Begin typing your search above and press return to search.

మెగా టోర్నీకి మ‌హా బ్రాండ్... హిట్ మ్యాన్ కు స‌రిపోయే హోదా

టి20 ప్ర‌పంచ క‌ప్.. అందులోనూ భార‌త్ ఆతిథ్యం.. పైగా ఐపీఎల్ ముంగిట‌.. ఈ నేప‌థ్యంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను టోర్నీ బ్రాండ్ అంబాసిండ‌ర్ గా నియ‌మించింది ఐసీసీ.

By:  Tupaki Political Desk   |   26 Nov 2025 9:33 AM IST
మెగా టోర్నీకి మ‌హా బ్రాండ్... హిట్ మ్యాన్ కు స‌రిపోయే హోదా
X

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన తొమ్మిదికి తొమ్మిది ప్ర‌పంచ క‌ప్ ల‌లో ఆడిన విశేష అనుభ‌వం.. టి20 ప్ర‌పంచ క‌ప్ తోనే అంత‌ర్జాతీయ కెరీర్ మొద‌లుపెట్టి అదే టి20 ప్రపంచ క‌ప్ టైటిల్ అందుకుని ఈ ఫార్మాట్ కు వీడ్కోలు.. అంత‌ర్జాతీయ టి20ల్లో రికార్డు స్థాయిలో ఏకంగా ఐదు సెంచ‌రీలు... ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో కెప్టెన్ గా ఐదు టైటిళ్లు అందించిన చెరిగిపోని రికార్డు..! ఇప్ప‌టికీ టి20ల‌లో విధ్వంసం రేప‌గ‌ల స‌త్తా..! ఇవ‌న్నీ ఒక్క ప్లేయ‌ర్ వే..! ఇలాంటి ఆట‌గాడిని ఇప్పుడు అదే ప్రపంచ క‌ప్ న‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మించారు. దీంతో ఒక ప్ర‌పంచ క‌ప్ న‌కు ఇంత‌కంటే బ్రాండ్ ఎవ‌రు ఉంటారు? అనే ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఏడాది ఫ్రిబ‌వ‌రి 7 నుంచి మార్చి 8 వర‌కు జ‌రిగే ప‌దో టి20 ప్రపంచ క‌ప్ న‌కు భార‌త్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016 త‌ర్వాత పొట్టి ఫార్మాట్ విశ్వ‌స‌మరానికి మ‌న దేశం వేదిక కావ‌డం ఇదే ప్ర‌థమం. 2007లో మొద‌లైన ఈ టోర్నీని ఆ ఏడాది ద‌క్షిణాఫ్రికా నిర్వ‌హించింది. త‌ర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, యూఈఏ-ఒమ‌న్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌-యూఎస్ఏల‌లో టోర్నీ జ‌రిగింది. 2012లో శ్రీలంక‌, 2016లో భార‌త్ సొంతంగా నిర్వ‌హించాయి. ఇప్ప‌డు క‌లిసి ఆతిథ్యం ఇస్తున్నాయి.

మొన‌గాడికే బ్రాండింగ్ బాధ్య‌త‌లు..

టి20 ప్ర‌పంచ క‌ప్.. అందులోనూ భార‌త్ ఆతిథ్యం.. పైగా ఐపీఎల్ ముంగిట‌.. ఈ నేప‌థ్యంలోనే టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను టోర్నీ బ్రాండ్ అంబాసిండ‌ర్ గా నియ‌మించింది ఐసీసీ. గ‌త ఏడాది ప్ర‌పంచ క‌ప్ గెలిచిన జ‌ట్టు కెప్టెన్ అయిన రోహిత్ ఆ వెంట‌నే అంత‌ర్జాతీయ టి20ల‌కు గుడ్ బై చెప్పాడు. ఈ ఏడాది మేలో టెస్టుల నుంచి కూడా వైదొల‌గాడు. కేవ‌లం వ‌న్డేల్లోనే ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. కాగా, 2007 నుంచి జ‌రిగిన 9 టి20 ప్రపంచ క‌ప్ ల‌లోనూ రోహిత్ ఆడడం గ‌మ‌నార్హం. వీటిలో రెండుసార్లు (2007, 2024) విజేత‌గా నిలిచిన జ‌ట్టులో ఉన్నాడు. 2024లో అత‌డే కెప్టెన్ కూడా. 2007 టి20 ప్ర‌ప‌చ క‌ప్ తోనే రోహిత్ శ‌ర్మ 20 ఏళ్ల వ‌య‌సులో అంత‌ర్జాతీయ కెరీర్ మొద‌లైంది. ఇప్పుడు 18 ఏళ్ల విశేష అనుభ‌వంతో అత‌డు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

జ‌ట్టులో మార్పులు అవ‌స‌రం లేదు..

ఐసీసీ టి20 ప్రపంచ క‌ప్ షెడ్యూల్ విడుద‌ల సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రోహిత్ మాట్లాడాడు. ప్ర‌స్తుత టీమ్ ఇండియా కూర్పుపై స్పందించారు. కుర్రాళ్లు బాగా ఆడుతున్నార‌ని.. ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టులో పెద్ద‌గా మార్పులు అవ‌స‌రం లేద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. న్యూజిలాండ్ తో జ‌రిగే టి20 సిరీస్ త‌ర్వాత సెల‌క్ట‌ర్లు టి20 ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టుపై ఒక అంచనాకు వ‌స్తార‌ని అంచ‌నా వేశాడు. టి20 క్రికెట్ లో కొన‌సాగిన‌ప్పుడు తాను అంబాసిడ‌ర్ గా ఎంపిక కాలేద‌ని ఇప్పుడు ద‌క్కిన‌ది గొప్ప గౌర‌వం అని చెప్పుకొచ్చాడు. ప్ర‌పంచ విజేత ట్యాగ్ కోసం తామెంత త‌పించామో వివ‌రించిన రోహిత్.. క‌ప్ లు కొట్ట‌లేక పోయిన‌ స‌మ‌యంలో తీవ్ర నిరాశ‌కు గురైన‌ట్లు తెలిపాడు. కానీ, ఈసారి టీమ్ ఇండియా కుర్రాళ్లు మ‌ళ్లీ దేశాన్ని విజేత‌గా నిలుపుతార‌నే ఆశాభావం వ్య‌క్తం చేశాడు.