పాకిష్టి నఖ్వి చేతులు తాకిన ఆసియా కప్ మనకు అవసరమా?
ఆసియా కప్ ముగిసి రెండు రోజులైంది.. భారత్ విజేతగా నిలిచిన ఈ టోర్నీలో ఇప్పటివరకు ట్రోఫీ మన జట్టు చేతికి రాలేదు.
By: Tupaki Entertainment Desk | 1 Oct 2025 9:17 AM ISTఆసియా కప్ ముగిసి రెండు రోజులైంది.. భారత్ విజేతగా నిలిచిన ఈ టోర్నీలో ఇప్పటివరకు ట్రోఫీ మన జట్టు చేతికి రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్ గా ఉన్న పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా అయిన మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు టీమ్ ఇండియా నిరకారించగా.. అతడు ఆ ఉక్రోశంతో ట్రోఫీతో పాటు విజేత జట్టు ఆటగాళ్ల మెడల్స్ ను తనతో పాటు తీసుకెళ్లాడు. దుబాయ్ లోని తాను ఉంటున్న హోటల్ లో వాటిని ఉంచినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే, దీనిపై మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గట్టిగా నిలదీసింది.
వర్చువల్ గా వచ్చాడు...
దుబాయ్ లోనే ఏసీసీ ప్రధాన కార్యాలయం ఉంది. అక్కడ జరిగిన ఏసీఏ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)కు నఖ్వి వర్చువల్ గా హాజరయ్యాడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా దీంతో అతడిని గట్టిగా నిలదీశారు. ఆసియా కప్ ఏసీసీ సొత్తు అని.. నీ సొంతం కాదని.. సరైన రీతిలో విజేత జట్టు భారత్ కు అందజేయాలని డిమాండ్ చేశారు. ఏసీసీ కూడా వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇక్కడ మాట్లడను...
గుంటనక్క బుద్ధి చూపి నఖ్వి.. అతి తెలివి సమాధానాలు ఇచ్చాడు. తన నుంచి ట్రోఫీని తీసుకోబోమని టీమ్ ఇండియా నుంచి లేఖ రాలేదని చెప్పాడు. కానీ, శుక్లా పట్టువీడలేదు. దీంతో ఈ సమావేశంలో కాదు.. మరోచోట మాట్లాడతానని నఖ్వి దాటవేశాడు. దీంతో ఏసీఏ ప్రధాన కార్యాలయంలో ట్రోఫీని ఉంచాలని.. అక్కడినుంచి తాము తీసుకుంటామని బీసీసీఐ చెప్పినా నఖ్వి పట్టించుకోలేదు. ఈ విషయంలో చర్చించాల్సి ఉందంటూ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చాడు.
చర్చించేది లేదు...
నఖ్వి తీరు చూసిన శుక్లా మరింత ఆగ్రహంగా స్పందించారు. ఇకమీదట చర్చించేది ఏమీలేదని, ట్రోఫీ తమదని ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నవంబరులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలోనూ దీనిని లేవనెత్తుతామని తెలిపారు.
-రెండు రోజుల పాటు నఖ్వి వంటి వ్యక్తి వద్దనే ఉన్న ఆసియా కప్ ఇప్పుడు మనకు అవసరమా? ఎలాగూ రికార్డుల్లో విజేత జట్టుగా మన దేశం పేరే ఉంటుంది. అది చెరిపేయలేనిది. ఇక ఆసియా కప్ ట్రోఫీ నఖ్వీ నుంచి వస్తే ఎంత రాకపోతే ఎంత?
