Begin typing your search above and press return to search.

కప్ ఎలాగూ గెలవలేం.. పక్కోనిడి ముంచేద్దాం.. ఐపీఎల్ ఎలిమినేట్ జట్ల పంజా

ఇప్పటికే టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దేసుకున్న ముంబై మే 14న ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో ఉన్న పంజాబ్ ను ఓడించి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది.

By:  A.N.Kumar   |   18 May 2026 11:17 AM IST
కప్ ఎలాగూ గెలవలేం.. పక్కోనిడి ముంచేద్దాం.. ఐపీఎల్  ఎలిమినేట్ జట్ల పంజా
X

‘తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్టుగా’ తయారైంది ఐపీఎల్ పరిస్థితి. అవును.. ఇప్పుడు ఐపీఎల్ లో ఎలాగూ ప్లేఆఫ్ అవకాశాలు లేకపోవడంతో పాయింట్ల టేబుల్స్ లో చివరన ఉన్న జట్లు.. ప్లేఆఫ్ రేసులో ఒక అడుగు దూరంలో ఉన్న జట్లను చావుదెబ్బ తీస్తున్నాయి. ఐపీఎల్ చివరి దశకు వచ్చిన వేళ ఈ పరిణామం టాప్ జట్ల అవకాశాలను చావు దెబ్బ తీస్తోంది.

సాధారణంగా ఈ టైమ్ లో టాప్ టీమ్స్ పాయింట్ల వేటలో సింహాల్లా గర్జించాలి. కానీ ఈ సీజన్ రివర్స్ గేర్ వేసింది. ప్లే ఆఫ్ ఆశలు ఎప్పుడో వదిలేసుకొని బ్యాగులు సర్దుకుంటున్న బాటమ్ ఫోర్ జట్లు.. ఇప్పుడు టైటిల్ రేసులో తోడేళ్ల వంటి జట్లకు చుక్కులు చూపిస్తూ వారి ప్లేఆఫ్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. తాము ఎలాగూ మునిగిపోయాం కదా.. పక్కనోడిని ఎందుకు ప్రశాంతంగా ఉండనివ్వాలి అనే ధోరణిలో లోయర్ ఆర్డర్ జట్లు ఆడుతుంటే టేబుల్ టాపర్స్ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే టోర్నీ చివరి దశకు వచ్చినా కూడా ప్లే ఆఫ్ కు ఒక్క ఆర్సీబీ జట్టు తప్ప ఏ జట్టు అర్హత సాధించలేదు. అన్ని టాప్ 3 జట్లను మిగతా ఎలిమినేట్ కాబోతున్నట్లు జట్లు ఓడించి చావుదెబ్బతీస్తున్నాయి.

ఐపీఎల్ చివరిదశకు వచ్చిన వేళ జరిగిన మ్యాచ్ లు చూస్తే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే టోర్నీ నుంచి తట్టాబుట్టా సర్దేసుకున్న ముంబై మే 14న ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసులో ఉన్న పంజాబ్ ను ఓడించి వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఇక మే 15న ఇలాగే ప్లేఆఫ్ రేసులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ను ఇప్పటికే ఎలిమినేట్ అయిన లక్నో ఊహించని షాక్ ఇచ్చి కంగుతినిపించింది. ఇక టాప్ 2 రేసులో ఉన్నా ఇంకా క్వాలిఫై కానీ గుజరాత్ జట్టును మే 16న కోల్ కతా నైట్ రైడర్స్ ఓడించి ఆ జట్టు ప్లే ఆఫ్ రేసుకు బ్రేక్ వేసింది. ఇక నిన్నటి మ్యాచ్ లో ప్లే ఆఫ్ రేసుకు అడుగు దూరంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

మా చావు మేము చేస్తాం కానీ మిమ్మల్ని బతకనివ్వం అన్నట్టుగా ఎలిమినేట్ అయిన జట్లు ఇప్పుడు ప్లే రేసులోకి వెళ్లే జట్లను స్వేచ్ఛగా ఆడుతూ చావుదెబ్బ తీస్తున్నాయి. మాకు ఎలాగూ పోయేదేం లేదు అన్నట్టుగా తమతోపాటు మరికొన్ని జట్లను ఇంటికి తీసుకెళ్లే ప్రణాళికను ఈ ఎలిమినేట్ అయిన జట్లు పాటిస్తున్నాయి.

టోర్నీ చివరి వారానికి వచ్చినా ఒక్క జట్టు తప్ప ఏ జట్టు ప్లే ఆఫ్ రేసులో అర్హత సాధించకపోవడానికి అసలు కారణం అదే.. ఏ జట్టుకు టాప్ కు వెళుతుందో.. ఏ జట్టు పాతాళానికి పడిపోతుందో ఇప్పుడు ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పడానికి వీలు లేకుండా ఐపీఎల్ పరిస్థితి తయారైంది. అభిమానులకు మాత్రం ఇది పైసా వసూల్ మ్యాచ్ ల ద్వారా మంచి పసందైన వినోదం పండుతోంది.

ఇప్పుడు అసలైన ప్రమాదం టేబుల్ టాపర్ జట్లకు ఏ ఆశలు లేకుండా లైట్ తీసుకొని ఆడే చివరి స్థానాల్లో నిలిచిన జట్లతోనే.. తాము ఎలాగూ కప్ గెలవలేం కాబట్టి ఎవరు గెలవాలో డిసైడ్ చేసే కింగ్ మేకర్ లా ఈ చివరి ఎలిమినేట్ అయిన జట్లు డిసైడ్ చేస్తున్నాయి.. చూడాలి మరి ఈ కింగ్ మేకర్ జట్లు ఎవరిని ముంచుతాయి..? ఎవరిని తేల్చుతాయన్నది ఈ వారాంతానికి క్లారిటీ వస్తుంది.