భారత్ లో బంగ్లాదేశ్ అంపైర్లు.. ఆ దేశ క్రికెట్ బోర్డు దొంగాట
తమపేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పించడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రగిలిపోతోంది
By: Tupaki Political Desk | 12 Jan 2026 5:00 PM ISTతమపేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పించడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రగిలిపోతోంది. నేరుగా భారత్ ను ఏమీ అనలేక డొంకతిరుగుడు పద్ధతుల్లో వెళ్తోంది. బంగ్లాలో మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుంటే అడ్డుకోలేని మొహమ్మద్ యూనస్ సర్కారు.. భారత్ లో తమ జట్టు టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లను ఆడలేదని చెబుతోంది. ఈ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని కోరింది. అయితే, బంగ్లాదేశ్ దొంగాట ప్రస్తుతం జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ సిరీస్ ద్వారా బయటపడింది. ఆదివారం ఈ రెండు జట్లు గుజరాత్ లోని వడోదరలో తొలి వన్డే మ్యాచ్ ఆడాయి. బుధవారం రెండో వన్డేలో తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్ కు అంపైర్ గా ఉన్నారు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయన పేరు సర్ఫుద్దౌలా సైకత్. బహుశా మిగతా రెండు వన్డేలకు కూడా ఈయన కొనసాగే చాన్సుంది.
టి20 ప్రపంచ కప్ లోనూ...
భారత్ తో పాటు, శ్రీలంకలో వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న టి20 ప్రపంచ కప్ లోనూ బంగ్లా అంపైర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. ప్రపంచ కప్ మ్యాచ్ లలో కూడా సైకత్ అంపైరింగ్ చేయనున్నాడు. గాజీ సొహైల్ అనే మరో అంపైర్ కూడా టి20 ప్రపంచ కప్ లో అంపైర్ గా ఉండనున్నాడు. అయితే, ఈ నేపథ్యంలో భారత్ లో బంగ్లా జట్టు పర్యటనకు ఇబ్బంది వస్తుంది.. అంపైర్లు ఉంటే రాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
మీ అంపైర్ కు లేని ఇబ్బందా?
భారత్ లో ప్రేక్షుకులు క్రికెట్ ను క్రికెట్ లాగానే చూస్తారు. అతి చేయరు. ఈ విషయం సైకత్ విధి నిర్వహణ సాఫీగా సాగడం ద్వారా స్పష్టమైంది. ఒకవేళ ఏమైనా కక్ష పెట్టుకుంటే సైకత్ ను ఎగతాళి చేసేవారు. అలాకాకుండా అతడు 99 ఓవర్లు అంపైర్ గా బాధ్యతల్లో ఉన్నాడు.
ఐసీసీ కూడా షాక్ ఇవ్వనుందా?..
తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లో జరిగే తమ టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లను లంకకు మార్చాలంటున్న బంగ్లా బోర్డు ప్రతిపాదనను ఐసీసీ పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. ఎందుకంటే, కోల్ కతా, ముంబైకి బదులుగా ఐసీసీ.. బంగ్లాకు తిరువనంతపురం, చెన్నైలను ఎంపికచేసుకోవాలని ఆప్షన్ ఇచ్చింది. అదీ కుదరదంటే.. మీ అంపైర్ ఇప్పటికే భారత్-న్యూజిలాండ్ సిరీస్ కు బాధ్యతలు నిర్వర్తించారు కదా? అని నిలదీసే చాన్సుంది.
