ఐపీఎల్-19.. డిసెంబరు 13-15 మధ్య వేలం.. అతడికి రూ.30 కోట్లు ఖాయం?
ఇక వచ్చే ఏడాది జరగనున్నది 19వ సీజన్. 18వ సీజన్ కు సంబంధించి నిరుడు నవంబరులో మెగా వేలం జరిగింది. ఇది డబ్బు పరంగా రికార్డులు నెలకొల్పింది.
By: Tupaki Political Desk | 12 Oct 2025 12:00 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు సంబంధించి ఏ చిన్న వార్త అయినా సంచలనమే..! గత ఏడాది జరిగిన 18వ సీజన్ చరిత్రలో నిలిచిపోయన సంగతి తెలిసిందే. కొవిడ్ వంటి మహమ్మారి ప్రబలినా, భారత్ లో సాధారణ ఎన్నికల సమయంలోనూ ఒక్కసారి కూడా వాయిదా లేకుండా సాగింది. ఈ ఏడాది మాత్రం లీగ్ చరిత్రలో తొలిసారిగా వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే, అదేమీ సాదాసీదా కారణం కాదు.. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత పాకిస్థాన్ (పీవోకే)లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఐపీఎల్ కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు.
బెంగళూరు విజేత.. తొక్కిసలాటతో మరక
రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగుల భారీ స్కోరు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు చూస్తే సీజన్-18 ఎంత అద్భుతంగా మొదలైందో తెలుస్తోంది. ఆ దెబ్బకు 300 స్కోరు ఖాయమా? అనిపించింది. కానీ, సన్ రైజర్స్ ఆ దూకుడు కొనసాగించలేకపోయింది. ఇక గత సీజన్ ఆసాంతం మంచి ఫామ్ లో కొనసాగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభిమానుల కోరికను తీరుస్తూ టైటిల్ సాధించింది. అయితే, ఆ మరుసటి రోజే బెంగళూరులో జరిగిన విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో వారి ఆనందాన్ని ఆవిరిచేసింది.
మినీ వేలం.. సీజన్-19 రికార్డులు బ్రేక్ చేస్తుందా?
ఇక వచ్చే ఏడాది జరగనున్నది 19వ సీజన్. 18వ సీజన్ కు సంబంధించి నిరుడు నవంబరులో మెగా వేలం జరిగింది. ఇది డబ్బు పరంగా రికార్డులు నెలకొల్పింది. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు తీసుకుంది. ఈ రెండూ ఇప్పటివరకు వేలంలో నంబర్ 1, 2 అత్యధిక ధరలు. మరి 19వ సీజన్ కు సంబంధించి వచ్చే డిసెంబరు 13-15 మధ్యన మినీ వేలం జరగనుంది. నిరుడు మెగా వేలం జరిగింది కాబట్టి ఇప్పుడు మినీ వేలం ఉంటుంది.
అతడికి డబుల్ బొనాంజా ఖాయమా?
ఈ ఏడాది జరిగేది మినీ వేలం అయినప్పటికీ ఆటగాళ్ల కొనుగోలు, స్వాపింగ్ లో రికార్డులు బద్దలవడం ఖాయమా? అంటే కాదని చెప్పలేం. గతంలో కొన్ని మినీ వేలంలలో ఈ మేరకు భారీ ధర పలికిన ఆటగాళ్లున్నారు. మరి ఆ లెక్కన వచ్చే సీజన్ కు భారీ ధర పలికేది ఎవరు? రిషభ్ పంత్ కు లక్నో ఊహించని ధర ఇచ్చినా అతడు న్యాయం చేయలేదు. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు. ఇక వీరిద్దరికీ మించి ఇవ్వడానికి ఎవరున్నారు? అంటే అది టీమ్ ఇండియా టి20 జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మ. సన్ రైజర్స్ తరఫున రెండేళ్లుగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న అభిషేక్ గనుక మినీ వేలంలోకి వస్తే రూ.30 కోట్లు పలికినా ఆశ్చర్యం లేదు.
ఎందుకంటే... అతడు ఇటీవలి ఆసియా కప్ లో అతడు చెలరేగిన తీరు చూసినవారు ఎవరూ అప్పుడే మర్చిపోలేదు. ఆ కప్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సాధించాక అభిషేక్ స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకే డిసెంబరు 13-15 మధ్య జరిగే వేలంలో రూ.30 కోట్లు అయినా అభిషేక్ ను దక్కించుకునేందుకు వెనుకాడని జట్లు (ఫ్రాంచైజీలు) ఉంటాయని అంచనా వేస్తున్నారు. అభిషేక్ 2022 నుంచి 2024 వరకు రూ.6.50 కోట్ల ధరకు సన్ రైజర్స్ కు ఆడాడు. కానీ, ఈ సీజన్ 18కు రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్నాయి. అభిషేక్ గనుక వేలంలోకి వస్తే అతడి ప్రస్తుత ధర డబుల్ (దాదాపు రూ.30 కోట్లు) అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఈ స్థాయిలో పెట్టదగిన ఆటగాడు ఎవరూ లేరు మరి..?
