Begin typing your search above and press return to search.

టీమ్ఇండియాతో గంభీర్ క్రికెట్.. ఐపీఎల్ టీమ్ అనుకుంటున్నాడా?

ఇదీ గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచింగ్ లో టీమ్ఇండియా ప‌రిస్థితి. తాజాగా ప్ర‌ఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికాతో ఓట‌మి అనంత‌రం గంభీర్ తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

By:  Tupaki Entertainment Desk   |   17 Nov 2025 6:37 PM IST
టీమ్ఇండియాతో గంభీర్ క్రికెట్.. ఐపీఎల్ టీమ్ అనుకుంటున్నాడా?
X

స్వ‌దేశంలో గ‌త ఆరు టెస్టుల్లో నాలుగు ప‌రాజ‌యాలు.. ఇందులో నిరుడు న్యూజిలాండ్ తో 0-3తో క్లీన్ స్వీప్.. తాజాగా ద‌క్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఓట‌మి..

శుబ్ మ‌న్ గిల్, క‌రుణ్ నాయ‌ర్, సాయి సుద‌ర్శ‌న్, వాషింగ్ట‌న్ సుంద‌ర్.. ఇటీవ‌లి కాలంలో టెస్టుల్లో వ‌న్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఆట‌గాళ్లు..

టి20ల్లో బాగా ఆడుతున్న వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ ను త‌ప్పించి జితేశ్ శ‌ర్మ‌కు చాన్స్.. సుంద‌ర్ కు బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో ప్ర‌మోష‌న్..

వ‌న్డేల్లోనూ త‌ర‌చూ ఒక‌టికి రెండు ప్ర‌యోగాలు..! హ‌ర్షిత్ రాణా వంటి ఆట‌గాడికి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా వ‌రుస‌గా అవ‌కాశాలు..!

..ఇదీ గౌత‌మ్ గంభీర్ హెడ్ కోచింగ్ లో టీమ్ఇండియా ప‌రిస్థితి. తాజాగా ప్ర‌ఖ్యాత ఈడెన్ గార్డెన్స్ లో తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికాతో ఓట‌మి అనంత‌రం గంభీర్ తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అత‌డి ఆలోచ‌నలు ఏమిటి? ఐపీఎల్ టీమ్ అనుకుంటున్నాడా? టీమ్ ఇండియా అనుకుంటున్నాడా? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికా స్పిన్ ను త‌క్కువ అంచ‌నా వేయడం, టీమ్ ఇండియా ఒక బ్యాట‌ర్ ను త‌గ్గించుకుని న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలో దిగ‌డం, చివ‌ర‌కు 124 ప‌రుగుల టార్గెట్ నూ ఛేదించ‌లేక‌పోవ‌డంతో విమ‌ర్శ‌లు మ‌రింత పెరిగాయి.

రెండో టెస్టుకైనా త‌ప్పులు దిద్దుతారా?

టీమ్ ఇండియా ఈ నెల 22 నుంచి గువాహ‌టిలో ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టు ఆడ‌నుంది. మ‌రి అందులోనైనా త‌ప్పులు దిద్దుకుంటుందా? అనేది చూడాలి. ఈడెన్ గార్డెన్స్ లో మొద‌టి టెస్టు తుది జ‌ట్టును చూసిన‌వారు ఆశ్చ‌ర్య‌పోయారు. కార‌ణం... స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్, ఇటీవ‌ల వెస్టిండీస్ తో సిరీస్ లో వ‌న్ డౌన్ లో ఆడిన సాయి సుద‌ర్శ‌న్ ను కాద‌ని వాషింగ్ట‌న్ సుంద‌ర్ కు చోటివ్వ‌డ‌మే. జ‌డేజా, అక్ష‌ర్, కుల్దీప్ ముగ్గురూ ఎడ‌మ‌చేతివాటం వారే అయినంద‌న ఒక‌రిని త్యాగం చేసి సుంద‌ర్ ను ఆడించినా స‌రిపోయేది. అలాకాకుండా సాయిని ప‌క్క‌న‌పెట్టి, సుంద‌ర్ ను ఏకంగా వ‌న్ డౌన్ లో పంపారు. అత‌డు 29, 31 ప‌రుగులు చేసినా అవి జ‌ట్టు ఓట‌మిని ఆప‌లేక‌పోయాయి. సుంద‌ర్ కు మ్యాచ్ మొత్తంలో ఒక‌టే ఓవ‌ర్ బౌలింగ్ ఇవ్వ‌డాన్ని బ‌ట్టి అత‌డిని బ్యాట‌ర్ గానే తీసుకున్న‌ట్లుగా భావించాలి. ఇలాంట‌ప్పుడు సాయినే ఆడిస్తే స‌రిపోయేది క‌దా? మ‌రి రెండో టెస్టుకైనా ఆలోచ‌న మార్చుకుంటారా?

ఇది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ టీమ్ కాదు..

త‌న కెప్టెన్సీలో రెండుసార్లు, కోచింగ్ లో ఒక‌సారి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు గౌత‌మ్ గంభీర్ ఐపీఎల్ టైటిల్స్ అందించాడు. దీంతోనే అత‌డిని టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేశారు. క్రికెట్ నాలెడ్జ్ ఉన్న అత‌డు విప‌రీత ప్ర‌యోగాల‌కు పోతూ విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. ఇలాంటివి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ విష‌యంలో స‌రిపోతాయి కానీ, టీమ్ ఇండియా విష‌యంలో కాద‌నే నిర‌స‌న‌లు వ‌స్తున్నాయి. ద‌క్షిణాఫ్రికా ఇప్ప‌టికే 15 ఏళ్ల త‌ర్వాత భార‌త్ లో టెస్టు గెలిచిన ఊపులో ఉంది. డివిలియ‌ర్స్, డుప్లెసిస్, స్టెయిన్ వంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కాని విజ‌యం ఇది. కాబ‌ట్టి రెండో టెస్టులో టీమ్ ఇండియా జాగ్ర‌త్త‌ప‌డాల్సిందే.