Begin typing your search above and press return to search.

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

భారత చెస్ చరిత్రలో మరో మైలురాయి నమోదైంది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల అనుజ్ శ్రీవత్రి దేశానికి 100వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన 7వ ఆసియా ప్లస్ వ్యక్తిగత ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని ఈ ఘనత సాధించారు. మధ్యప్రదేశ్ నుంచి గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన తొలి ఆటగాడిగానూ రికార్డు సృష్టించారు.

By:  A.N.Kumar   |   10 Nov 2026 5:00 PM IST
ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం
X

64 గళ్ల చదరంగంపై భారతీయ యువత తన ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. అంతర్జాతీయ చెస్ వేదికపై భారత్ అపూర్వమైన మైలురాయిని స్పృశించింది. దేశంలో గ్రాండ్‌ మాస్టర్ల సంఖ్య అధికారికంగా వందకు చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల యువ ప్రతిభావంతుడు అనుజ్ శ్రీవత్రి భారత్‌కు వందో గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించి చెస్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేపాడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన 7వ ఆసియా ప్లస్ వ్యక్తిగత ఓపెన్ చెస్ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకుని ఆయన ఈ చారిత్రాత్మక ఘనత సాధించారు.

చెస్‌లో 'గ్రాండ్‌మాస్టర్' హోదా సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఏళ్ల తరబడి అంకితభావం.. అపారమైన ఏకాగ్రత.. ఎత్తులకు పైగ్రేసే వ్యూహాత్మక ఆలోచనలు దీని వెనుక ఉంటాయి. టోర్నమెంట్‌లో తొలి గేమ్‌లో ఓటమి ఎదురైనా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా అనుజ్ అద్భుతంగా పుంజుకున్నారు. నిలకడైన ఆటతీరుతో ప్రత్యర్థులను మట్టికరిపించి ఈ అత్యున్నత హోదాను సొంతం చేసుకున్నారు. అంతేకాదు మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన తొలి ఆటగాడిగానూ ఆయన రికార్డు సృష్టించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలను సైతం పక్కన పెట్టి కేవలం చెస్ పై ఉన్న మక్కువతో ఈ కఠిన మార్గాన్ని ఎంచుకున్న ఆయన ప్రయాణం నేటి యువతకు నిజంగా ఒక గొప్ప స్ఫూర్తి.

భారత చెస్ ప్రస్థానాన్ని వెనక్కి తిరిగి చూస్తే.. విశ్వనాథన్ ఆనంద్ రూపంలో ఒక వెలుగురేఖ దేశంలో ఈ క్రీడకు బీజం వేసింది. ఆనంద్ సాధించిన విజయాలే ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాయి. చిన్న చిన్న పట్టణాలు.. మారుమూల గ్రామాల నుంచి కూడా నేడు కుర్రాళ్ళు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా గత ఐదు నెలల వ్యవధిలోనే ఐదుగురు కొత్త గ్రాండ్‌ మాస్టర్లు పుట్టుకొచ్చారంటే భారత చెస్ వేగం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మెరుగవుతున్న శిక్షణా వసతులు ఈ విజయాల వెనుక ప్రధాన బలముగా నిలిచాయి.

ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. వందో గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన అనుజ్ శ్రీవత్రికి అభినందనలు తెలుపుతూ.. భారత యువత కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని కొనియాడారు. భారత్ తన వంద మంది గ్రాండ్‌ మాస్టర్ల మైలురాయిని దాటడం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదని.. రాబోయే రోజుల్లో ప్రపంచ చెస్ రంగాన్ని శాసించే దిశగా మనం వేస్తున్న బలమైన అడుగు అని ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

64 గళ్లపై భారతీయులు మొదలుపెట్టిన ఈ మేధో యుద్ధం ఇప్పుడు ప్రపంచాన్ని నిశ్చేష్టను చేసే స్థాయికి ఎదిగింది. వంద మంది గ్రాండ్‌ మాస్టర్ల ఘనతతో ముగింపు పలకలేదని.. ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం మాత్రమే..