Begin typing your search above and press return to search.

చ‌రిత్ర‌లో తొలిసారి... స్వ‌దేశంలో టీమ్ ఇండియాకు డబుల్ వైట్ వాష్!

కానీ, ప్ర‌పంచ క్రికెట్ లో ప్ర‌స్తుతం బ‌ల‌మైన‌దిగా ఉన్న టీమ్ ఇండియా వైట్ వాష్ ముంగిట నిలిచింది.

By:  Tupaki Entertainment Desk   |   25 Nov 2025 6:06 PM IST
చ‌రిత్ర‌లో తొలిసారి... స్వ‌దేశంలో టీమ్ ఇండియాకు డబుల్ వైట్ వాష్!
X

క్రికెట్ లో ఏ జ‌ట్టునైనా దాని సొంత‌గ‌డ్డ‌పై ఓడించ‌డం క‌ష్టం..! వైట్ వాష్ (సిరీస్ లోని అన్ని మ్యాచ్‌లు విజిటింగ్ జ‌ట్టు గెల‌వ‌డం) చేయ‌డం ఇంకా క‌ష్టం. ఇలా ఓడిపోవ‌డం అంటే ఆతిథ్య దేశ జ‌ట్టు బ‌ల‌హీన‌మైన‌ది అయి ఉండాలి. కానీ, ప్ర‌పంచ క్రికెట్ లో ప్ర‌స్తుతం బ‌ల‌మైన‌దిగా ఉన్న టీమ్ ఇండియా వైట్ వాష్ ముంగిట నిలిచింది. ఫ‌లితం ఇలానే వ‌స్తే చ‌రిత్ర‌లో తొలిసారి డ‌బుల్ వైట్ వాష్ కు గురైన అనుకోని రికార్డును మూట‌గ‌ట్టుకుంటుంది. అది కూడా ఏడాది వ్య‌వ‌ధిలోనే కావ‌డం గ‌మ‌నార్హం. అసోంలోని గువాహ‌టిలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా ముంగిట ఏకంగా 549 ప‌రుగుల భారీ టార్గెట్ నిలిచింది. 400కు మించి టార్గెట్ ను ఛేదించిన చ‌రిత్ర ఏ జ‌ట్టుకూ లేదు. అయితే, మ‌న జ‌ట్టు డ్రా చేసుకుంటుంద‌నే ఆశ‌లు కూడా స‌న్న‌గిల్లాయి. కార‌ణం.. మంగ‌ళ‌వారం 15.5 ఓవ‌ర్ల‌లోనే భార‌త్ కీల‌క‌మైన ఓపెన‌ర్లు జైశ్వాల్ (13), రాహుల్ (6) వికెట్ల‌ను కోల్పోయింది. బుధ‌వారం టెస్టుకు చివ‌రి రోజు. ఈ రోజంతా నిలిస్తే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. లేదంటే, 0-2తో వైట్ వాష్ ప‌రాభ‌వం త‌ప్ప‌దు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల జోరు చూస్తుంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించినా గొప్పే అని చెప్పుకోవాల్సి ఉంటుంది.

వారు అలా.. మ‌నవాళ్లు ఇలా..

రెండో టెస్టుకు ఆతిథ్యం ఇస్తున్న గువాహ‌టిలోని మైదానం పిచ్ రోడ్డు త‌ర‌హాలో ఉంద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కానీ, అలాంటి పిచ్ పైనే ద‌క్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ మెరుగ్గా రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో ద‌క్షిణాఫ్రికా 8వ నంబ‌రు బ్యాట‌ర్ సేనురాన్ ముత్తుస్వామి సెంచ‌రీ చేయ‌గా, ఆల్ రౌండ‌ర్ మార్కొ యాన్సెన్ త్రుటిలో సెంచ‌రీ మిస్స‌య్యాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ 94 ప‌రుగులు చేశాడు. అత‌డు ఔట్ అయ్యాక 260 ప‌రుగుల వ‌ద్ద ద‌క్షిణాఫ్రికా త‌మ రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. భార‌త్ కు 549 ప‌రుగుల టార్గెట్ పెట్టింది. కాగా ఇదే పిచ్ పై తొలి ఇన్నింగ్స్ లో 201 ప‌రుగుల‌కు ఆలౌటైన టీమ్ ఇండియా.. రెండో ఇన్నింగ్స్ లోనూ 27 ప‌రుగుల‌కే 2 వికెట్లు కోల్పోయింది. చూస్తుంటే.. మ‌నం ఆడుతున్న‌ది ద‌క్షిణాఫ్రికాలోనా? ఇండియాలోనూ అన్న అనుమానం కూడా క‌లిగింది.

నిరుడు న్యూజిలాండ్.. ఇప్పుడు స‌ఫారీలు

స‌రిగ్గా నిరుడు అక్టోబ‌రు-న‌వంబ‌రు నెల‌ల్లో న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా 0-3తో వైట్ వాష్ కు గురైంది. చ‌రిత్ర‌లో మ‌న జ‌ట్టు సొంత‌గ‌డ్డ‌పై వైట్ వాష్ కు గుర‌వ‌డం ఇదే మొద‌టిసారి. అంత‌కుముందు ఎప్పుడో 1988లో భార‌త గ‌డ్డ‌పై చివ‌రిగా టెస్టు మ్యాచ్ నెగ్గింది న్యూజిలాండ్. అస‌లు సిరీస్ ను గెలిచిందే లేదు. అలాంటిది గ‌త ఏడాది ఏకంగా వైట్ వాష్ చేసింది. ఇప్ప‌డు ద‌క్షిణాఫ్రికా కూడా తొలిసారిగా భార‌త్ ను భార‌త్ లో వైట్ వాష్ చేసే స్థితిలో ఉంది. కోల్ క‌తాలో జ‌రిగిన తొలిటెస్టుకు ముందు చివ‌ర‌గా 2010లో భార‌త్ లో టెస్టు గెలిచింది ద‌క్షిణాఫ్రికా. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభ‌కోణం వెలుగుచూసిన 2000లో 2-0తో టెస్టు సిరీస్ గెలిచింది. మ‌ళ్లీ ఇప్పుడు రెండోసారి వైట్ వాష్ చేయ‌నుంది. ఈ ముప్పును త‌ప్పించుకోవాలంటే బుధ‌వారం అసాధార‌ణ పోరాటం చేయాల్సిందే..!