Begin typing your search above and press return to search.

టి20 ప్ర‌పంచ క‌ప్ లో లేజ‌ర్ షోనా? ఇది ఐపీఎల్ నా? దిగ్గ‌జాల ధ్వ‌జం

అది 1970లు 1980ల కాలం.. టీమ్ఇండియా బ్యాటింగ్ మూల స్తంభం ఎవ‌రంటే..? అంద‌రూ ఠ‌క్కున సునీల్ గావ‌స్క‌ర్ పేరు చెప్పేవారు.

By:  Tupaki Political Desk   |   2 March 2026 9:00 PM IST
టి20 ప్ర‌పంచ క‌ప్ లో లేజ‌ర్ షోనా? ఇది ఐపీఎల్ నా? దిగ్గ‌జాల ధ్వ‌జం
X

అది 1970లు 1980ల కాలం.. టీమ్ఇండియా బ్యాటింగ్ మూల స్తంభం ఎవ‌రంటే..? అంద‌రూ ఠ‌క్కున సునీల్ గావ‌స్క‌ర్ పేరు చెప్పేవారు. పేరు వింటేనే భ‌య‌ప‌డిపోయే అప్ప‌టి వెస్టిండీస్ భీక‌ర పేస్ బౌల‌ర్ల‌ను క‌నీసం హెల్మెట్ కూడా లేకుండా అల‌వోక‌గా ఎదుర్కొన్నాడు గావ‌స్క‌ర్. దీనికి ఎంతో మాన‌సిక స్థైర్యం కావాలి. అంత‌కుమించిన సునిశిత కంటి చూపు కూడా ఉండాలి. అందుకే గావ‌స్క‌ర్.. ఎవ‌రైనా సిగ‌రెట్ తాగుతుంటే క‌నీసం ఆ వైపు కూడా చూసేవారు కాద‌ట‌..! పొగ ప్ర‌భావం కంటి న‌రాల‌పై ప‌డితే చూపు మంద‌గించి బ్యాటింగ్ పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. బంతి క‌నిపించ‌ద‌ని గావ‌స్క‌ర్ ఆలోచ‌న‌. ఇది స‌రైన ఆలోచ‌నే.. ఎందుకంటే, సౌర‌భ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి వ‌ర‌కు కంటిచూపు త‌గ్గ‌డంతో ఇబ్బంది ప‌డిన‌వారే. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న అంతా ఎందుకంటే..?

ఆట మ‌ధ్య‌లో విరామం అవ‌స‌రమా?

టి20 ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా భార‌త్-వెస్టిండీస్ మ‌ధ్య ఆదివారం కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన సూప‌ర్ 8 మ్యాచ్ లో ఓ సంఘట‌న చ‌ర్చ‌నీయాంశ‌మైంది. భార‌త బ్యాటింగ్ ప‌వ‌ర్ ప్లే (6 ఓవ‌ర్లు) ముగిశాక షెడ్యూల్డ్ బ్రేక్ అంటూ మూడు నిమిషాల గ్యాప్ ఇచ్చారు. అప్ప‌డు మ‌న జ‌ట్టు స్కోరు రెండు వికెట్ల న‌ష్టానికి 53. ఓపెన‌ర్ అభిషేక్, వ‌న్ డౌన్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ ఔట్ అయ్యారు. ఓపెన‌ర్ సంజూ, కెప్టెన్ సూర్య క్రీజులో ఉన్నారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో మైదానంలో లైట్లు మొత్తం ఆర్పేసి లేజ‌ర్ షో అంటూ హ‌డావుడి చేశారు. దీనిని టీమ్ఇండియా మాజీ దిగ్గ‌జం సునీల్ గావ‌స్క‌ర్ తో పాటు, మాజీ హెడ్ కోచ్ ర‌విశాస్త్రి తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఇంత షో అవ‌స‌ర‌మా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కంటిచూపు, ఫోక‌స్ త‌గ్గుతుంది..

లేజ‌ర్ షో బ్యాట్స్ మ‌న్ ఏకాగ్ర‌తను ప్ర‌భావితం చేస్తుంద‌ని, కంటి చూపు దెబ్బ‌తింటుంద‌ని గావ‌స్క‌ర్ అన్నారు. డ్రింక్స్ బ్రేక్ అంటూ ఇచ్చి లేజ‌ర్ షో నిర్వ‌హించ‌డం బ్యాట్స్ మ‌న్ కే కాదు ఎవ‌రికీ మంచిది కాద‌ని పేర్కొన్నారు. అస‌లు ప్ర‌పంచ క‌ప్ స్థాయి టోర్నీలో లేజ‌ర్ షో అవ‌స‌ర‌మా? అని ర‌విశాస్త్రి నిల‌దీశారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) వంటి వాటిలో లేజ‌ర్ షో అంటే అర్థం ఉంది కానీ.. ప్ర‌పంచ క‌ప్ లో నాకౌట్ మ్యాచ్ సంద‌ర్భంగా ఎందుకు? అని ప్ర‌శ్నించారు. బ్రేక్ స‌మ‌యంలో ఇది ఆట‌గాళ్ల మీద తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

క‌మ‌ర్షియ‌ల్ షో..

మొత్తానికి టి20 ప్ర‌పంచ క‌ప్ లో లేజ‌ర్ షో చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి సెమీఫైన‌ల్స్, ఫైన‌ల్స్ సంద‌ర్భంగా కూడా ఇదే విధానం కొన‌సాగిస్తారా? లేక మాజీ ఆట‌గాళ్ల అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లేజ‌ర్ షోను ర‌ద్దు చేస్తారా? అన్న‌ది చూడాలి.