దాదాపు ఇండియాను కొట్టినంత పనిచేసిన ఒమన్
ఆసియా కప్‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న వేళ, ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
By: A.N.Kumar | 20 Sept 2025 9:50 AM ISTఆసియా కప్‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న వేళ, ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. చిన్న జట్టుగా భావించిన ఒమన్, అంచనాలకు మించి పోరాడి భారత్‌ను చెమటలు పట్టించింది. దీంతో క్రికెట్ అభిమానులు, నిపుణులు ఆశ్చర్యపోయారు.
భారత్‌కు చుక్కలు చూపించిన ఒమన్
ఆసియా కప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నెమ్మదిగా ఉన్న పిచ్‌పై సంజు 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఈ లక్ష్యం ఒమన్ లాంటి చిన్న జట్టుకు పెద్ద కష్టం కాదని అంతా అనుకున్నారు. కానీ, ఆట మొదలయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఒమన్ జట్టు 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి, భారత బౌలర్లకు గట్టి పోటీ ఇచ్చింది. ఓపెనర్లు జాతిందర్ సింగ్ (32), అమీర్ ఖలీమ్ (64), హమ్మద్ మీర్జా (51) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత బౌలర్లను ఎదుర్కొంటూ వీరు పరుగులు సాధించారు. ఒకానొక దశలో ఒమన్ విజయం సాధించేలా కనిపించింది. అయితే, చివరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, విజయాన్ని కైవసం చేసుకున్నారు. చివరికి భారత్ 21 పరుగుల తేడాతో గెలిచింది.
ఒమన్ వర్సెస్ పాకిస్తాన్: విమర్శకుల ప్రశంసలు
ఈ మ్యాచ్ తర్వాత ఒమన్ ప్రదర్శనను అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో పోలుస్తూ విశ్లేషకులు ఒమన్ ఆటకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు సూపర్ 4 దశకు చేరుకున్నప్పటికీ, లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ భారత్ బౌలింగ్‌ను ఏమాత్రం ప్రతిఘటించలేక, స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. దానితో భారత్ సులభంగా గెలిచింది.
అదే సమయంలో ఒమన్ లాంటి చిన్న జట్టు భారత్‌కు ఇంత గట్టి పోటీ ఇవ్వడం పాకిస్తాన్ ఆటగాళ్లకు ఒక గుణపాఠం అని విమర్శకులు అంటున్నారు. ఒమన్ ఆటగాళ్ల తెగువ, పోరాట పటిమను చూసి పాకిస్తాన్ ఆటగాళ్లు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్‌కు ఒక హెచ్చరిక అందింది. "సూపర్ ఫోర్" దశలో సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు, జట్టు తమ ప్రదర్శనను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
