భారత్ కు ఎదురేలేదు.. అక్కడ కూడా పాకిస్తాన్ ఔట్
క్రికెట్‌లో భారత్–పాకిస్తాన్ పోరు అంటే ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన ఘట్టమే. కానీ ఇటీవల సంవత్సరాల్లో ఈ పోరు ఏకపక్షంగా మారిపోతోంది.
By: A.N.Kumar | 7 Nov 2025 4:00 PM ISTక్రికెట్‌లో భారత్–పాకిస్తాన్ పోరు అంటే ఎప్పుడూ ఒక ఉత్కంఠభరితమైన ఘట్టమే. కానీ ఇటీవల సంవత్సరాల్లో ఈ పోరు ఏకపక్షంగా మారిపోతోంది. ఎందుకంటే, భారత జట్టు పాకిస్తాన్‌పై తన ఆధిపత్యాన్ని అన్ని ఫార్మాట్లలోనూ స్పష్టంగా చూపిస్తోంది. పురుషుల జట్టైనా, మహిళల జట్టైనా ప్రతీసారి బలమైన ప్రదర్శనతో పాకిస్తాన్ జట్టును మట్టికరిపిస్తున్నాయి.
ఇప్పుడు, ఆ విజయాల పరంపర హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో కూడా కొనసాగింది. పాకిస్తాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించి, పాక్‌పై తమ అజేయ రికార్డును నిలబెట్టుకుంది.
* మ్యాచ్ వివరాలు: వర్షం ఆపినా భారత్‌దే విజయం
పాకిస్తాన్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కేవలం ఆరు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 86 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (28), చిప్లీ (24), దినేష్ కార్తీక్ (17) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా, ఊతప్ప ఆరంభం నుంచే పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడి మెరుపు షాట్లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
పాకిస్తాన్ చేజింగ్ లో తడబడింది. 87 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు మూడో ఓవర్ ముగిసేసరికి వర్షం అంతరాయం కలిగించింది. ఆ సమయానికి పాకిస్తాన్ 3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. అయితే, వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డిఎల్ఎస్ (డక్ వర్త్ లూయిస్ స్టెర్న్) పద్ధతిని అనుసరించి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించారు. ఈ పద్ధతిలో భారత జట్టు కేవలం రెండు పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది.
* అన్నింటా భారత్ ఆధిపత్యం
ఈ విజయం కేవలం ఒక టోర్నీకే పరిమితం కాదు. ఇటీవల కాలంలో భారత్–పాకిస్తాన్ మధ్య జరిగిన అన్ని ప్రధాన పోటీల్లోనూ భారత జట్టే గెలుస్తూ వస్తోంది. 2023 వన్డే వరల్డ్ కప్ , 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2025 ఆసియా కప్.. ఇలా మొత్తం ఆరు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై భారత్ గెలుపు పతాకం ఎగరేసింది. ఈ రికార్డు భారత క్రికెట్ జట్టుకు పాకిస్తాన్‌పై ఉన్న అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, ఆధిపత్యాన్ని తెలియజేస్తుంది.
మరోవైపు, మహిళల జట్టు కూడా అదే జోరు కొనసాగించింది. ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్తాన్‌ను సులభంగా ఓడించి, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ టీమిండియా ప్రదర్శన అగ్రశ్రేణిలో ఉంది. హాంకాంగ్ సిక్సెస్ 2025 విజయంతో భారత్ మరోసారి నిరూపించింది. పాకిస్తాన్‌పై భారత్ అజేయ పరంపర అద్భుతంగా కొనసాగుతుంది. ఇండియా అంటే పాకిస్తాన్‌కు కలల కంటె భయంకరమని మరోసారి రుజువైంది!
