టి20 ప్రపంచ కప్ జట్టు.. శుబ్ మన్ గిల్ కు భారీ షాక్
వచ్చే ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టి20 ప్రపంచ కప్ నకు 50 రోజుల ముందుగానే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించేసింది.
By: Tupaki Entertainment Desk | 20 Dec 2025 3:15 PM ISTవచ్చే ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టి20 ప్రపంచ కప్ నకు 50 రోజుల ముందుగానే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించేసింది. ఇటీవలనే టి20 జట్టు వైస్ కెప్టెన్ గా నియమితుడైన టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్ మన్ గిల్ పై వేటు పడింది. అతడు వైస్ కెప్టెన్ అయినప్పటికీ టి20 ప్రపంచ కప్ నకు ఎంపిక చేయలేదు. గత ఏడాది జూన్ లో జరిగిన టి20 ప్రపంచ కప్ లో జట్టులో లేని గిల్.. ఈసారి కూడా ఉండబోవడం లేదు. అయితే, ఈ మధ్య కాలంలోనే అతడు టెస్టు, వన్డే కెప్టెన్ కూడా కావడం గమనార్హం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలతో జరిగిన టి20 సిరీస్ లలో గిల్ వరుసగా విఫలం కావడంతో అతడిపై వేటు పడిందని చెప్పుకోవాలి. పైగా గిల్ తాజా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నాలుగో మ్యాచ్ నుంచి అందుబాటులో లేడు. గాయం అని కారణం చెప్పినా అసలు సంగతి ఫామ్ లో లేకపోవడమే అనుకోవాలి. ఇప్పుడు ఏకంగా టి20 ప్రపంచ కప్ జట్టులోనే చోటు లేకుండా పోయింది.
సూర్య సారథ్యం పదిలం..
ఆస్ట్రేలియా టూర్ నుంచి వరుసగా విఫలం అవుతున్నప్పటికీ డాషింగ్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ పై సెలక్టర్లు మరింత నమ్మకం ఉంచారు. బ్యాటర్ గా విఫలం అవుతున్నా సిరీస్ లు గెలుస్తుండడంతో సూర్యను టి20 ప్రపంచ కప్ సారథిగా కొనసాగించారు. అనూహ్యంగా ఇతడికి డిప్యూటీగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను నియమించారు. గత బుధవారం జరిగిన దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీలో జార్ఖండ్ ను విజేతగా నిలిపిన ఎడమచేతివాటం వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు మళ్లీ పిలుపొచ్చింది. కొత్త పెళ్లి కొడుకు రింకూ సింగ్ కు కూడా చోటు కల్పించారు.
ఒక్కటే మార్పు..
గిల్ ను తప్పించి ఇషాన్ కిషన్ కు చోటివ్వడం తప్ప టి20 ప్రపంచ కప్ జట్టులో పెద్దగా మార్పుల్లేవు. టెస్టులు, వన్డే కెప్టెన్ గా ఉన్న గిల్ ను టి20లకూ కెప్టెన్ చేస్తారని మొన్నటివరకు కథనాలు వచ్చాయి. కానీ, అతడి హోదాను సైతం పక్కనపెట్టి టి20 జట్టు నుంచి తప్పించడం గమనార్హం.
ఇదీ ప్రపంచ కప్ టి20 జట్టు: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూసింగ్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
