ఐపీఎల్-19 మినీ వేలం..1,005 మంది ఔట్..కొత్తగా 35 మంది
మరొక్క వారం రోజులు..! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం జరగనుంది..! ఈసారి అబుదాబి దీనికి వేదిక కానుంది.
By: Tupaki Entertainment Desk | 9 Dec 2025 12:01 PM ISTమరొక్క వారం రోజులు..! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం జరగనుంది..! ఈసారి అబుదాబి దీనికి వేదిక కానుంది. గత ఏడాది మెగా వేలం నిర్వహించినందున ఈసారి మినీ వేలం నిర్వహించనున్నారు. 19వ సీజన్ కోసం మినీ వేలం ఆటగాళ్ల జాబితాను గత సోమవారమే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇచ్చింది. ఇక వచ్చే మంగళవారం జరిగే వేలంలో వీరిలోంచి జట్లు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, పేర్లు నమోదు చేసుకున్న జాబితాలో ఉన్న ఆటగాళ్లు ఎందురు? అంటే, వారి సంఖ్య 1,355. వేలంలో మాత్రం 77 మందినే కొనేందుకు ఫ్రాంచైజీలకు వీలుంది. దీంతో షార్ట్ లిస్ట్ చేయక తప్పలేదు. ఆ విధంగా ఏకంగా భారీగా కోత పెట్టేసింది.
ప్రతి నలుగురిలో ఒకరే...
ప్రపంచంలోనే అత్యంత పోటీ ఉండే లీగ్.. ఐపీఎల్. దీని వేలంలో కనీసం పేరు వినిపించినా చాలు.. కల నెరవేరినట్లేనని ఆటగాళ్లు భావిస్తుంటారు. తాజాగా మినీ వేలం నేపథ్యంలో బీసీసీఐ 1,005 మంది ప్లేయర్ల పేర్లను తొలగించింది. దీంతో 350 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. అయితే, బీసీసీఐ చర్య అనూహ్యమేమీ కాదు. ఎందుకంటే ఐపీఎల్ వేలం కోసం ఏటా భారీగానే పేర్లు నమోదు అవుతుంటాయి. ఇప్పుడు బోర్డు లెక్కల ప్రకారం చూస్తే, నమోదు చేసుకున్న ప్రతి నలుగురు ఆటగాళ్లలో ఒకరిని మాత్రమే కొనసాగిస్తున్నట్లు.
350 మంది.. కొత్తగా 35 మంది..
నమోదు చేసుకున్నవారిలో బీసీసీఐ 350 మంది ఆటగాళ్లను కొనసాగిస్తూనే 35 మందిని కొత్తగా చేర్చింది. దీంతో 350 మంది ఆటగాళ్లకు వేలం జరగనుంది. డిసెంబరు 16 మధ్యాహ్నం 2.30కు ఇది మొదలవుతుంది. ఈ మేరకు బీసీసీఐ.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు మెయిల్ పంపింది. తొలుత బిడ్డింగ్ ఉంటుంది. బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్/బ్యాటర్లు, పేసర్లు, స్పిన్నర్లు విభాగాల వారీగా క్యాప్డ్ ఆటగాళ్లతో వేలం మొదలవుతుంది. అన్ క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా ఇదే విధంగా వేలం సాగనుంది.
