20 ఏళ్ల తర్వాత భారత్ లో కామన్వెల్త్ గేమ్స్..2036 ఒలింపిక్స్ కూడా
2036 ఒలింపిక్స్ కంటే ముందే భారత్ ఓ పెద్ద క్రీడా సంబరానికి వేదిక కానుంది. అవి కామన్వెల్త్ క్రీడలు. ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాల మధ్య జరిగేవే కామన్వెల్త్ క్రీడలు.
By: Tupaki Political Desk | 16 Oct 2025 7:00 AM ISTసరిగ్గా రెండేళ్ల కిందట వన్డే ప్రపంచకప్.. వచ్చే ఫిబ్రవరిలో టి20 ప్రపంచ కప్.. భారత్ ఆతిథ్యం ఇచ్చిన, ఇవ్వనున్న ప్రముఖ క్రీడా టోర్నీలు. అయితే, ఇవి క్రికెట్ కు సంబంధించినవి. మన దేశంలో ప్రపంచ స్థాయి క్రీడా సంబరం అయిన ఒలింపిక్స్ కు ఇంకా టైమ్ రాలేదు. ఇప్పటికిప్పుడు లెక్కేసినా రూ.2 లక్షల కోట్లు ఖర్చయ్యే ఒలింపిక్స్ నిర్వహణ అంటే మామూలు మాటలు కాదు. 2032 ఒలింపిక్స్ వేదిక (ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్) కూడా ఇప్పటికే ఖరారైంది. ఇక 2036 ఒలింపిక్స్ కు భారత్ బిడ్ వేసింది. దాదాపు మన దేశానికే దక్కేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
దానికంటే ముందు ఇది...
2036 ఒలింపిక్స్ కంటే ముందే భారత్ ఓ పెద్ద క్రీడా సంబరానికి వేదిక కానుంది. అవి కామన్వెల్త్ క్రీడలు. ఒకప్పటి బ్రిటిష్ పాలిత దేశాల మధ్య జరిగేవే కామన్వెల్త్ క్రీడలు. 20 ఏళ్ల తర్వాత భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో జరిగే కామన్వెల్త్ క్రీడలను అహ్మదాబాద్ లో నిర్వహించేందుకు ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫారసు చేసింది. నవంబరు 26న బోర్డు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం రానుంది.
నైజీరియా అబూజా కాదు.. మన అహ్మదాబాద్
2010లో కామన్వెల్త్ గేమ్స్ భారత రాజధాని ఢిల్లీలో జరిగాయి. మళ్లీ 20 ఏళ్ల తర్వాత 2030లో ఈ గేమ్స్ కు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదిక కానుంది. అయితే, నైజీరియా రాజధాని అబూజా కూడా కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు పోటీపడినా అహ్మదాబాద్ వైపే మొగ్గారు.
2036 ఒలింపిక్స్ చాన్స్ దక్కినట్లే...
2028లో అమెరికాలో, 2032లో ఆస్ట్రేలియాలో జరిగే ఒలింపిక్స్ తర్వాత 2036 ఒలింపిక్స్ కు భారత్ అహ్మదాబాద్ ను వేదికగా చూపుతూ బిడ్ వేసింది. 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణను విజయవంతం చేయడం ద్వారా ఒలింపిక్స్ కు మార్గం పడినట్లే. అదే జరిగితే.. చరిత్రలో తొలిసారి భారత్ కు ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కినట్లు అవుతుంది.
