Begin typing your search above and press return to search.

ఎడారిలో అద్భుతం... ఆకాశ మైదానం.. అక్క‌డే ప్ర‌పంచ క్రీడా సంగ్రామం

ప్ర‌పంచంలో అత్యంత ఆద‌ర‌ణ ఉన్న క్రీడ ఫుట్ బాల్ అనే సంగ‌తి తెలిసిందే. ఇందులో ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ అంటే మిగ‌తా ప్రపంచ‌మూ ఉర్రూత‌లూగుతుంది.

By:  Tupaki Entertainment Desk   |   28 Oct 2025 2:00 PM IST
ఎడారిలో అద్భుతం... ఆకాశ మైదానం.. అక్క‌డే ప్ర‌పంచ క్రీడా సంగ్రామం
X

సౌదీ అరేబియా అంటే సంప్ర‌దాయ దేశం.. ఇది ఒక‌ప్ప‌టి మాట‌.. ఇప్పుడు సౌదీ దూసుకెళ్తోంది.. పెట్రోల్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మ‌రెన్నో ఏళ్లు మ‌నుగ‌డ సాగించ‌లేమ‌ని మేల్కొంది..! ప‌ర్య‌ట‌కం ద్వారా పైస‌లు కూడ‌గట్టొచ్చ‌ని నిర్ణ‌యానికి వ‌చ్చింది. అంత‌టితో ఆగ‌కుండా ఆ దిశ‌గా అడుగులు కూడా వేస్తోంది ఈ ఎడారి దేశం. సంప్ర‌దాయం నుంచి సంస్క‌ర‌ణ‌ల వైపు ప్ర‌యాణం సాగిస్తోంది సౌదీ. ఇందులోభాగంగానే నిరుడు మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో సౌదీ

అరేబియా అమ్మాయి తొలిసారిగా పాల్గొంది. ఇప్పుడు మ‌రో అద్భుతం ఆ దేశంలో సాకారం అవుతోంది.

ఆ ప్ర‌పంచ స‌మ‌రానికి..

ప్ర‌పంచంలో అత్యంత ఆద‌ర‌ణ ఉన్న క్రీడ ఫుట్ బాల్ అనే సంగ‌తి తెలిసిందే. ఇందులో ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ అంటే మిగ‌తా ప్రపంచ‌మూ ఉర్రూత‌లూగుతుంది. ఇలాంటి మెగా టోర్నీకి 2034లో ఆతిథ్యం ఇవ్వ‌డానికి సిద్ధం అవుతోంది సౌదీ. దీనికోసం ఓ అద్భుత స్టేడియాన్ని నిర్మిస్తోంది. అయితే, అది అన్నిటిలా కాదు.. చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే.. స్కై స్టేడియం కాబ‌ట్టి. సౌదీ అంటేనే విలాసం. డ‌బ్బుకు కొద‌వ‌లేని ఆ దేశంలో ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ వంటి మెగా టోర్నీ జ‌రుగుతుందంటే మామూలుగా ఉండ‌దుగా..?

ప్ర‌పంచంలోనే తొలి..

సౌదీ అరేబియా చేప‌ట్టిన స్కై స్టేడియం ఊహ‌కు కూడా అంద‌నిది. అందుకే ప్ర‌పంచంలోనే తొలి కానుంది. ఈ మేర‌కు స్కై స్టేడియం ఊహాజ‌నిత‌ విజువ‌ల్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, సౌదీ అరేబియా నియోమ్ మెగా సిటీ ప్రాజెక్టు-ది లైన్ ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులోభాగంగా నియోమ్ స్టేడియం పేరుతో స్కై స్టేడియ‌డం నిర్మించ‌నుంది. ఫిఫా ప్ర‌పంచ క‌ప్ 2034లో జ‌ర‌గ‌నుండ‌గా, 2027లోనే ఈ స్టేడియం నిర్మాణం మొద‌ల‌వ‌నుంది. 2032కు పూర్తిచేయ‌నున్నారు.

భూమి నుంచి 350 మీట‌ర్ల ఎత్తులో...

ఫుట్ బాల్ మ్యాచ్ అంటేనే మ‌హా ర‌స‌వ‌త్త‌రం.. అలాంటిది భూమి నుంచి 350 మీట‌ర్ల ఎత్తులో మ్యాచ్ చూడ‌డం అంటే..? ఇలాంటి అనుభూతే ఇవ్వ‌నుంది స్కై స్టేడియం. 46 వేల మంది కూర్చునే సామ‌ర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో 2034 ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ప్ర‌పంచ క‌ప్ న‌కే ఈ స్టేడియం గొప్ప ఊపునివ్వ‌నుంద‌ని అంటున్నారు. అయితే, సౌదీ నియోమ్ ప్రాజెక్టు 2017లోనే మొద‌లైనా పూర్తిచేయ‌డంలో స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. ముఖ్యంగా ప‌ర్య‌వ‌ర‌ణ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. స్కై స్టేడియం మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్త‌వుతుంద‌ని భావిస్తున్నారు. 2034 ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ న‌కు బిడ్ వేసింది సౌదీ అరేబియా మాత్ర‌మే. కాబ‌ట్టి ఆ దేశానికే ఆతిథ్యం ద‌క్కుతుంది.