Begin typing your search above and press return to search.

ఆసిస్ పై విజయం... భారత్ బద్దలు కొట్టిన ప్రపంచ రికార్డులు ఇవే!

50 ఓవర్ల వరల్డ్ టోర్నమెంట్ కొత్త ఛాంపియన్‌ గా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత్ చెప్పకనే చెప్పిన క్షణం. ఈ సందర్భగా బద్దలైన రికార్డులెన్నో!

By:  Raja Ch   |   31 Oct 2025 10:12 AM IST
ఆసిస్ పై విజయం... భారత్ బద్దలు కొట్టిన ప్రపంచ రికార్డులు ఇవే!
X

డగౌట్‌ లో చిరునవ్వులు, ఆనంద భాష్పాలు.. స్టేడియం మొత్తం కరతాల ధ్వనులు, కేకలు, కేరింతలు.. టీవీల ముందు కూర్చున్న వారు ఇంట సంబరాలు.. అమన్ జీత్ కౌర్ విన్నింగ్ షాట్ బౌండరీ కొట్టగానే భారత్ శిబిరలో సంబరాలు స్టార్ట్. 50 ఓవర్ల వరల్డ్ టోర్నమెంట్ కొత్త ఛాంపియన్‌ గా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామంటూ భారత్ చెప్పకనే చెప్పిన క్షణం. ఈ సందర్భగా బద్దలైన రికార్డులెన్నో!

అవును... ఎవరు ఊహించారు, ఇంకెవరు ఊహించలేదు అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. చరిత్రలో నిలిచేపోయే విజయాన్ని భారత క్రికెట్ జట్టు సొంతం చేసుకుంది. ఆసీస్ పై 339 పరుగుల భారీ టార్గెట్‌ ను ఛేదించి తమ సత్తా ఏమిటొ చెప్పింది. ఆదివారం టైటిల్‌ కోసం జరిగే పోరుకు ముందు దక్షిణాఫ్రికాకు భారీ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో బద్దలైన రికార్డులివే!:

* మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఈ నెల ప్రారంభంలో ఇదే టోర్నమెంట్ లీగ్ దశలో భారత్‌ పై ఆస్ట్రేలియా సాధించిన 331 పరుగుల ఛేజింగ్‌ ను ఇది అధిగమించి సరికొత్త రికార్డ్ సృష్టించబడింది.

* వన్డే ప్రపంచ కప్ నాకౌట్‌ లో పురుషుల లేదా మహిళల జట్టు 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఛేదించడం ఇదే మొదటిసారి.

* 2017లో బ్రిస్టల్ లో జరిగిన ప్రపంచ కప్ లో జరిగిన ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ లో మొత్తం రికార్డ్ స్థాయిలో 678 పరుగులు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ రికార్డ్ బద్దలైంది! ఇందులో భాగంగా.. తాజాగా జరిగిన భారత్ – ఆసిస్ మ్యాచ్ లో మొత్తం 679 పరుగులు నమోదయ్యాయి.

* మహిళల వరల్డ్‌ కప్‌ లో ఓ మ్యాచ్‌ లో అత్యధికంగా సిక్స్‌ లు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌ లో ఇరు జట్ల ప్లేయర్లు కలిసి 14 సిక్స్‌ లు కొట్టగా,, ఇందులో భారత్‌ వి 5.. ఆసీస్‌ వి 9!

* ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబ్ లిచ్‌ ఫీల్డ్ ఈ మ్యాచ్‌ లో సెంచరీ (119) చేసింది. వరల్డ్‌ కప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు (22 ఏళ్లు) బ్యాటర్‌ గా రికార్డ్ నెలకొల్పింది.

ఇక వరల్డ్ కప్ లో భారత చరిత్ర విషయానికొస్తే...

* వన్డే ప్రపంచకప్‌ లో ఆస్ట్రేలియాను సెమీస్‌ లో ఓడించి ఫైనల్లో ప్రవేశించడం భారత్‌ కు ఇది రెండోసారి. గతంలో 2017లోనూ సెమీస్ లో ఆసిస్ ను ఇలాగే ఓడించింది!

* ఇదే క్రమంలో... మహిళల వన్డే ప్రపంచకప్‌ లో ఫైనల్‌ చేరడం భారత్‌ కు ఇది మూడోసారి. గతంలో 2005, 2017లో ఫైనల్ కు అర్హత సాధించింది.