ఆసియాకప్ ఫైనల్..భారత్-పాక్ మధ్య తేడా అతడే..పాక్ మాజీల ఏడుపు
ఒక బ్యాటర్ ను ఆకాశానికెత్తేస్తూ పరోక్షంగా అతడికి చేటు చేసే వ్యూహం ఏదైనా పాకిస్థాన్ క్రికెటర్లు చేస్తున్నారా? అని అభిషేక్ శర్శ విషయంలో అనిపిస్తోంది.
By: Tupaki Entertainment Desk | 27 Sept 2025 3:45 PM ISTప్రతి ఇన్నింగ్స్ లో 30పైగా రన్స్... 6 మ్యాచ్ లు 309 పరుగులు.. సూపర్ 4లో 74, 74, 61.. ! ఇవీ ఆ బ్యాట్స్ మన్ స్కోర్లు.. సహజంగా టోర్నీలో టాప్ స్కోరర్ కూడా అతడే..! దీంతో ప్రత్యర్థులు అతడు బరిలో ఉంటేనే బెంబేలెత్తి పోతున్నారు.. తొలి బంతి నుంచే సిక్సులు, ఫోర్లు కొడుతూ చెలరేగిపోతున్నాడు. ఇప్పుడు ఫైనల్ ముంగిట కూడా అంతా అతడి ప్రస్తావనే వస్తోంది. ఆదివారం జరిగే ఆసియా కప్ తుది సమరంలో భారత్-పాకిస్థాన్ మధ్య తేడా అతడేనని అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ఏడుపు మొదలుపెట్టారు.
ఎందుకు గురిపెట్టారో..??
ఒక బ్యాటర్ ను ఆకాశానికెత్తేస్తూ పరోక్షంగా అతడికి చేటు చేసే వ్యూహం ఏదైనా పాకిస్థాన్ క్రికెటర్లు చేస్తున్నారా? అని అభిషేక్ శర్శ విషయంలో అనిపిస్తోంది. మొన్న మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అదేపనిగా అభిషేక్ ను పొగిడాడు. అతడి ఏకగ్రాత చెడగొట్టడంలో భాగంగా ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అభిషేక్ గనుక తుది జట్టులో లేకుంటే, అతడు మంచి స్టార్ట్ ఇవ్వకుంటే మిగతా భారత జట్టంతా సాధారణం అని పాక్ వైపు నుంచి విశ్లేషణలు వస్తున్నాయి. అభిషేక్ లేకుంటే భారత్ పై తమదే గెలుపు అనేలా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. అక్తర్ ఐతే తత్తరపాటుతో అభిషేక్ శర్మను అభిషేక్ బచ్చన్ (బాలీవుడ్ హీరో) అంటూ పలికి ట్రోలింగ్ కు గురయ్యాడు.
అతడు నిలవకుంటే...
వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, కెప్టెన్ గిల్ పెద్దగా ఫామ్ లో లేరు.. మిడిలార్డర్ లో తిలక్ వర్మ కుర్రాడు.. సంజూ శాంసన్ ను మరీ కిందకు దింపుతున్నారు. కాబట్టి.. అభిషేక్ శర్మ గనుక త్వరగా ఔట్ అయితే తమ పని తేలిక అని పాక్ భావిస్తోంది. అందుకనే ఈ యువ ఓపెనర్ పై టార్గెట్ పెట్టింది. పరోక్షంగా అతడిపై ఒత్తిడి పెంచుతోంది. జట్టు భారం అంతా అతడే మోస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తూ ఇరుకున పెట్టాలని చూస్తోంది. అయితే, టీమ్ ఇండియా మరీ ఏమీ అంత బలహీనంగా లేదు. గిల్, సూర్య టాప్ క్లాస్ ప్లేయర్లు. వీరికితోడు తిలక్, సంజూ ఉండనే ఉన్నారు. ఇక శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లు విరుచుకుపడతారు. వీరిలో ఎవరు అందుబాటులో లేకున్నా రింకూసింగ్, జితేశ్ శర్మ వంటి హిట్టర్లు కాచుకు కూర్చున్నారు.
-శ్రీలంకతో మ్యాచ్ కు ముందు అభిషేక్ కు గాయం అయిందని పాక్ ఆనందపడింది. కానీ, అతడు మైదానంలోకి దిగి దుమ్మురేపాడు. ఇప్పుడు ఫైనల్లోనూ తన బ్యాట్ చెలరేగడం ఖాయం. అందుకే పాక్ మాజీలు అభిషేక్ లేకుంటేనా? అని ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి అభిషేక్ టీమ్ ఇండియా రెగ్యులర్ ఓపెనర్ గా ఆడుతున్నది ఏడాది నుంచే. దీనికిముందే టి20 ప్రపంచ కప్ లో రోహిత్, కోహ్లి వంటి స్టార్లు ఓపెనర్లుగా వచ్చారు. దీన్నిబట్టే.. టీమ్ ఇండియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బౌలింగ్ లో అయినా మనమే ఫేవరెట్
బ్యాటింగ్ లోనే కాదు.. బౌలింగ్ లోనూ టీమ్ ఇండియాదే పైచేయి. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి, చైనామన్ కుల్దీప్ యాదవ్ తోడవడం ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతోంది. అన్నిటికీ మించి స్టార్ పేసర్ బుమ్రా ఎప్పుడైనా చెలరేగే బౌలర్. అందుకే, పాక్ మానసిక యుద్ధానికి దిగుతోంది. దీనిని ఛేదించే సత్తా అభిషేక్ కే కాదు టీమ్ ఇండియాలోని ప్రతి ఆటగాడి ఉంది.
