Begin typing your search above and press return to search.

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై రాజకీయ దుమారం రేగింది. పేరు, మతం కారణంగానే సిరాజ్‌ను పక్కన పెట్టారంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. పిచ్ పరిస్థితులు, జట్టు అవసరాల మేరకే తుది జట్టును ఎంపిక చేశామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశారు.

By:  A.N.Kumar   |   22 Nov 2026 4:58 PM IST
టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు..  సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..
X

భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు.. అది కోట్లాది మంది ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక బలమైన భావోద్వేగం. సాధారణంగా జట్టు గెలుపోటములు.. ఆటగాళ్ల ఫామ్.. వ్యూహాల చుట్టూ సాగాల్సిన పయనం.. అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌కు చోటు దక్కకపోవడంతో మొదలైన క్రీడాపరమైన చర్చ.. రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో మతం.. ప్రాంతం వంటి సున్నితమైన అంశాల వైపు మళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రస్తుత సైకిల్‌లో 11 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీసి భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్‌ను పక్కన పెట్టడం క్రీడా వర్గాలను ఆశ్చర్యపరిచింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లకు తుది జట్టులో అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి తెరలేపాయి. సిరాజ్‌కు అతడి పేరు కారణంగానే అవకాశం ఇవ్వలేదని గతంలో ఆరోపించిన మసూద్.. తాజాగా మహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్ పేర్లను కూడా ప్రస్తావించారు. ఆటగాళ్ల ఎంపికలో ప్రాంతం.. పేర్లకు కాకుండా కేవలం వారి ప్రతిభకు.. ప్రదర్శనకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారత జట్టు మేనేజ్‌మెంట్ దీనిని ఖండించింది. సిరాజ్‌తో పాటు గుర్నూర్ బ్రార్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చాలా కఠినమైన నిర్ణయమని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేర్కొన్నారు. గతంలో వారి ప్రదర్శన బాగున్నప్పటికీ పిచ్ పరిస్థితులు.. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్పులు చేసినట్లు ఆయన వివరించారు. అందుబాటులో ఉన్న వనరుల్లో అత్యుత్తమ తుది జట్టునే ఎంపిక చేశామని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కూడా సమర్థించుకున్నారు.

ఇమ్రాన్ మసూద్ ఆరోపణలపై అధికార.. ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. దేశంలో క్రీడాకారులకు కేవలం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు లభిస్తాయని.. జట్టు ఎంపికలో మతపరమైన వివక్ష ఉందనడంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. మరోవైపు సొంత పార్టీ ఎంపీ రంజీత్ రంజన్ సైతం మసూద్ వ్యాఖ్యలతో విభేదిస్తూ క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. విమర్శలు తీవ్రమవడంతో అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని.. కాంగ్రెస్ పార్టీ అధికారిక వైఖరి కాదని మసూద్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కాగా మహమ్మద్ షమీ ఈ నెల ప్రారంభంలోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. సర్ఫరాజ్ ఖాన్ చివరిసారిగా 2024 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో తుది జట్టు ఎంపిక అనేది ఆటగాళ్ల ఫిట్‌నెస్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్.. ప్రత్యర్థి బలాబలాలు.. పిచ్ స్వభావం వంటి అనేక సాంకేతిక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత సెలక్షన్ కమిటీపై ఎంత ఉందో.. తమ నిర్ణయాల వెనుక ఉన్న హేతుబద్ధతను పారదర్శకంగా వివరించాల్సిన అవసరం కూడా అంతే ఉంది.

జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే క్రికెట్ మైదానాన్ని రాజకీయ వివాదాలకు వేదికగా మార్చకుండా ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఆటగాళ్లు తమ ప్రదర్శనతో.. సెలెక్టర్లు తమ నిష్పక్షపాత నిర్ణయాలతో అభిమానుల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నప్పుడే భారత క్రికెట్ ప్రతిష్ట మరింత ఇనుమడిస్తుంది.