15 ఏళ్ల తర్వాత భారత్ లో కామన్వెల్త్ క్రీడలు! ఇక ఒలింపిక్సే బాకీ
ప్రపంచ క్రీడా మహా సంగ్రామం ఏదంటే ఠక్కున చెప్పే జవాబు ఒలింపిక్స్. ఈ మహా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే భారత్ సత్తాను ప్రపంచానకి చాటి చెప్పడమే.
By: Tupaki Political Desk | 26 Nov 2025 11:39 PM ISTక్రికెట్ లో, ఫుట్ బాల్ లో ప్రపంచ కప్ లు, ఇతర టోర్నీలు ఉన్నాయి... మరి మిగతా క్రీడల్లో? రెండు ప్రపంచ స్థాయి ఈవెంట్లు ఉన్నాయి. వీటిలో పెద్దది ఒలింపిక్స్ కాగా, రెండోది కామన్వెల్త్ క్రీడలు. ఒకప్పటి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలోని దేశాల మధ్య జరిగే క్రీడలే కామన్వెల్త్ పోటీలు. వీటికి 1930లో అంకురార్పణ జరిగింది. అంటే అప్పటికి మన దేశం ఆంగ్లేయుల పాలనలోనే ఉంది. రెండ ప్రపంచ యుద్ధ కారణంగా 1942, 1946లో పోటీలు జరగలేదు. ఇప్పుడు 24వ ఎడిషన్ ఆతిథ్య దేశం ఏదో వెల్లడైంది. 2022లో బర్మింగ్ హామ్ లో జరగ్గా, వచ్చే ఏడాది 2026లో స్కాట్లాండ్ వేదిక కానుంది. ఇక 2030లో మాత్రం మన భారత దేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. 2010లో భారత్ తొలిసారిగా కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. నాడు దేశ రాజధాని ఢిల్లీలో పోటీలు జరిగాయి. ఈసారి మాత్రం అహ్మదాబాద్ ను ఎంచుకున్నారు. వాస్తవానికి ఈ నగరం పేరు దాదాపు నెల కిందటే ఖరారైనా.. బుధవారం 74 సభ్య దేశాల కామన్వెల్త్ స్పోర్ట్స్ వార్షిక సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
ఒలింపిక్స్ రేసులో..
ప్రపంచ క్రీడా మహా సంగ్రామం ఏదంటే ఠక్కున చెప్పే జవాబు ఒలింపిక్స్. ఈ మహా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం అంటే భారత్ సత్తాను ప్రపంచానకి చాటి చెప్పడమే. కానీ, ఇప్పటివరకు మన దేశానికి అవకాశం దక్కలేదు. ఇప్పుడు 2036 ఒలింపిక్స్ రేసులో బలంగా నిలిచింది. ఈ మేరకు మన దేశం బిడ్ కు ఆమోదం దక్కే అవకాశాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. పోటీలో ఉన్న మిగతా దేశాలతో పోలిస్తే భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండడంతో అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఢిల్లీ వంటి నగరాన్ని కాకుండా అహ్మదాబాద్ పేరిట ఒలింపిక్స్ బిడ్ వేశారు. ఈ నగరం గుజరాత్ రాజధాని. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ కు చెందినవారే కావడంతో అహ్మదాబాద్ లో కామన్వెల్త్ క్రీడలు ఆపై ఒలింపిక్స్ నిర్వహణకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. 2028 సమ్మర్ ఒలింపిక్స్ కు అమెరికాలోని లాస్ ఏంజెలిస్, 2032 క్రీడలకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఇస్తున్నాయి.
అహ్మదాబాద్ లోనే వందేళ్ల సంబరం..
కామన్వెల్త్ క్రీడలు 1930లో మొదలయ్యాయి. నాడు కెనడాలోని హామిల్టన్ లో పోటీలు జరిగాయి. 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు 2030లొ అహ్మదాబాద్ లో 2030లో పోటీలు నిర్వహించనున్నారు. అంటే, అరుదైన రీతిలో వందేళ్ల కామన్వెల్త్ క్రీడలకు భారతదేశం వేదిక కానుందన్నమాట. కాగా, అహ్మదాబాద్ తో పాటు నైజీరియా రాజధాని అజూజా కూడా 2030 కామన్వెల్త్ క్రీడలకు పోటీపడింది. అవకాశం మన నగరానికే దక్కింది. కామన్వెల్త్ క్రీడలను విజయవంతం చేయడం ద్వారా ఒలింపిక్స్ ను కూడా భారత్ సమర్థంగా నిర్వహించగలదని చాటే వీలుంది.
17 క్రీడాంశాలు.. క్రికెట్ ఉంటుందా?
అహ్మదాబాద్ లో 15 నుంచి 17 క్రీడాంశాల్లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, టీటీ, వెయిట్ లిఫ్టింగ్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, నెట్ బాల్, బాక్సింగ్ ఖరారయ్యాయి. ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, జూడో, షూటింగ్, స్క్వాష్ తదితరాలతో పాటు టి20 ఫార్మాట్ లో క్రికెట్ కు చోటివ్వాలా? అన్న అంశం చర్చల్లో ఉంది.
క్రీడా కేంద్రంగా అహ్మదాబాద్...
క్రికెట్ లో 2023లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అహ్మదాబాద్ కు ప్రాధాన్యం దక్కింది. వచ్చే ఏడాది మొదట్లో జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లు నిర్వహించే ఐదు నగరాల్లో అహ్మదాబాద్ ఒకటి. ఇప్పుడు కామన్వెల్త్ క్రీడలకూ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆపై ఒలింపిక్స్ కూ సిద్ధం అంటోంది. ఇదంతా చూస్తుంటే భారత క్రీడా కేంద్రం అహ్మదాబాద్ అనే అభిప్రాయం కలుగుతోంది.
