తూ బీసీసీఐ ఈ టోర్నీకి ఎలాంటి ఆటంకం రానివ్వలేదు. ప్రతి ఏడాది కోట్లాది మంది అభిమానులను అలరించే ఈ మెగా టోర్నీకి సంబంధించి 2027 సీజన్ కోసం బోర్డు ముందుగానే సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. 2027 ఐపీఎల్‌ను గత సీజన్ల కంటే చాలా ముందుగానే ప్రారంభించే అంశంపై బీసీసీఐ గంభీరంగా ఆలోచిస్తోంది. దేశంలో ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత విపరీతంగా ఉంటోంది. దీంతో ఆటగాళ్లు మైదానంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మ్యాచ్‌ల సమయంలో పలువురు స్టార్ క్రికెటర్లు డీహైడ్రేషన్, క్రాంప్స్ కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో తీవ్రంగా బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రయోజనాల దృష్ట్యా షెడ్యూల్ మార్పు తప్పనిసరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మార్చి 10 నుంచే మెగా టోర్నీ?

బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 10 నుంచి మే 15 మధ్య ఐపీఎల్ నిర్వహించే ప్రతిపాదనపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో ముమ్మరంగా చర్చలు కొనసాగుతున్నాయి. సాధారణంగా మార్చి ఆఖర్లో ప్రారంభమయ్యే టోర్నీని ఈసారి దాదాపు 18 రోజుల ముందుగానే స్క్రీన్ పైకి తీసుకురావాలని చూస్తున్నారు.

అయితే మ్యాచ్‌ల సంఖ్య పెరుగుతుందా? అనే సందేహాలకూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ షెడ్యూల్ దృష్ట్యా మ్యాచ్‌ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 74 నుంచీ 94కు పెంచే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి గత సీజన్‌ల మాదిరిగానే 74 మ్యాచ్‌లతోనే టోర్నీ నిర్వహించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల ఆటగాళ్లపై అదనపు భారం పడదు.

వన్డే ప్రపంచకప్ ఎఫెక్ట్!

షెడ్యూల్‌ను ముందుకు జరపడానికి కేవలం ఎండలు మాత్రమే కారణం కాదు.. 2027లో జరగబోయే ఐసీసీ వన్డే ప్రపంచకప్ కూడా మరొక ప్రధాన కారణం. 2027 చివర్లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ఆటగాళ్లు తగిన విశ్రాంతి తీసుకోవడానికి, షెడ్యూల్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండటానికి ఐపీఎల్‌ను మే నెల మధ్యలోనే ముగించాలనేది బీసీసీఐ మాస్టర్ ప్లాన్.

అధికారిక ప్రకటన ఎప్పుడు?

అయితే ఇప్పటివరకు ఈ సరికొత్త తుది షెడ్యూల్‌పై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల అనంతరం పూర్తి వివరాలతో కూడిన అధికారిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ ఐపీఎల్‌ను ముందే ప్రారంభించాలనే ప్రతిపాదన క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలను, ఉత్కంఠను పెంచేసింది. వచ్చే సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందో అని ఫ్యాన్స్ ఇప్పుడే క్యాలెండర్లు తిరగేస్తున్నారు!