మహిళల ప్రపంచ కప్ సెమీస్.. భారత్ ప్రత్యర్థి అమ్మో ఆ జట్టా?
మహిళల వన్డే ప్రపంచకప్.. ఇంతవరకు భారత్ విజేతగా నిలవలేదు.. మొత్తం 12 సార్లు ప్రపంచ కప్ జరిగితే.. ఏడుసార్లు ఆస్ట్రేలియానే గెలిచేసింది
By: Tupaki Entertainment Desk | 26 Oct 2025 9:07 AM ISTమహిళల వన్డే ప్రపంచకప్.. ఇంతవరకు భారత్ విజేతగా నిలవలేదు.. మొత్తం 12 సార్లు ప్రపంచ కప్ జరిగితే.. ఏడుసార్లు ఆస్ట్రేలియానే గెలిచేసింది. నాలుగుసార్లు ఇంగ్లండ్ అమ్మాయిలు కప్ నెగ్గారు. ఒకసారి న్యూజిలాండ్ విజేత. భారత్ కేవలం రెండుసార్లు 2005, 2017లో ఫైనల్ కు వెళ్లినా నిరాశే మిగిలింది. 2005లో మన జట్టును ఓడించింది ఆస్ట్రేలియానే కావడం గమనార్హం.
మహిళలే.. పురుషుల జట్టు తరహాలో..
ఆస్ట్రేలియా పురుషుల జట్టు ప్రపంచ క్రికెట్‌లో ఎంత బలమైనదో అందరికీ తెలిసిందే. 1987, 1999, 2003, 2007, 2015, 2023 ఇలా ఆరుసార్లు విజేతగా నిలిచింది. వీరికంటే ఒక ఆకు ఎక్కువే చదివారు అమ్మాయిలు. ఏడుసార్లు గెలిచారు. మహిళల క్రికెట్‌లోనూ పురుషుల స్థాయిలో సామర్థ్యంతో ఆడతారు కంగారూలు. అందుకే వీరితో మ్యాచ్ అంటే అత్యంత పకడ్బందీగా ఆడాలి. అంతెందుకు.. ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న ప్రపంచ కప్ లో లీగ్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 330 పరుగులు చేస్తే ఆసీస్ మహిళలు 49 ఓవర్లలో 331 పరుగులు కొట్టేశారు. ఏడు వికెట్లు పడినా ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. దీన్నిబట్టే వారి ఆటతీరు ఏ స్థాయలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాతోనే భారత మహిళలు సెమీస్ ఆడాల్సి ఉంది.
30న ముంబైలో..
భారత మహిళల జట్టు ఈ నెల 30న ముంబైలో ఆస్ట్రేలియాను ఢీకొననుంది. ఈ కప్ లీగ్ దశలో ఏడు మ్యాచ్‌లకు గాను ఆసీస్ ఆరు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. 13 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉన్న ఆస్ట్రేలియా.. ఆరు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో చివరి సెమీస్ బెర్తు దక్కించుకున్న భారత్ రెండో సెమీఫైనల్లో తలపడతాయి. మరో సెమీస్ ఈ నెల 29న ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా మధ్య గువాహటిలో జరగనుంది. ఆదివారం భారత్.. బంగ్లాదేశ్ తో తలపడుతుంది. గెలిచినా ఖాతాలో 8 పాయింట్లే ఉంటాయి. మరోవైపు దక్షిణాఫ్రికా 10, ఇంగ్లండ్ 9 పాయింట్లతో రెండు, మూడో స్థానాల్లో సెమీస్ ఆడతాయి. ఆదివారమే ఇంగ్లండ్ తో న్యూజిలాండ్ ఆడనుంది. ఇందులో ఇంగ్లండ్ గెలిచినా 11 పాయింట్లే కాబట్టి సెమీస్ ప్రత్యర్థి మార్పు ఉండదు.
మన అమ్మాయిలకు అవకాశం ఉందా?
భారత మహిళలకు ఈసారైనా ప్రపంచ కప్ గెలిచే చాన్సుందా? సొంతగడ్డపై జరుగుతున్నందున అవకాశం మళ్లీ ఇప్పట్లో రాదు. అయితే, ఆస్ట్రేలియా సెమీస్ లో ఎదురుపడడమే సవాల్. పురుషులైనా, మహిళలైనాఆ నాకౌట్ మ్యాచ్ లలో మరింత పకడ్బందీగా ఆడడం ఆస్ట్రేలియన్ల స్వభావం. అందుకని భారత అమ్మాయిలు ఏ ఒక్క చాన్స్ కూడా ఇవ్వకుండా కంగారూలను కొట్టేయాలి.
