భారత్-పాక్ మ్యాచ్..ఐసీసీకి డబ్బు అవసరమా? మాజీ కెప్టెన్ మాట
ఒకప్పుడు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ దౌత్య సంబంధాలకు వేదికగా నిలిచేది. కానీ, ఇప్పుడు భారత్ ఎంతో ఎదిగింది.
By: Tupaki Political Desk | 6 Oct 2025 6:00 PM ISTపెహల్గాం వంటి భయంకరమైన ఉగ్రదాడి తర్వాత కూడా భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఎలా జరిగింది...? ఆ దాడి జరిగిన కేవలం నాలుగు నెలల్లోనే ఈ రెండు జట్లు ఎలా తలపడ్డాయి..? ఆపరేషన్ సిందూర్ తో దాదాపు యుద్ధం వరకు వెళ్లిన ఈ రెండు దేశాల మధ్య మూడున్నర నెలల్లోనే నాలుగు సార్లు క్రికెట్ మ్యాచ్ లు ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) నిబంధనలు అని చెప్పాలి. వాస్తవానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఉన్న ప్రస్తుత ఆర్థిక స్థితికి ఈ టోర్నమెంట్ ల విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నా చెల్లుతుంది. కానీ, బోర్డు మాత్రం నిబంధనలను గౌరవించింది. అయితే, ఇకమీదట మాత్రం భారత్-పాక్ మ్యాచ్ లు తరచూ నిర్వహించవద్దనే అనూహ్య సూచన వచ్చింది. ఇదేదో.. భారత్, పాక్ దేశాలకు చెందిన క్రికెటర్ నుంచి కాదు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నుంచి కావడం అసలు విషయం.
దౌత్యం పోయి ఉద్రిక్తం...
ఒకప్పుడు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ దౌత్య సంబంధాలకు వేదికగా నిలిచేది. కానీ, ఇప్పుడు భారత్ ఎంతో ఎదిగింది. పాక్ మాత్రం కిందకు దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లోనే పెహల్గాం దాడి జరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో ఇకమీదట క్రికెట్ మ్యాచ్ లు వద్దు అనే డిమాండ్ గట్టిగా వచ్చింది. అయినా ఈ ఉద్రిక్తతల మధ్య వరుసగా నాలుగో ఆదివారం (మూడు పురుషుల జట్ల మధ్య), ఒకటి మహిళల జట్ల మధ్య) మ్యాచ్ లు జరిగాయి. భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ లు ఇవ్వకుండా పాక్ ఆటగాళ్లు కుమిలిపోయేలా చేశారు. ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ రంగప్రవేశం చేశాడు.
డబ్బు కోసమ మ్యాచ్ లా..?
ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ప్రజలను ఆకట్టుకుని వ్యూయర్ షిప్ పెంచుకునే ఆర్థిక కారణాలతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే దౌత్య ఉద్దేశాలతో భారత్-పాక్ మధ్య మ్యాచ్ లు ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై మాత్రం ఐసీసీ డబ్బు కోసం ప్రతి టోర్నీల్లో భారత్-పాక్ మ్యాచ్ లు నిర్వహించడం మానేయాలని అథర్టన్ సూచించాడు. 2023-27 మధ్య బ్రాడ్ కాస్టింగ్ హక్కుల రూపేణా ఐసీసీకి రూ.3 బిలియన్ డాలర్లు వచ్చాయని, ఇదంతా.. భారత్-పాక్ మ్యాచ్ ల కారణంగానే అని తెలిపాడు. అసలు ఐసీసీ బ్యాలెన్స్ షీట్ కు ఈ రెండు దేశాల మ్యాచ్ లే కీలకంగా అని వ్యాఖ్యానించాడు. వచ్చే సీజన్ నుంచి అయినా ప్రతి టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ లు నిర్వహించవద్దని, అలాగైతేనే అభిమానుల్లో ఆసక్తి సజీవంగా ఉంటుందని వివరించాడు.
