124 కొట్టలేక.. స్పిన్ పిచ్ పై చేతులెత్తేసి టీమ్ఇండియా ఘోర పరాజయం
కోల్ కతా టెస్టులో టీమ్ ఇండియాకు షాక్.. కెప్టెన్ శుబ్ మన్ గిల్ లేని బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.. దాదాపు రెండున్నర రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్టులో 124 పరుగుల టార్గెట్ ను కొట్టలేక చేతులెత్తేసింది.
By: Tupaki Entertainment Desk | 16 Nov 2025 5:23 PM ISTకోల్ కతా టెస్టులో టీమ్ ఇండియాకు షాక్.. కెప్టెన్ శుబ్ మన్ గిల్ లేని బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.. దాదాపు రెండున్నర రోజుల్లోనే ముగిసిన మొదటి టెస్టులో 124 పరుగుల టార్గెట్ ను కొట్టలేక చేతులెత్తేసింది. స్వదేశంలో ఘోర పరాజయం పాలైంది. ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిపోయి రెండు టెస్టుల సిరీస్ 0-1తో వెనుకబడింది. ఈ నెల 22 నుంచి అసోంలోని గువాహటిలో రెండో టెస్టు జరగనుంది. స్పిన్ తో పాటు పేస్ కూ సహకరించిన పిచ్ పై టీమ్ ఇండియా పరాజయం పాలవడంతో పిచ్ మీద విమర్శలు వస్తున్నాయి. బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బందిపడిన నేపథ్యంలో అసలు ఇది ఈడెన్ గార్డెన్స్ మైదానమేనా? అన్న ప్రశ్నలు వచ్చాయి. క్యురేటర్ సుజన్ ముఖర్జీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) చీఫ్, దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ రంగంలోకి దిగాడు.
పిచ్ దేముంది..? ఆటగాళ్లది బాధ్యత కదా?
పిచ్ మీద విమర్శలు వస్తున్నా.. అసలు టీమ్ మేనేజ్ మెంట్ కోరిక మేరకే పిచ్ ను రూపొందించారు అన్నది గంగూలీ వాదన. మ్యాచ్ కు ముందు నాలుగు రోజులు నీటి తడి (వాటర్ క్యూరింగ్) చేయలేదని అతడు తెలిపాడు. అందుకే ఇలా స్పందించింది అని పేర్కొన్నాడు. కాగా , ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159, రెండో ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 189, రెండో ఇన్నింగ్స్ లో 93కే ఆలౌటైంది. అంటే రెండు జట్లలో నాలుగు ఇన్నింగ్స్ లో ఒక్కసారీ 200 మార్క్ దాటలేదు. అంతేకాదు.. దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా (55 నాటౌట్) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు.
1997 తర్వాత ఇదే ఘోర ఓటమి
టీమ్ ఇండియాకు 1997 తర్వాత టెస్టుల్లో ఇదే ఘోర ఓటమి. అప్పట్లో వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన మన జట్టు బ్రిడ్జిటౌన్ లో జరిగిన మ్యాచ్ లో 120 పరుగుల టార్గెట్ ఛేదించలేకపోయింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై 124 పరుగుల టార్గెట్ ను అందుకోలేకపోయింది. టెస్టుల్లో దక్షిణాఫ్రికా కాపాడుకున్న రెండో అత్యల్ప టార్గెట్ కూడా ఇదే కావడం గమనార్హం.
