Begin typing your search above and press return to search.

ట్రాన్స్‌జెండర్లకు క్రికెట్.. మేల్/ఫిమేల్.. ఏ క్రికెట్ లో ఆడించాలి.. పెద్ద చిక్కొచ్చి పడిందే?

అంటే ఇకపై బోర్డర్ దాటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే కేవలం కవర్ డ్రైవ్‌లు, సిక్సర్లు కొడితే సరిపోదు... సర్టిఫికెట్లు, రూల్‌బుక్‌లు ముందేసుకుని బయోలాజికల్ లెక్కలు తేల్చుకోవాల్సిందే..

By:  A.N.Kumar   |   27 Aug 2026 3:21 PM IST
ట్రాన్స్‌జెండర్లకు క్రికెట్.. మేల్/ఫిమేల్.. ఏ క్రికెట్ లో ఆడించాలి.. పెద్ద చిక్కొచ్చి పడిందే?
X

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటివరకు అవుట్‌స్వింగ్, ఇన్-స్వింగ్, యార్కర్ల గారడీలను మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విసిరిన కొత్త ‘పాలసీ గూగ్లీ’కి మైదానంలో ఆటగాళ్లతో పాటు మైండ్లు కూడా వికెట్లు పడిపోతున్నాయి. మగవారిగా పుట్టి ఆ తర్వాత లింగమార్పిడి చేయించుకున్న ట్రాన్స్‌జెండర్ ప్లేయర్లు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో ఆడటానికి వీల్లేదంటూ ఐసీసీ పక్కా క్లారిటీ ఇచ్చేసింది. అంటే ఇకపై బోర్డర్ దాటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలంటే కేవలం కవర్ డ్రైవ్‌లు, సిక్సర్లు కొడితే సరిపోదు... సర్టిఫికెట్లు, రూల్‌బుక్‌లు ముందేసుకుని బయోలాజికల్ లెక్కలు తేల్చుకోవాల్సిందే..

ఐసీసీ "నో"... లోకల్ బోర్డుల "సై"

ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ నిషేధపు తాళం కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే పరిమితం. మరి డొమెస్టిక్ క్రికెట్ సంగతేంటి? అంటే..."మా పని అయిపోయింది. ఇక మీ ఇష్టం" అని ఐసీసీ బంతిని ఆయా దేశాల క్రికెట్ బోర్డుల కోర్టులోకి నెట్టేసింది. దాంతో ఇప్పుడు దేశానికో రూలు, పిచ్‌కో పాలసీ తయారైంది. ఆస్ట్రేలియా బోర్డు మాత్రం "మా రూల్స్ మావి" అంటూ ముందుకెళ్తోంది. ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనాయా బంగర్‌కు అక్కడ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించడమే దీనికి నిదర్శనం.

మన బీసీసీఐ దగ్గరికొచ్చేసరికి స్పష్టమైన విధానం లేక కథ ఇంకా నాన్‌-స్ట్రైకర్ ఎండ్‌లోనే ఆగిపోయింది. అసలు ఎవరిని రానివ్వాలి? ఎవరిని వద్దనాలి? అనే దానికి పాలసీ కంటే ముందే ప్రశ్నల బౌన్సర్లు ఎక్కువైపోతున్నాయి.బంతి స్వింగ్ అవుతుందో లేదో గానీ.. పాలసీలు మాత్రం భలే తిరుగుతున్నాయి.

అంతర్జాతీయ స్థాయిలో ఆడితే నో... అదే ఆస్ట్రేలియాలో లోకల్ లీగ్ ఆడితే యెస్... మరి ఇండియాలో ఆడితే వికెట్ల మధ్య రన్ అవుట్ టైప్ సస్పెన్స్. ఇలా దేశానికో న్యాయం ఉంటే ప్లేయర్లు ప్రాక్టీస్ నెట్స్‌లో జరగాలా లేక లీగల్ టీమ్ ఆఫీసుల్లో జరగాలా?

ఏది ఏమైనా ఒకప్పుడు ‘క్రికెట్‌లో ఎవరు గెలవాలి?’ అనే నిర్ణయం కేవలం అంపైర్ల వేలి చివర ఉండేది. కానీ ఇప్పుడు ‘ఎవరు మైదానంలో దిగాలి?’ అని తేల్చే బాధ్యత పాలసీ మేకర్ల చేతిలోకి వెళ్ళిపోయింది. రేపో మాపో మైదానంలోకి దిగేముందు థర్డ్ అంపైర్ నాటౌటా కాదా అని చూడటం మానేసి.. జెండర్ సర్టిఫికెట్ స్క్రీనింగ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. భవిష్యత్తులో ఈ రెంటికి మధ్య సమన్వయం కుదురుతుందో లేక ప్లేయర్లు మ్యాచ్ మధ్యలోనే రూల్‌బుక్స్ పట్టుకుని అంపైర్లతో వాదించాల్సి వస్తుందో వేచి చూడాలి.