Begin typing your search above and press return to search.

ఆయిల్ & గ్యాస్ సంక్షోభం మధ్య ఐపీఎల్ 2026 నడుస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.

By:  A.N.Kumar   |   25 March 2026 1:31 PM IST
ఆయిల్ & గ్యాస్ సంక్షోభం మధ్య ఐపీఎల్ 2026 నడుస్తుందా?
X

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందిన ఈ టోర్నమెంట్ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కోట్లాది ప్రేక్షకులను ఒకే వేదికపైకి తీసుకురానుంది. అయితే ఈసారి పరిస్థితులు మాత్రం గత సీజన్లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. ఈ ప్రభావం గ్లోబల్ ఎయిర్ ట్రావెల్‌పై పడటంతో పాటు ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి అంతర్జాతీయ విమాన కేంద్రాల్లో ప్రయాణాలపై పరిమితులు విధించబడుతున్నాయి. ఈ ప్రాంతాలు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాళ్ల రాకపోకలకు కీలకమైన మార్గాలు కావడంతో ఐపీఎల్ నిర్వహణపై కూడా పరోక్ష ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక మరోవైపు ఆయిల్ , గ్యాస్ సంక్షోభం ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు సామాన్య ప్రజల ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఇలాంటి సమయంలో వినోదం, క్రీడలపై ప్రజల దృష్టి కొంత మేర తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే ఐపీఎల్‌కు సమాంతరంగా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) కూడా నిర్వహించబడుతోంది. అక్కడి క్రికెట్ బోర్డు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్టేడియాల్లో ప్రేక్షకులను అనుమతించకుండా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామం ఐపీఎల్ నిర్వాహకులకు కూడా ఆలోచన కలిగిస్తోంది. పరిస్థితులు మరింత విషమిస్తే ఐపీఎల్‌లో కూడా ఇలాంటి పరిమితులు అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.

మరో ముఖ్య అంశం ఏమిటంటే ఇటీవలే టి20 ప్రపంచ కప్ ముగియడంతో ప్రేక్షకులు కొంతవరకు క్రికెట్ అలసటను కూడా అనుభవిస్తున్నారు. మూడు వారాల వ్యవధిలోనే మరో పెద్ద టోర్నమెంట్ ప్రారంభమవుతుండటంతో ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే అన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఐపీఎల్ ప్రజలకు ఒక వినోద విరామంగా మారుతుందని చెప్పవచ్చు. రోజువారీ ఒత్తిడులను మరిచిపోయి కొన్ని గంటల పాటు క్రికెట్ ఆస్వాదించే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ముఖ్యంగా యువత, క్రీడాభిమానులకు ఇది ఒక పెద్ద పండుగలాంటిదే.

మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన సంక్షోభం, ప్రజల ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ఈ సీజన్‌పై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి. అన్ని కళ్లూ ఇప్పుడు ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభంపై నిలిచాయి.