ఐపీఎల్ 19- మినీ వేలం.. రిలీజింగ్ ఆటగాళ్ల జాబితా పెద్దదే!
ఈ వేలం డిసెంబరు మూడో వారంలో జరిగే చాన్సుంది. అంటే అటుఇటుగా మరొక్క నెల సమయమే. అందుకే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ఆటగాళ్లు వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో ఫ్రాంచైజీల వారీగా చూస్తే..
By: Tupaki Entertainment Desk | 12 Nov 2025 9:16 AM ISTక్రికెట్ లో అత్యంత పాపులర్ లీగ్.. క్యాష్ రిచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి చిన్నగా మొదలవుతోంది. ఓవైపు ఆటగాళ్ల మార్పిడి కథనాలు వస్తుండగా.. మరోవైపు ఫ్రాంచైజీలు రిలీజ్ చేయనున్న ప్లేయర్లు వీరే అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా ఈ నెల 15లోగా రిటైన్ (అట్టిపెట్టుకునే), రిలీజ్ (విడుదల చేసే) ఆటగాళ్ల జాబితా ఇవ్వాలని బీసీసీఐ గడువు విధించింది. మరొక్క మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్ల పేర్లు బయటకు వస్తున్నాయి. ఇవి పూర్తి స్థాయిలో నిజం కాకపోయినా వీరిలోని కొందరు ప్లేయర్లనైనా ఫ్రాంచైజీలు వదులుకునే చాన్సుంది అనేది కాదనలేని నిజం. ఇక గత ఏడాది (18వ సీజన్ కోసం) ఐపీఎల్ మెగా వేలం జరిగినందున ఈసారి (19వ సీజన్ కు) మినీ వేలమే ఉండనుంది. ఈ వేలం డిసెంబరు మూడో వారంలో జరిగే చాన్సుంది. అంటే అటుఇటుగా మరొక్క నెల సమయమే. అందుకే ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ఆటగాళ్లు వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో ఫ్రాంచైజీల వారీగా చూస్తే..
చాంపియన్స్ నుంచి వెళ్లేదెవరో?
18వ సీజన్ లో ఎట్టకేలకు చాంపియన్ గా నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). సమష్టి ప్రయత్నంతో కప్ కొట్టింది ఈ జట్టు. అందులో వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ చాలా కీలకంగా నిలిచాడు. లోయరార్డర్ లో ఆర్సీబీకి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఇతడిని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. విధ్వంసక ఇంగ్లండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్ గత సీజన్ లో ప్రభావం చూపలేదు. ఇతడితో పాటు దేవదత్ పడిక్కల్, సుయాశ్ శర్మ, రసిక్ సలామ్, నువాన్ తుషారాలనూ విడుదల చేస్తుందట.
విజిల్ పొడు..పొయ్యేదెవరు?
వచ్చే సీజన్ కు ముందు అత్యంత చర్చనీయం అవుతోంది మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టుకు రాజస్థాన్ రాయల్స్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ వస్తాడని, కీలక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, శామ్ కరన్ వెళ్లిపోతారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. కానీ, చెన్నై ఆల్ రౌండర్ విజయ్ శంకర్, ఓపెనర్ డెవాన్ కాన్వే, హార్డ్ హిట్టర్ దీపక్ హుడా, బ్యాటర్ రాహుల్ త్రిపాఠిలను వదిలేస్తుందట.
ముంబై మురిపెం..
చెన్నైతో పాటు ఐదుసార్లు కప్ ను కొట్టింది ముంబై ఇండియన్స్. గత కొన్ని సీజన్లుగా పేలవ ప్రదర్శనే చేస్తుంది. ఆ రేళ్లుగా టైటిల్ లేదు. ఈసారి మాత్రం నిత్యం గాయాల బారినపడే పేసర్ దీపక్ చహర్ ను రిలీజ్ చేస్తుందని చెబుతున్నారు. రీస్ టాప్లీ, బెవన్ జాకబ్స్, ముజిబుర్ రెహ్మాన్ లనూ వద్దనుకుంటుందని సమాచారం.
మన హైదరాబాద్ సంగతేంటి..?
ముంబై నుంచి గత ఏడాది విధ్వంసక ఓపెనర్ ఇషాన్ కిషన్ ను తెచ్చుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. గుజరాత్ టైటాన్స్ నుంచి పేసర్ మొహమ్మద్ షమీని రూ.10 కోట్లకు పైగా వెచ్చింది తీసుకుంది. వీరిద్దరూ పెద్దగా ప్రభావం చూపలేదు. అందుకని వదిలేస్తుందట. స్పిన్నర్ ఆడమ్ జంపాతో పాటు దేశీయ క్రికెటర్ అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, హర్షల్ పటేల్ లనూ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.
గుజరాత్ ఆశ్చర్యం...
ఆడిన తొలి సీజన్ లోనే చాంపియన్ గా నిలిచిన గుజరాత్ టైటాన్స్.. కీలక స్పిన్నర్ రషీద్ ఖాన్ ను పక్కన పెడుతుందని కథనాలు వస్తున్నాయి. ఫినిషర్ గా ఉన్న రాహుల్ తెవాతియానూ వదిలేస్తుందట. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ, హిట్టర్ షారూఖ్ ఖాన్, కరీమ్ జనత్ లనూ పక్కన పెట్టనుందని సమాచారం.
- నిరుడు రూ.20 కోట్లకు పైగా పెట్టి కొన్నప్పటికీ అత్యంత నాసిరకమైన ప్రదర్శన చేసిన వెంకటేశ్ అయ్యర్ ను మాజీ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ వదిలేస్తుందని తెలుస్తోంది. అయితే, విధ్వంసక ఓపెనర్ డికాక్ నూ కాదనుకుంటుందని తెలియడమే హైలైట్. వెటరన్ మొయిన్ అలీ తో పాటు హిట్టర్ రమణ్ దీప్ సింగ్ నూ వదిలేస్తుందని చెబుతున్నారు.
-ఒక్కసారీ టైటిల్ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్లు ముకేశ్ కుమార్, నటరాజన్, మోహిత్ శర్మ తో పాటు సీనియర్ బ్యాటర్ డుప్లెసిస్, దుష్మంత చమీరను, ఆట కంటే వివాదాలు ఎక్కువగా ఉండే లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ షమారా జోసెఫ్, హిట్టర్ అబ్దుల్ సమద్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రిట్జ్ కేలను రిలీజ్ చేయనుందట.
-పంజాబ్ కింగ్స్.. అసలు ఫామ్ లో లేని మాక్స్ వెల్ తో పాటు స్టాయినిస్, విదేశీయులైన ఫెర్గూసన్, జేమీసన్, బ్రాట్ లెట్, హార్డీలను, దేశీయ ఆటగాళ్లు ప్రవీణ్ దూబె, విష్ణువినోద్, హర్నూర్ సింగ్ ను తప్పిస్తుందని సమాచారం.
కొసమెరుపుః రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్నసంజూను ఆ ఫ్రాంచైజీ వదులుకుంటుందా? అనేది తేలలేదు. పెద్దగా పేరు లేని ఆకాశ్ మధ్వాల్, ఫజల్ ఫారూఖీ, నంద్రే బర్గర్ తో పాటు కరీబియన్ హిట్టర్ హెట్ మయర్ ను వదులుకుంటుందని మాత్రం కథనాలు వస్తున్నాయి.
