Begin typing your search above and press return to search.

డీమెరిట్ ర‌వూఫ్‌.. 2 మ్యాచ్ లు ఔట్.. మ్యాచ్ ఫీజు న‌ఖ్వీ క‌డ‌తాడా?

ఆసియా క‌ప్ ముగిసి 40 రోజులు అవుతోంది. పాకిస్థాన్ జ‌ట్టు స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ ఆడుతోంది.

By:  Tupaki Entertainment Desk   |   5 Nov 2025 6:00 PM IST
డీమెరిట్ ర‌వూఫ్‌.. 2 మ్యాచ్ లు ఔట్.. మ్యాచ్ ఫీజు న‌ఖ్వీ క‌డ‌తాడా?
X

ఆట త‌క్కువ‌.. వివాదాలు ఎక్కువ అన్న‌ట్లు.. బౌలింగ్ చేసేది ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును గెలిపించ‌డానికే అన్న‌ట్లు.. వేగం ఉంటే స‌రిపోదు.. బంతిపై నియంత్ర‌ణ కూడా ఉండాలి అనేందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంటాడు పాకిస్థాన్ పేస్ బౌల‌ర్ హారిస్ ర‌వూఫ్‌. మూడేళ్ల కింద‌ట ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచ క‌ప్ లో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మ‌న్ విరాట్ కోహ్లి చేతిలో పిచ్చ కొట్టుడు కొట్టించుకున్నాడు. ఇటీవ‌లి ఆసియా కప్ లో హైద‌రాబాదీ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ చేతిలో ప‌రాభ‌వానికి గుర‌య్యాడు. పాకిస్థాన్ దిగ్గ‌జ పేస‌ర్ వ‌సీమ్ అక్ర‌మ్ నుంచి బౌలింగ్ ర‌న్ మెషీన్ (ప‌రుగులు ధారాళంగా ఇచ్చే) అనే చెడ్డ‌ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ర‌వూఫ్ ఆసియా క‌ప్ లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో రెచ్చిపోయాడు. సెప్టెంబ‌రు 14న జ‌రిగిన మ్యాచ్ లో... పెహ‌ల్గాం ఉగ్ర‌దాడి అనంత‌రం భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ లో ఆరు భార‌త యుద్ధ విమానాల‌ను కూల్చి వేశాం అన్న‌ట్లు చేతి వేళ్లు చూపుతూ సంకేతాలు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లోనే టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌మ జ‌ట్టు విజ‌యాన్ని సైనిక ద‌ళాల‌కు అంకితం చేశాడు. అయితే, ర‌వూఫ్ చేసిన సంకేతాల‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తీవ్రంగా తీసుకుంది.

ఇప్పుడు ఏమిటి ప‌రిస్థితి..?

ఆసియా క‌ప్ ముగిసి 40 రోజులు అవుతోంది. పాకిస్థాన్ జ‌ట్టు స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ ఆడుతోంది. కానీ, ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ ల‌కు ర‌వూఫ్ అందుబాటులో లేడు. ఎందుకంటే.. ఆసియా క‌ప్ లో త‌న ప్ర‌వ‌ర్త‌న కార‌ణం. నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు గాను అత‌డిపై అప్పుడే 30 శాతం మ్యాచ్ ఫీజు జ‌రిమానా విధించింది ఐసీసీ. సూర్యకూ ఇంతే మొత్తం జ‌రిమానా వేసింది. కానీ, ర‌వూఫ్ కే ఎక్కువ న‌ష్టం జ‌రిగింది.

24 నెల‌లు... 4 డీ మెరిట్ పాయింట్లు..

రవూఫ్ ఖాతాలో సెప్టెంబ‌రు 14 నాటి మ్యాచ్ లో ప్ర‌వ‌ర్త‌న‌కు గాను 2 డీమెరిట్ పాయింట్లు ప‌డ్డాయి. ఇక సెప్టెంబ‌రు 28న ఫైన‌ల్ మ్యాచ్ లోనూ అత‌డి ప్ర‌వ‌ర్త‌న మార‌లేదు. దీంతో మ‌రో 2 డీ మెరింట్ పాయింట్లు చేరాయి. 24 నెల‌ల్లో 4 డీమెరింట్ పాయింట్లు ఎదుర్కొంటే రెండు మ్యాచ్ ల నిషేధం విధిస్తారు. ఇప్పుడదే జ‌రిగింది. ద‌క్షిణాఫ్రికాతో స్వ‌దేశంలో వ‌న్డే సిరీస్ రెండు మ్యాచ్ ల‌కు దూర‌మ‌య్యాడు. కాగా, ఆసియా క‌ప్ ఫైన‌ల్లో ఇదే ర‌వూఫ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు భార‌త మేటి పేస‌ర్ బుమ్రా. ఆ స‌మ‌యంలో విమానం దూసుకెళ్లింది అన్న‌ట్లు సంకేతాలు చేశాడు. దీనికిముందు పాకిస్తాన్ ఓపెన‌ర్ ఫ‌ర్హాన్ కూడా తుపాకీ కాల్పులు (గ‌న్ ఫైర్) సంకేతాలు ఇచ్చాడు. వీరిద్ద‌రికీ చెరో డీ మెరిట్ పాయింట్ ప‌డింది.

కొస‌మెరుపుః ర‌వూఫ్ పై విధించిన 30 శాతం మ్యాచ్ ఫీజు జ‌రిమానాను త‌న సొంత డ‌బ్బుల నుంచి క‌డ‌తాన‌ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మ‌న్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మ‌న్ మొహిసిన్ న‌ఖ్వీ చెప్పాడు. ఆసియా క‌ప్ ట్రోఫీని ఎత్తుకెళ్లిన అత‌డు త‌ర్వాత తీవ్ర వివాదంలో కూరుకున్నాడు. ఇప్పుడు ర‌వూఫ్ ఫైన్ ను న‌ఖ్వీ చెల్లిస్తాడా? అనేది చూడాలి.