సిరీస్ నెగ్గి ఏడాది.. కివీస్ పై 0-3 పరాభవం..విండీస్ పై కథేంటి?
By: Tupaki Political Desk | 2 Oct 2025 9:25 AM ISTఅభిమానులకు గుర్తుందో లేదో.. టీమ్ ఇండియా టెస్టు సిరీస్ నెగ్గి ఏడాది గడిచిపోయింది. సరిగ్గా గత సంవత్సరం ఇదే రోజుల్లో స్వదేశంలో బంగ్లాదేశ్ ను ఓడించింది. స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో కూడిన టీమ్ ఇండియా నిరుడు ఈ రోజుల్లో బాగా బలంగా కనిపించింది. కానీ, ఆ తర్వాతనే అసలు కథ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో అదీ సొంతగడ్డపై 0-3తో పరాభవం పాలైంది. న్యూజిలాండ్ జట్టు భారత్ లో టెస్టు నెగ్గి దశాబ్దాలు అయింది. అలాంటిది సిరీస్ నే క్లీన్ స్వీప్ చేసింది. ఆ పరాభవమే కోహ్లి, రోహిత్, అశ్విన్ ల రిటైర్మెంట్ కు పునాది వేసింది. దీని తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్ లో ఐదు టెస్టుల సిరీస్ ను 1-3తో కోల్పోవడం వీరి రిటైర్మెంట్ ఖాయమైంది. అశ్విన్ ఆసీస్ టూర్ లోనే రిటైర్ కాగా, ఐపీఎల్ ముగిసేనాటికి కోహ్లి, రోహిత్ కూడా అదే నిర్ణయం తీసుకున్నారు.
కొత్త రక్తంతో..
కోహ్లి, రోహిత్, అశ్విన్ లేకుండా.. అసలు ఊహించుకోవడానికే వీలు కాని రీతిలో కొత్త రక్తంతో శుబ్ మన్ గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా ఏం ఆడుతుందోనని అనుకున్నారు. కానీ, గిల్ 700 పైగా పరుగులు సాధించగా, హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ 23 వికెట్లు తీసి ఐదు టెస్టుల సిరీస్ ను 2-2తో డ్రా చేశారు. ఇప్పుడు టీమ్ ఇండియా మళ్లీ స్వదేశంలో టెస్టు సిరీస్ కు సిద్ధం అవుతోంది. బలహీనంగా కనిపించే వెస్టిండీస్ తో దసరా నాడు గురువారం అహ్మదాబాద్ లో తొలి టెస్టు బరిలోకి దిగనుంది. రెండో టెస్టు ఈ నెల 10 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఆసియా కప్ (టి20) సాధించిన ఉత్సాహంతో ఉన్న భారత్ ను ఎదుర్కొనడం వెస్టిండీస్ కు సవాలే.
సిరీస్ సాధించే చాన్స్...
టెస్టు కెప్టెన్ గా తొలి టూర్ లోనే సిరీస్ ను డ్రా చేయడమే కాక, వ్యక్తిగతంగానూ తానేంటో నిరూపించుకున్న గిల్ కు ఇప్పడు తొలిసారి టెస్టు సిరీస్ సాధించే చాన్స్ దొరికింది. వెస్టిండీస్ 1983 నుంచి భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గలేదు. చివరగా టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు భారత్ ను ఓడించింది కూడా 2002లో కావడం గమనార్హం. ఈ రికార్డును బట్టి చూసినా విండీస్ తో సిరీస్ మనదే అని చెప్పొచ్చు. అదే జరిగితే ఆ జట్టుపై వరుసగా పదో టెస్టు సిరీస్ సాధించిన రికార్డు సొంతం అవుతుంది.
-టాలెంట్ కు కొరత లేకున్నా.. మూడు ఫార్మాట్లలోనూ వెస్టిండీస్ ప్రస్తుతం బలహీనంగా కనిపిస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్ నకు అర్హతే సాధించలేదు. తాజాగా నేపాల్ తో టి20 సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోయింది. ఇక ఐదు రోజులు జరిగే టెస్టులో విండీస్ ఆటగాళ్లు నిలవడం కష్టమే.
తెలుగోడు నితీశ్ కు చాన్సుందా?
టీమ్ ఇండియాలో మళ్లీ దేవదత్ పడిక్కల్ కు చాన్స్ దొరకనుంది. కర్ణాటకకే చెందిన కరుణ్ నాయర్ ను తప్పించి పడిక్కల్ కు చోటు ఇచ్చారు. జైశ్వాల్, రాహుల్ ఓపెనర్లు కాగా, సాయి సుదర్శన్ వన్ డౌన్ లో వస్తాడు. గిల్ నంబర్ 4లో, పడిక్కల్ 5లో, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ 6లో, కొత్తగా వైస్ కెప్టెన్ అయిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 7, వాషింగ్టన్ సుందర్ 8 స్థానాల్లో ఆడతారు. బుమ్రాతో పాటు సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యత తీసుకుంటాడు. ఇక మిగిలిన ఆ ఒక్క స్థానం తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికా? మరి మంచి ఫామ్ లో ఉన్న చైనా మన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కా? అన్నది చూడాలి. ఎక్కువ శాతం కుల్దీప్ కే అవకాశాలు ఉన్నాయి.
