Begin typing your search above and press return to search.

షేక్ హ్యాండ్ లేదు..అమ్మాయిల చేతిలోనూ పాక్ చిత్తు..12వ వ‌రుస‌ విజయం

టీమ్ ఇండియాకు ఎదురులేదు... అది టి20 అయినా, వ‌న్డే అయినా.. షేక్ హ్యాండ్ లేదు కానీ... పాకిస్థాన్ ను వ‌రుస‌గా 4వ ఆదివార‌మూ ఓడించారు.

By:  Tupaki Entertainment Desk   |   6 Oct 2025 9:23 AM IST
షేక్ హ్యాండ్ లేదు..అమ్మాయిల చేతిలోనూ పాక్ చిత్తు..12వ వ‌రుస‌ విజయం
X

టీమ్ ఇండియాకు ఎదురులేదు... అది టి20 అయినా, వ‌న్డే అయినా.. షేక్ హ్యాండ్ లేదు కానీ... పాకిస్థాన్ ను వ‌రుస‌గా 4వ ఆదివార‌మూ ఓడించారు. గ‌త మూడు వారాలు పురుషుల వంతు అయితే... ఈసారి అమ్మాయిల బాధ్య‌త‌... అలా ఇలా కాదు.. వ‌రుస‌గా 12వ వ‌రుస‌ విజయం సాధించింది భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టు. శ్రీలంక రాజ‌ధాని కొలంబోలో జ‌రిగిన మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో టీమ్ ఇండియా ఏకంగా 88 ప‌రుగుల తేడాతో పాక్ ను మ‌ట్టిక‌రిపించింది. బీసీసీఐ ఆదేశాల మేర‌కు ఈ మ్యాచ్ లో భార‌త ఆట‌గాళ్లు.. పాకిస్థాన్ మ‌హిళ‌ల‌కు షేక్ హ్యాండ్ ఇవ్వ‌లేదు.

భార‌త్ చేతిలో ప‌రాజ‌యం కాదు ప‌రాభ‌వ‌మే..

భార‌త్ జోలికొస్తే పాక్ కు ప‌రాజ‌యం కాదు ప‌రాభ‌వ‌మే.. అది యుద్ధంలో అయినా, మైదానంలో అయినా. ఆదివారం కొలంబోలో మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ లీగ్ మ్యాచ్ లో టీమ్ ఇండియా దీనిని మ‌ళ్లీ రుజువు చేసింది. పాక్ పై తొలుత బ్యాటింగ్ కు దిగిన మ‌న జ‌ట్టు స‌రిగ్గా 50 ఓవ‌ర్ల‌లో 247 ప‌రుగుల‌కు ఆలౌటైంది. హ‌ర్లీన్ డియోల్ (65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్ తో 46), రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సులు) మెరుపులు మెరిపించారు. జెమీమా రోడ్రిగ్స్ (32), ప్ర‌తీకా రావ‌ల్ (31), దీప్తి శ‌ర్మ (25), మంధాన (23) విలువైన ప‌రుగులు సాధించారు. ఓపెన‌ర్లు ప్ర‌తీకా, మంధాన 48 ప‌రుగుల శుభారంభం అందించినా కెప్టెన్ హ‌ర్మ‌న్ (19) స‌హా మిగ‌తావారు భారీ స్కోర్లు చేయ‌లేక‌పోయారు. అయితే, స్నేహ్ రాణా (20), దీప్తి మెరుగైన స్కోరు అందించ‌డంలో తోడ్ప‌డ్డారు. ఆఖ‌రిలో రిచా దుమ్మురేపింది.

చెల‌రేగిన గౌడ్..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ పేస‌ర్ క్రాంతి గౌడ్ బౌలింగ్ పాకిస్థాన్ తో మ్యాచ్ లో హైలైట్. 10 ఓవ‌ర్ల‌లో 20 ప‌రుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసింది. పాక్ ఓపెన‌ర్ స‌దాఫ్ ష‌మాస్ (6), అలియా రియాజ్ (2)ల‌ను మొద‌ట్లోనే ఔట్ చేసింది. క్రాంతి ధాటికి పాక్ ఛేజింగ్ లో వెనుక‌బ‌డి పోయింది. సిద్రా అమీన్ (81) ప్ర‌య‌త్నించినా పాక్ ను గెలిపించ‌లేక‌పోయింది. 43 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే ఆ జ‌ట్టు చేతులెత్తేసింది. అమీన్ తో పాటు న‌టాలియా (33), సిద్రా (14) మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ స్కోర్లు చేశారు. దీప్తి శ‌ర్మ (3/45), స్నేహ్ రాణా (2/38) బౌలింగ్ లోనూ రాణించారు.

మ‌హిళల ప్ర‌పంచ క‌ప్ కు భార‌త్ తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గువాహ‌టిలో జ‌రిగిన తొలి మ్యాచ్ లో టీమ్ ఇండియా.. శ్రీలంక‌ను ఓడించింది. ఇప్పుడు పాక్ పైనా నెగ్గి రెండో విజ‌యం సాధించింది. అన్న‌ట్లు.. పాక్ పై టీమ్ ఇండియాకు వ‌రుస‌గా 12వ వ‌న్డే విజ‌యం.