Begin typing your search above and press return to search.

టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు ‘వేక్-అప్ కాల్’.. కివీస్ దెబ్బకు కళ్లు తెరుచుకున్నాయా?

ఈ ఓటమిలోనూ భారత అభిమానులను అలరించింది ఒక్క శివం దూబే మాత్రమే. సిక్సర్ల కింగ్‌గా పేరు తెచ్చుకున్న దూబే కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత క్రికెట్ చరిత్రలో మూడవ వేగవంతమైన అర్ధశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

By:  A.N.Kumar   |   29 Jan 2026 10:59 AM IST
టీ20 వరల్డ్ కప్ ముందు భారత్‌కు ‘వేక్-అప్ కాల్’.. కివీస్ దెబ్బకు కళ్లు తెరుచుకున్నాయా?
X

టీ20 వరల్డ్ కప్ సమరానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో క్రికెట్ ప్రపంచంలో సందడి మొదలైంది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టుకు, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్ ఒక అద్భుతమైన ప్రాక్టీస్ వేదికగా నిలిచింది. అయితే వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు నాలుగో టీ20లో కివీస్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు.. మెగా టోర్నీ ముందు భారత జట్టుకు ఒక గట్టి హెచ్చరిక!

వైజాగ్‌లో విలవిల.. నిర్లక్ష్యానికి భారీ మూల్యం!

విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత్ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్లను ఉతికేస్తూ నిర్ణీత ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫ్లాట్ పిచ్‌పై కివీస్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

లక్ష్య చేధనలో భారత్ కనీస పోరాట పటిమ చూపలేకపోయింది. టాపార్డర్ విఫలమవ్వడంతో నిర్ణీత ఓవర్లలో 165 పరుగులకే పరిమితమై, 40 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్రదర్శించిన 'కాన్ఫిడెన్స్' కాస్తా 'ఓవర్ కాన్ఫిడెన్స్'గా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

దూబే మెరుపులు.. మిగతా వారు నిలకడలేమి!

ఈ ఓటమిలోనూ భారత అభిమానులను అలరించింది ఒక్క శివం దూబే మాత్రమే. సిక్సర్ల కింగ్‌గా పేరు తెచ్చుకున్న దూబే కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది భారత క్రికెట్ చరిత్రలో మూడవ వేగవంతమైన అర్ధశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ అతడికి మరో ఎండ్ నుంచి మద్దతు కరువవ్వడంతో భారత్ గమ్యాన్ని చేరుకోలేకపోయింది.

సూపర్‌స్టార్ల ఫామ్.. ఆందోళనలో అభిమానులు!

టీ20 ఫార్మాట్‌లో భారత్ ఎప్పుడూ తన స్టార్ పవర్‌పైనే ఆధారపడుతుంది. అయితే ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో జట్టు బాధ్యతను మోయాల్సిన ఇద్దరు కీలక ఆటగాళ్ల ప్రదర్శన మేనేజ్‌మెంట్‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుమ్రా, నాలుగో టీ20లో తన మార్క్ చూపలేకపోయాడు. చివరి ఓవర్‌లో దాదాపు 20 పరుగులు సమర్పించుకోవడం బుమ్రా స్థాయికి తగని ప్రదర్శన. వరల్డ్ కప్‌లో బుమ్రా యార్కర్లు మిస్ అయితే భారత్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఫినిషర్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టుకు వెన్నెముక వంటి హార్దిక్, తన స్థిరత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఒక మ్యాచ్‌లో అద్భుతంగా ఆడుతున్నా, కీలకమైన సమయాల్లో వికెట్ పారేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ కప్‌లో జట్టు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే హార్దిక్ బాధ్యతాయుతమైన ఆట తీరు అవసరం.

పాఠాలు నేర్చుకుంటారా?

వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో చిన్న పొరపాట్లకు కూడా తావుండదు. వైజాగ్‌లో ఎదురైన ఈ పరాజయం భారత్‌కు ఒక రకంగా మేలు చేసేదే. లోపాలను సరిదిద్దుకోవడానికి.. వ్యూహాలను పదును పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. మరి ఈ ‘వేక్-అప్ కాల్’ను అందుకుని టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుందో లేదో చూడాలి!