డ్రగ్స్ ఉచ్చులో జింబాబ్వే స్టార్ సీన్ విలియమ్స్: క్రికెట్ కెరీర్‌కు శాశ్వత తెర!
డబ్బు, కీర్తి అరుదుగా వచ్చే క్రికెట్ ప్రపంచంలో కొందరు క్రీడాకారులు వాటిని సంపాదించిన తరువాత దారి తప్పడం సర్వసాధారణం.
By: A.N.Kumar | 6 Nov 2025 3:00 AM ISTడబ్బు, కీర్తి అరుదుగా వచ్చే క్రికెట్ ప్రపంచంలో కొందరు క్రీడాకారులు వాటిని సంపాదించిన తరువాత దారి తప్పడం సర్వసాధారణం. అయితే జింబాబ్వే క్రికెట్‌కు ఆశాదీపంలా వెలిగిన సీనియర్ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ మాత్రం అలాంటి ఓ విషవలయంలో చిక్కుకుని తన అంతర్జాతీయ కెరీర్‌కు శాశ్వతంగా తెరదించుకున్నారు.
జింబాబ్వే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విలియమ్స్, కష్టాల్లో ఉన్న జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు లెక్కకు మిక్కిలి. కానీ, తాజాగా ఆయన స్వయంగా డ్రగ్స్ (మత్తుపదార్థాలకు) బానిసయ్యానని అంగీకరించడం అంతర్జాతీయ క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
* ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నుండి ఎందుకు తప్పుకున్నారంటే...
వార్తల ప్రకారం, సీన్ విలియమ్స్ ఇటీవలి వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం ఐసీసీ (ICC) నిర్వహించే తప్పనిసరి యాంటీ-డోపింగ్ పరీక్షలు ఎదుర్కోవడానికి భయపడటమేనని తెలుస్తోంది. తనకున్న డ్రగ్స్ అలవాటు కారణంగా డోపింగ్ పరీక్షల్లో దొరికిపోవడం ఇష్టంలేకనే ఆయన ఈ కీలక టోర్నమెంట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం.
ఈ అంశంపై జింబాబ్వే క్రికెట్ బోర్డు అత్యంత కఠినంగా స్పందించింది. 39 ఏళ్ల ఈ వెటరన్‌ను ఏ ఫార్మాట్‌లోనూ జాతీయ జట్టులోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. దీనితో విలియమ్స్ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు దాదాపు ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
* ఇప్పుడు పునరావాసంలో...
జింబాబ్వేకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ప్రస్తుతం పునరావాస కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. డ్రగ్ వ్యసనం కారణంగా శాశ్వత నిషేధం పొందిన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
ఒకప్పుడు ఆశాకిరణంగా నిలిచిన విలియమ్స్, తన కెరీర్ చరమాంకంలో డ్రగ్స్ ఉచ్చులో పడిపోవడం క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. క్రీడాకారులు ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
