పాతికేళ్ల తర్వాత భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గేలా దక్షిణాఫ్రికా!
నిరుడు ఇదే రోజుల్లో న్యూజిలాండ్ 3-0తో టీమ్ ఇండియాను క్లీన్ స్వీప్ చేసింది. చరిత్రలో ఆ జట్టు భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి.
By: Tupaki Entertainment Desk | 24 Nov 2025 12:43 AM ISTనిరుడు ఇదే రోజుల్లో న్యూజిలాండ్ 3-0తో టీమ్ ఇండియాను క్లీన్ స్వీప్ చేసింది. చరిత్రలో ఆ జట్టు భారత్ లో టెస్టు సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి. పైగా క్లీన్ స్వీప్ కూడా. దీనికిముందు 1988 తర్వాత భారత్ లో టెస్టు మ్యాచ్ గెలవని చరిత్ర న్యూజిలాండ్ ది.
మళ్లీ ఇప్పుడు చూస్తే దక్షిణాఫ్రికా 15 ఏళ్ల తర్వాత భారత్ లో టెస్టు మ్యాచ్ నెగ్గింది. అంతేకాదు 25 ఏళ్ల తర్వాత ఏకంగా టెస్టు సిరీస్ ను కూడా కోల్పోయే ప్రమాదంలో ఉంది. గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఇంకా 480 పరుగులు వెనుకబడి ఉంది.
చివరకు ఫలితం డ్రానేనా?
సిరీస్ లో ఇప్పటికే దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో రెండు రోజులు బ్యాటింగ్ చేసేసింది. అటు చూస్తే ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని గువాహటిలో సాయంత్రం 4 గంటలకే వెలుతురు మందగిస్తోంది. దీంతో మ్యాచ్ ను ముందుగానే ముగించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసే చాన్స్ లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే టీమ్ ఇండియా 0-1తో సిరీస్ కోల్పోయి స్వదేశంలో మరో పరాభవం ఎదుర్కోనుంది.
అద్భుతంగా పోరాడితేనే..
సోమవారం పూర్తిగా, మంగళవారం రెండో సెషన్ వరకు బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా 650 పరుగుల దాక చేయాలి. అప్పుడు రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాను 200 పరుగులకు ఆలౌట్ చేయాలి. దీంతోనే మ్యాచ్ లో టీమ్ ఇండియాకు గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ, ఇది అంత సులభమా? అనేది చర్చనీయాంశం. పైగా కెప్టెన్ శుబ్ మన్ గిల్ లేని మన బ్యాటర్లు 650 చేయడం అంటే మామూలు మాటలు కాదు. ఓపెనర్లు జైశ్వాల్, రాహుల్, కెప్టెన్ పంత్ విరుచుకుపడి ఆడితేనే ఇది సాధ్యం. ఈ క్రమంలో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంత అద్భుతంగా బంతులు వేసినదీ గుర్తుంచుకోవాలి. పేసర్ యాన్సన్, స్పిన్నర్ హార్మర్ అంత తేలిగ్గా పరుగులు ఇచ్చేవారు కాదు.
ఓడితే విమర్శలే..
టీమ్ ఇండియా అసాధారణంగా పోరాడకుంటే దక్షిణాఫ్రికా రెండో టెస్టులో విజయం కష్టమే అని పరిస్థితులు చెబుతున్నాయి. డ్రా అయినా, ఓడినా సొంతగడ్డపై టీమ్ ఇండియా టెస్టు సిరీస్ కోల్పోయినట్లే. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్ లో టీమ్ ఇండియా మరింత వెనుకబడుతుంది. ఇదే జరిగితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు తప్పవు. ఇప్పటికే తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ పై గంభీర్ ను అందరూ తప్పుబట్టారు. అక్షర్ పటేల్ ను తప్పించి రెండో టెస్టులో తెలుగు ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించారు. కానీ, అతడితో పరిమితంగానే బౌలింగ్ చేయించారు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో తేలిపోయాడు. ఇక రెండో టెస్టులో గెలిచి సిరీస్ ను డ్రా చేసే భారం మొత్తం బ్యాట్స్ మెన్ మీదనే ఉంది.
అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో..
చివరిసారిగా దక్షిణాఫ్రికా 2000 సంవత్సరంలో భారత్ లో టెస్టు సిరీస్ ను గెలిచింది. ఈ సిరీస్ అనంతరమే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు క్రికెట్ ను కుదిపేశాయి. అప్పటి టీమ్ ఇండియా కెప్టెన్ అజహరుద్దీన్ కెరీర్ ముగిసింది. భారత్ లో తర్వాత 2010 లో దక్షిణాఫ్రికా ఒక టెస్టులో నెగ్గింది. సిరీస్ మాత్రం 25 ఏళ్ల నుంచి గెలవలేదు.
