పాక్ క్రికెటర్లతో వరుసగా 4వ ఆదివారం మ్యాచ్ లో నో షేక్ హ్యాండ్
పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ పీక నొక్కిన భారత్.. క్రికెట్ మైదానంలో గత వారం ఆసియా కప్ నెగ్గి యుద్ధంలోనే కాదు క్రీడల్లోనూ మా ముందు నిలవలేవ్ అని గట్టిగా చెప్పింది.
By: Tupaki Entertainment Desk | 5 Oct 2025 5:11 PM ISTపెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా.. ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్ పీక నొక్కిన భారత్.. క్రికెట్ మైదానంలో గత వారం ఆసియా కప్ నెగ్గి యుద్ధంలోనే కాదు క్రీడల్లోనూ మా ముందు నిలవలేవ్ అని గట్టిగా చెప్పింది. వరుసగా మూడు మ్యాచ్ లలో పాక్ తో తలపడినప్పటికీ ఆసియా కప్ లో ఒక్కసారీ టాస్ సందర్భంగా కానీ, మ్యాచ్ ముగిశాక కానీ ఆ జట్టు ఆటగాళ్లతో టీమ్ ఇండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేయలేదు. యూఏఈ, శ్రీలంక ఆటగాళ్లతో మైదానంలో ఎంతో సరదాగా సంభాషించిన మన క్రికెటర్లు.. పాక్ ఆటగాళ్లను మాత్రం కనీసం పట్టించుకోలేదు. ఈ ఉక్రోశం కారణంగా రగిలిపోయిన వారు.. టీమ్ ఇండియాతో మ్యాచ్ లో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పై ఆక్రోశం వెళ్లగక్కారు. అతడు ఉంటే తాము యూఏఈతో మ్యాచ్ ఆడేది లేదంటూ భీష్మించారు. చివరకు తోక ముడిచి దారికొచ్చారు.
మూడు సార్లు కాదు.. నాలుగుసార్లు
ఆసియా కప్ లో గత నెల 14, 21, 28 తేదీల్లో భారత పురుషుల జట్టు పాకిస్థాన్ తో ఆడింది. ఇవన్నీ ఆదివారాలే. కానీ, ఒక్కసారి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. వాస్తవానికి ఆసియా కప్ లో పాక్ తో ఆడితే ఏం చేయాలి? అనేది ముందుగా అనుకున్నట్లు లేరు. బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు వెళ్లినట్లు లేదు. టోర్నీ ప్రారంభమయ్యాక నో షేక్ హ్యాండ్ నిర్ణయం తీసుకున్నారు. చివరి వరకు కొనసాగించారు. ఇప్పుడు తాజాగా మహిళల వన్డే ప్రపంచ కప్ లో భాగంగా కొలంబోలో పాకిస్థాన్ తో మ్యాచ్ లోనూ ఇదే పద్ధతి పాటించారు. కాగా, పాక్ అమ్మాయిలతో షేక్ హ్యాండ్ వద్దని గత బుధవారం టీమ్ ఇండియా మహిళల జట్టుకు బీసీసీఐ ఆదేశించింది. వీటిని ఆదివారం కొలంబోలో మొదలైన మ్యాచ్ లో మన అమ్మాయిలు పాటించారు.
-మహిళల ప్రపంచ కప్ ను భారత్, శ్రీలంక ఉమ్మడిగా నిర్వహిస్తున్నాయి. పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ లో ఆడేందుకు ఎలాగూ అనుమతి ఉండదు. దీంతో మ్యాచ్ ను శ్రీలంక రాజధాని కొలంబోలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం మ్యాచ్ మొదలైంది. అంటే, వరుసగా నాలుగో ఆదివారం భారత్ -పాక్ క్రికెట్ మ్యాచ్. అదికూడా నో షేక్ హ్యాండ్ తో అన్నమాట.
