భారత్ -పాక్.. ఒకే రోజు 2 మ్యాచ్ లు.. నో షేకహ్యాండ్స్!
ప్రపంచం అంతా గొప్పగా జరుపుకొనే వాలైంటైన్స్ డే (ప్రేమికుల రోజు) మరుసటి రోజే భారత్-పాక్ జట్ల మధ్య టి20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది.
By: Tupaki Political Desk | 20 Jan 2026 12:46 PM ISTపురుషుల ఆసియా కప్ లో వరుసగా మూడు మ్యాచ్ లు.. మహిళల వన్డే ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్.. అండర్-19 ఆసియా కప్ లో ఒక మ్యాచ్..! ఇవీ ఇటీవలి కాలంలో చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ మధ్య జరిగిన సమరాలు. ఈ వరుసలోనే మరో రెండు మ్యాచ్ లు ఆడనున్నారు. వీలైతే మరోటి కూడా ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. వచ్చే నెల 7 నుంచి పురుషుల టి20 ప్రంపచ కప్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా భారత్-పాక్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే, పెహల్గాంలో గతేడాది ఏప్రిల్ లో జరిగిన ఉగ్రదాడి రీత్యా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత వీసాలను నిరాకరిస్తున్నారు. పాక్ సంతతి ఆటగాళ్లు విదేశీ జట్లకు ఆడుతున్నప్పటికీ నిర్దేశిత పరిశీలన తర్వాత వీసాలు మంజూరు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికీ కొందరి వీసాలకు సంబంధించిన విషయాలపై వార్తలు వచ్చాయి. ఇంకా అనుమతులు రాలేదనే కథనాలు వ్యాపించాయి. దీనిపై భారత ప్రభుత్వం సైతం స్పందించింది. మొత్తానికి ప్రపంచ కప్ ప్రారంభమయ్యే నాటికి అంతా ప్రశాంతంగా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి.
వాలైంటెన్స్ డే తెల్లారే..
ప్రపంచం అంతా గొప్పగా జరుపుకొనే వాలైంటైన్స్ డే (ప్రేమికుల రోజు) మరుసటి రోజే భారత్-పాక్ జట్ల మధ్య టి20 ప్రపంచకప్ మ్యాచ్ జరగనుంది. ఈ కప్ నకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. పాక్ ఆటగాళ్లకు ఎలాగో వీసాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ మ్యాచ్ ను శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. ఇది సరే.. ఎప్పుడో షెడ్యూల్ అయింది. మరి రెండో మ్యాచ్ సంగతి ఏమిటని అడుగుతున్నారా? అదే.. థాయ్ లాండ్ లో ఉమెన్స్ ఏసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ భారత్-పాక్ ఏ జట్లు తలపడతాయి. అంటే.. ఫిబ్రవరి 15న భారత అభిమానులకే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు అందరికీ నరాలు తెగే ఉత్కంఠే అన్నమాట.
ఈ మధ్యలోనే అండర్ 19 మ్యాచ్
ప్రస్తుతం జింబాబ్వే-నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో అండర్-19 పురుషుల ప్రపంచ కప్ జరుగుతోంది. ఇందులో భాగంగా భారత్ ఇప్పటికే అమెరికా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గెలుపొందింది. లీగ్ దశలో భారత్- పాక్ జట్ల మ్యాచ్ లేదు. ప్లేఆఫ్స్ లో మాత్రం పోటీ పడే చాన్సుంది.
ఈసారీ షేక్ హ్యాండ్ లు లేనట్లే..
పెహల్గాం ఉగ్రదాడి అనంతరం తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో సెప్టెంబరులో జరిగిన ఆసియాకప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇదే పద్ధతి మహిళల వన్డే ప్రపంచకప్, ఆసియాకప్ అండర్-19లోనూ కొనసాగించారు. మళ్లీ ఇప్పుడు కూడా అదే కొనసాగే వీలుంది.
