408 పరుగులు.. చరిత్రలో టీమ్ ఇండియాకు అతిపెద్ద పరాజయం
ఈ సిరీస్ కు ముందు 15 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా నేడు సగర్వంగా సిరీస్ నే అందుకుంది.
By: Tupaki Entertainment Desk | 26 Nov 2025 1:34 PM ISTఅత్యంత దారుణమైన ఆట.. కనీసం క్రీజులో నిలిచే టెక్నిక్ లేదు.. స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్లలో ఒక్కరు కూడా సెంచరీ చేయలేదు.. అనవసరంగా ప్రయోగాలు.. ఎవరు ఏ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతారో తెలియదు.. అవకాశం దక్కిన కుర్రాళ్లు కూడా అత్యుత్సాహానికి పోయి వికెట్ ఇచ్చేయడం.. మొత్తానికి దక్షిణాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడింది. 25 ఏళ్ల తర్వాత సఫారీ జట్టు భారత గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గింది. 2000 సంవత్సరంలో 0-2తో సిరీస్ గెలిచిన దక్షిణాఫ్రికా మళ్లీ ఇప్పుడు అంతే తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ కు ముందు 15 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు మ్యాచ్ గెలిచిన చరిత్ర ఉన్న దక్షిణాఫ్రికా నేడు సగర్వంగా సిరీస్ నే అందుకుంది. అది కూడా భారత్ చరిత్రలో ఎరుగని అతి భారీ తేడాతో మట్టికరిపించింది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో టీమ్ ఇండియా ఏకంగా 408 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టెస్టు చరిత్రలో 2004లో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు 342 పరుగుల తేడాతో నాగపూర్ లో ఓడింది. ఆ చెత్త రికార్డును చెరిపేస్తూ ఇప్పుడు మరింత చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.
ఇదేం ఆట..? కనీసం డ్రా చేయలేరా?
మితిమీరిన ప్రయోగాలతో కోల్ కతా లో జరిగిన తొలి టెస్టులోనే టీమ్ ఇండియా సిరీస్ పరాజయానికి పునాదులు పడ్డాయి. స్పెషలిస్ట్ బ్యాటర్ (సాయి సుదర్శన్)ను పక్కనపెట్టి ఏకంగా నలుగురు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టు.. బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దింపింది. అతడు ఫర్వాలేదనే ప్రదర్శన చేసినా.. మిగతావారు విఫలమయ్యారు. ఇక కెప్టెన్ శుబ్ మన్ గిల్ గాయంతో బ్యాటింగ్ కు దిగకపోవడం, రెండో టెస్టుకు అందుబాటులో లేకపోవడం మరింత దెబ్బకొట్టింది. చివరకు సిరీస్ ను 0-2తో కోల్పోయే స్థితికి తెచ్చింది.
అత్యంత భారీ లక్ష్యం.. ఆట దారుణం
గువాహటి టెస్టులో 549 పరుగుల అతి భారీ లక్ష్యం ఛేదించాల్సిన పరిస్థితుల్లో టీమ్ ఇండియా నాలుగో రోజు మంగళవారమే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బుధవారం ఉదయం కాసేపు పోరాడినా.. నైట్ వాచ్ మన్ కుల్దీప్ యాదవ్ (38 బంతుల్లో 5 పరుగులు)ను దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ బౌల్డ్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ పంత్ (13) వెంటవెంటనే ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ గాడితప్పింది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54), సుందర్ (44 బంతుల్లో 16) కాసేపు పోరాడారు.
-దక్షిణాఫ్రికా స్పిన్నర్లలో 17 వికెట్లు తీసిన హార్మర్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో 93 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీసిన ఆల్ రౌండర్ యాన్సెన్ కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.
-ఈ సిరీస్ ఓటమి ఫలితం టీమ్ ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) అవకాశాలపైనా పడనుంది. ఆడిన (పాక్ తో రెండు) నాలుగు టెస్టుల్లో మూడు గెలిచిన దక్షిణాఫ్రికా రెండో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా 4కు 4 గెలిచి టాప్ లో ఉంది. టీమ్ ఇండియా... శ్రీలంక (3), పాకిస్థాన్ (4) తర్వాత ఐదో స్థానంలో ఉంది.
