Begin typing your search above and press return to search.

సలాం సూర్యభాయ్.. పాకిస్తాన్ ను ఓడించి మరీ కౌంటర్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్.. కేవలం ఒక క్రికెట్ పోరుగా కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచింది.

By:  A.N.Kumar   |   15 Sept 2025 9:39 AM IST
సలాం సూర్యభాయ్.. పాకిస్తాన్ ను ఓడించి మరీ కౌంటర్ ఇచ్చిన టీమిండియా కెప్టెన్
X

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్.. కేవలం ఒక క్రికెట్ పోరుగా కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచింది. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు, అలాగే దేశం కోసం పాక్ పై ఆపరేషన్ సింధూర్ లో పోరాడిన సైనికులకు ట్రిబ్యూట్ గా ఈ విజయాన్ని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రజేంటేషన్ లో పేర్కొనడం సంచలనమైంది. అలాగే పాకిస్తాన్ ఆటగాళ్లతో కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి సూర్యకుమార్ యాదవ్ , టీమిండియా ఆటగాళ్లు మొగ్గు చూపలేదు. పహల్గాం అటాక్ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన మొదటి క్రీడా పోరు ఇది. ఈ మ్యాచ్ జరగకూడదంటూ కొంతమంది భారత అభిమానులు బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ, షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ హైలైట్స్

ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరచింది. మొదట బౌలింగ్‌లో భారత బౌలర్లు, ముఖ్యంగా కులదీప్ యాదవ్ (3 వికెట్లు), అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (చెరో 2 వికెట్లు) పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో కేవలం 127 పరుగులకే పరిమితం చేశారు. పాకిస్తాన్ తరఫున ఫర్హాన్ (40) , షాహీన్ అఫ్రిది (33) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

అనంతరం 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాట్స్‌మెన్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31) దూకుడుగా ఆడగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్) , తిలక్ వర్మ (31) అద్భుతమైన భాగస్వామ్యంతో విజయాన్ని సులభతరం చేశారు. టీమిండియా కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

హ్యాండ్‌షేక్‌లు లేవు, పహల్గాం బాధితులకు నివాళి, సైనికులకు సెల్యూట్

సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుని అభినందించుకోవడం ఒక సంప్రదాయం. కానీ ఈ మ్యాచ్‌లో ఆ సంప్రదాయం జరగలేదు. పాకిస్తాన్ ఆటగాళ్లు హ్యాండ్‌షేక్ కోసం వేచి ఉన్నప్పటికీ, భారత ఆటగాళ్లు వారి వైపు వెళ్లలేదు. ఈ చర్య భారతీయ అభిమానుల దృష్టిలో ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచింది.

మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మా సంతాపం. వీరోచితంగా పోరాడిన భారత సైన్యంతో మా సంఘీభావం ఎల్లప్పుడూ ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. ఈ చర్య మ్యాచ్ విజయం కంటే కూడా దేశభక్తిని చాటి చెప్పేదిగా నిలిచింది. భారత జట్టు పహల్గాం దాడికి సరైన ప్రతీకారం తీర్చుకుందని అభిమానులు భావిస్తున్నారు.

*అభిమానుల నిరసన, ప్రభుత్వ వివరణ

పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడటంపై సగటు భారతీయుడు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "రక్తం, నెత్తురు కలసి ప్రవహించలేవు" అని నినాదాలు చేస్తూ, సోషల్ మీడియాలో 'మ్యాచ్ బహిష్కరణ' ఉద్యమం నడిపారు. టీవీలో కూడా మ్యాచ్ చూడకూడదని నిర్ణయించుకున్నారు.

అయితే, కేంద్ర క్రీడా శాఖ మంత్రి - బీసీసీఐ ఈ అంశంపై స్పష్టత ఇచ్చాయి. ఈ మ్యాచ్ ద్వైపాక్షిక సిరీస్‌లో భాగం కాదని, ఐసీసీ నిర్వహించే మెగా టోర్నమెంట్ అని, దీనికి తటస్థ వేదికలను ఉపయోగిస్తున్నామని వారు వివరించారు. అయినప్పటికీ, నిరసన ఉద్యమం ఆగలేదు. చివరకు, మైదానానికి భారీగా ప్రేక్షకులు వచ్చారు, టీవీల్లో కూడా మ్యాచ్‌ని ఎందరో వీక్షించారు.

మొత్తం మీద ఈ మ్యాచ్ కేవలం ఒక క్రికెట్ పోటీగా కాకుండా, దేశభక్తిని, సైనికుల త్యాగాలను స్మరించుకునే ఒక వేదికగా నిలిచింది. క్రీడలు కూడా ఒక దేశపు భావోద్వేగాలను ఎలా ప్రతిబింబిస్తాయో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.