అమెరికా అండర్-19 జట్టు.. అంతా భారతీయులే.. తెలుగోళ్లు ముగ్గురు
అండర్ 19 ప్రంపచ కప్ లో భారత్-అమెరికా జట్ల మధ్య మ్యాచ్..! కానీ, మైదానంలోని 13 మంది (11 మంది ఫీల్డింగ్, ఇద్దరు బ్యాటర్లు) భారతీయుల్లాగానే కనిపిస్తున్నారు.
By: Tupaki Entertainment Desk | 15 Jan 2026 12:54 AM ISTఅండర్ 19 ప్రంపచ కప్ లో భారత్-అమెరికా జట్ల మధ్య మ్యాచ్..! కానీ, మైదానంలోని 13 మంది (11 మంది ఫీల్డింగ్, ఇద్దరు బ్యాటర్లు) భారతీయుల్లాగానే కనిపిస్తున్నారు. ఏంటి.. అనూహ్యంగా ఏమైనా రెండు భారత జట్లు ఆడుతున్నాయా? అనుకునేరు? కాదు.. పొరపాటు పడకండి. వీరు చూస్తున్నదాంట్లో తప్పేమీ లేదు. నిజం ఉంది. ఆఫ్రికా ఖండంలో క్రికెట్ సందడి నెలకొంది. అదికూడా జింబాబ్వే, నమీబియా వంటి దేశాల్లో కావడం విశేషం. ఈ రెండు దేశాలు ప్రపంచ క్రికెట్ లో ముద్ర చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జింబాబ్వే 25 ఏళ్ల కిందటే పెద్ద జట్టుగా ఎదుగుతుందని భావించారు. కానీ, రాజకీయ కారణాలతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. క్రికెటర్లకు డబ్బులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. నమీబియా కూడా రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్నా.. ఇంకా పెద్ద జట్టుగా ఎదగలేదు. దీని పొరుగునే ఉండే దక్షిణాఫ్రికా సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలి కాలంలో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ గెలుచుకుంది. అంతకుముందు టి20 ప్రపంచ కప్ లో రన్నరప్ గా నిలిచింది. భారత్ లో జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరి.. టీమ్ ఇండియా చేతిలో ఓడిపోయింది. పురుషుల జట్టు అయితే రెండు నెలల కిందట జరిగి రెండు టెస్టుల సిరీస్ లో భారత్ ను 0-2తో క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికాకు పొరుగునే ఉండే జింబాబ్వే, నమీబియా దేశాల్లో గురువారం నుంచి అండర్ 19 ప్రపంచ కప్ జరగనుంది.
అంతా మనోళ్లే..
15 మంది సభ్యులతో అండర్ -19 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన అమెరికా జట్టులో అందరూ భారతీయులే ఉండడం విశేషం. ఈ జట్టులో తెలుగోళ్లు ముగ్గురు ఉండడం మరో విశేషం. అయితే, గతంలోనూ అమెరికా అండర్ 19 జట్టులో భారతీయులు, తెలుగోళ్ల ప్రాతినిధ్యం ఉన్నా.. అది 5 నుంచి 10 మందికి పరిమితం అయ్యేది. కానీ, ఇప్పుడు జట్టంతా మనోళ్లే కావడం ఎంతైనా గర్వించదగిన విషయం.
ఇదీ కారణం..
అమెరికాలో భారత సంతతి వారి సంఖ్య అరకోటి పైనే ఉంటుంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే చాన్సుంది. రెండు, మూడు తరాల కిందట అమెరికా వెళ్లినవారు అక్కడే స్థిరపడ్డారు. వీరంతా ఎక్కువశాతం క్రికెట్ ఆడేవారే. ఈ కల్చర్ నుంచి వచ్చినందున వారి పిల్లలు సహజంగానే క్రికెట్ పట్ల ఆకర్షితులయ్యారు. ఈ ఆటను తమ కెరీర్ గానూ ఎంచుకున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా సీనియర్ జట్టు కూడా ఎదుగుతోంది. 2024 టి20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ ను ఓడించింది. ఇందులోనూ భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువ ఉండడం విశేషం. మరోవైపు 2012 అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఇప్పుడు అమెరికాలోనే స్థిరపడ్డాడు.
ఇదీ అమెరికా (భారత) అండర్ 19 జట్టు
ఉత్కర్ష్ శ్రీవాస్తవ (కెప్టెన్), అద్నిత్ ఝాంబ్, శివ్ సహానీ, నితీష్ సూదిని, అద్వైత్ క్రిష్ణ, సాహిర్ భాటియా, అర్జున్ మహేష్, అర్మిందర్ గిల్, సబ్రిష్ ప్రసాద్, అదిత్ కాపా, సాహిల్ గార్గ్, అమోఘ్ రెడ్డి ఆరేపల్లి, రిత్విక్ అప్పిడి, రాయనన్ తాజ్, రిషభ్ షింపి.
తెలుగోళ్లు వీరే..తొలి మ్యాచ్ ఇండియాతోనే
అమెరికా అండర్ 19 జట్టులో అమోఘ్, రిత్విక్, నితీశ్ సూదిని తెలుగువారు. వీరిలో రిత్విక్ బౌలర్. కాగా, అమెరికా జట్టు బులవాయోలో గురువారం తమ తొలి మ్యాచ్ ను ఆడేది ఎవరో తెలుసా? ఇంకెవరితో.. టీమ్ ఇండియాతోనే! ఆయుష్ మాత్రే మన జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు.
