Begin typing your search above and press return to search.

నిరుడు ఆప‌రేష‌న్ సిందూర్.. నేడు యుద్ధం.. ఐపీఎల్ కు షాకే!

నిరుడు పెహ‌ల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు భార‌త ప‌ర్య‌ట‌కుల‌పై సాగించిన మార‌ణ‌కాండ అనంత‌రం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ తో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)పై ప్ర‌భావం ప‌డింది.

By:  Tupaki Political Desk   |   13 March 2026 1:00 PM IST
నిరుడు ఆప‌రేష‌న్ సిందూర్.. నేడు యుద్ధం.. ఐపీఎల్ కు షాకే!
X

నిరుడు పెహ‌ల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు భార‌త ప‌ర్య‌ట‌కుల‌పై సాగించిన మార‌ణ‌కాండ అనంత‌రం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ తో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)పై ప్ర‌భావం ప‌డింది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూలేని విధంగా తొలిసారి లీగ్ ను వాయిదా వేశారు. అయితే, కొద్ది రోజుల్లోనే మ‌ళ్లీ షురూ అయింది. ఈ ఏడాది కూడా ఇలాంటి అనుకోని అవాంత‌రం ఎదుర‌య్యే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ప‌శ్చిమాసియాలో క‌మ్మేసిన యుద్ధ మేఘాలు దీనికి కార‌ణం కానున్న‌ట్లు క‌నిపిస్తోంది. విమాన స‌ర్వీసులు ర‌ద్దు కావ‌డంతో ఇప్ప‌టికే టి20 ప్ర‌పంచ క‌ప్ అనంత‌రం ప‌లు విదేశీ జ‌ట్ల ఆట‌గాళ్లు త‌మ సొంత దేశాల‌కు వెళ్లేందుకు ఇబ్బంది ప‌డ్డారు. వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు అయితే కోల్ క‌తాలోనే కొన్ని రోజులు ఉండిపోయారు. వీరు గురువారం సొంత దేశానికి చేరారు. మ‌ళ్లీ వాళ్లు ఇప్పుడు తిరిగి భార‌త్ కు రావాల్సి వ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌ను ముందుగానే పంపించింది అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేల‌రేగాయి.

ఐపీఎల్ వేళ‌కు యుద్ధం స‌ద్దుమ‌ణిగేనా?

ఐపీఎల్ ఈ నెల 28 నుంచి మొద‌లుకానుంది. ఆలోగా ఇజ్రాయెల్-అమెరికాలు ఇరాన్ పై చేప‌ట్టిన యుద్ధం ఆగితే ప‌ర్వాలేదు. అటు ఇరాన్ కూడా శాంతించాలి. లేదంటే, ఇంకా ఎన్ని రోజులు కొన‌సాగుతుందో చెప్ప‌లేం. అదే జ‌రిగితే విదేశీ క్రికెట‌ర్ల రాక‌పై సందిగ్ధ‌త నెల‌కొని ఐపీఎల్ కు క‌ష్టాలు ఎద‌ర‌వుతాయ‌నే అంచ‌నా వ్య‌క్తం అవుతోంది. ఇదంతా ఎందుకంటే.. విమానాల రాక‌పోక‌ల్లో ప్ర‌పంచానికి దుబాయ్ ఒక హ‌బ్. అలాంటి ప్రాంతంలోనే ఇప్పుడు యుద్ధం ప్ర‌భావం నెల‌కొంది. గ‌గ‌న త‌లాల‌ను మూసివేశారు.

మిగిలింది 15 రోజులే..

ఐపీఎల్ లో చాలామంది ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఆట‌గాళ్లున్నారు. వీరు ఈ నెల 12 (గురువారం) సొంత దేశాల‌కు చేరారు. టి20 ప్ర‌పంచ క‌ప్ కోసం భార‌త్ కు వ‌చ్చి.. యుద్ధం ప్ర‌భావంతోనూ నెల రోజుల‌కు పైగా ఉన్నారు. ఇప్పుడు వీరు క‌నీసం ఈ నెల 25లోగా అయినా తిరిగి వ‌స్తారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అటు చూస్తే లీగ్ ప్రారంభానికి ఇంకా 15 రోజులే ఉంది.

ఇక్క‌డా గ్యాస్ దెబ్బ‌..

ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్న గ్యాస్ సంక్షోభం ఐపీఎల్ పైనా ప‌డే చాన్సు క‌నిపిస్తోంది. యుద్ధం ఆగ‌క‌పోతే వంట గ్యాస్ ర‌వాణాకు క‌ట‌క‌ట ఎదుర‌వుతుంది. అలాగైతే, ఐపీఎల్ జ‌ట్ల‌కు ఆతిథ్యం భారంగా మారుతుంది. ఈ మేర‌కు హోట‌ళ్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే విమాన చార్జీల భారం కూడా ఆందోళ‌న‌క‌రంగా మారింది.